RCB vs DC: ఐపీఎల్‎లో మరో బ్లాక్ బస్టర్ పోరు.. హోంగ్రౌండ్‎లో RCB గెలుపు రుచి చూసేనా..?

RCB vs DC: ఐపీఎల్‎లో మరో బ్లాక్ బస్టర్ పోరు.. హోంగ్రౌండ్‎లో RCB గెలుపు రుచి చూసేనా..?

బెంగళూరు: ఈ సీజన్‌‌లో చెరో మూడు విజయాలతో జోరుమీదున్న రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కీలక పోరుకు రెడీ అయ్యాయి. గురువారం జరిగే లీగ్‌‌ మ్యాచ్‌‌లో గెలిచి టాప్‌‌ ప్లేస్‌‌ను మరింత సుస్థిరం చేసుకోవాలని డీసీ భావిస్తుండగా, నంబర్‌‌ వన్‌‌లో నిలవాలని ఆర్సీబీ ప్లాన్‌‌ చేస్తోంది. ఆడిన మూడు మ్యాచ్‌‌ల్లో నెగ్గిన ఢిల్లీ మంచి కాన్ఫిడెన్స్‌‌తో ఉంది. 

కోల్‌‌కతా, చెన్నై, ముంబై వంటి బలమైన జట్లపై ప్రత్యర్థి హోం గ్రౌండ్లలో నెగ్గిన ఆర్సీబీ సొంతగడ్డపై గుజరాత్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో ఓడింది. ఇప్పుడు ఢిల్లీని దెబ్బకొట్టి హోం గ్రౌండ్‌లో తొలి విజయం అందుకోవాలని  బెంగళూరు కృతనిశ్చయంతో ఉంది.  జీటీతో మ్యాచ్‌‌లో విఫలమైన స్టార్‌‌ బ్యాటర్‌‌ విరాట్‌‌ కోహ్లీపై అందరి ఫోకస్‌‌ నెలకొంది. 

అదే టైమ్‌‌లో డీసీ టాప్‌‌ పేసర్‌‌ మిచెల్‌‌ స్టార్క్‌‌, లెఫ్టార్మ్‌‌ స్పిన్నర్‌‌ కుల్దీప్‌‌ యాదవ్‌‌.. విరాట్‌‌ను ఎంత వరకు కట్టడి చేస్తారన్న ఉత్కంఠ కూడా మొదలైంది. మూడు మ్యాచ్‌‌ల్లో స్టార్క్‌‌ తొమ్మిది వికెట్లు పడగొట్టి మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. కాబట్టి పవర్‌‌ప్లేలో స్టార్క్‌‌ వర్సెస్‌‌ కోహ్లీగా మ్యాచ్‌‌ జరగనుంది. ఒకవేళ ఇన్నింగ్స్‌‌ మిడిల్‌‌ వరకు ఉంటే కుల్దీప్‌‌ నుంచి కూడా ముప్పు ఉంటుంది. ఈ మధ్య కాలంలో కోహ్లీ లాఫ్టెడ్‌‌, స్వీప్‌‌ షాట్లతో స్పిన్నర్లపై ఆధిపత్యం చూపెడుతున్నాడు. 

ఈ స్ట్రాటజీ కుల్దీప్‌‌, అక్షర్‌‌ పటేల్‌‌ విషయంలో సక్సెస్‌‌ అవుతుందా..? చూడాలి. కెప్టెన్‌‌ రజత్‌‌ పటీదార్‌‌, ఫిల్‌‌ సాల్ట్‌‌, దేవదత్‌‌ పడిక్కల్‌‌, లివింగ్‌‌స్టోన్‌‌, టిమ్‌‌ డేవిడ్‌‌ బ్యాట్లు ఝుళిపిస్తే భారీ స్కోరు ఖాయం. పవర్‌‌ప్లే బౌలింగ్‌‌లో హేజిల్‌‌వుడ్‌‌, భువనేశ్వర్‌‌, యష్‌‌ దయాల్‌‌ రాణిస్తే రాయల్‌‌ చాలెంజర్స్‌‌కు తిరుగుండదు. క్రునాల్‌‌ పాండ్యా స్పిన్‌‌ మ్యాజిక్‌‌ కీలకం కానుంది.

మరోవైపు డీసీ బ్యాటింగ్‌‌ కూడా బలంగా ఉంది. చిన్నస్వామి పిచ్‌‌ పరిస్థితులు తెలిసిన కేఎల్‌‌ రాహుల్‌‌ మంచి ఫామ్‌‌లో ఉన్నాడు. డుఫ్లెసిస్‌‌ ఫిట్‌‌నెస్‌‌పై సందిగ్ధత కొనసాగుతున్నా.. ఓపెనింగ్‌‌లో మెక్‌‌గర్క్‌‌ మంచి పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ నెలకొల్పాల్సి ఉంది. అభిషేక్‌‌ పోరెల్‌‌, సమీర్‌‌ రిజ్వీ, ట్రిస్టాన్‌‌ స్టబ్స్‌‌, అశుతోష్‌‌ శర్మ, విప్రజ్‌‌ నిగమ్‌‌ రాణిస్తే డీసీకి ఎదురుండబోదు.