
- పంజాబ్‌పై ఆర్సీబీ రివెంజ్
- మెరిసిన కోహ్లీ, పడిక్కల్, బౌలర్లు
- 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
ముల్లన్‌పూర్: సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమికి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 48 గంటల వ్యవధిలోనే భారీ ప్రతీకారం తీర్చుకుంది. విరాట్ కోహ్లీ (54 బాల్స్‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 73 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (35 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 61) మెరుపులతో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో పంజాబ్‌ను ఓడించింది. దాంతో ప్రత్యర్థి వేదికల్లో ఆడిన ఐదో మ్యాచ్‌లోనూ విజయం సొంతం చేసుకొని మూడో స్థానానికి చేరుకుంది. ఈ ఏకపక్ష పోరులో తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 157/6 స్కోరు మాత్రమే చేసింది.
ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ (17 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 33), శశాంక్ సింగ్ (33 బాల్స్‌లో 1 ఫోర్‌తో 31 నాటౌట్) టాప్ స్కోరర్లు. ఆర్సీబీ బౌలర్లలో క్రునాల్ పాండ్యా (2/25), సుయాశ్ శర్మ (2/26) చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆర్సీబీ 18.5 ఓవర్లలోనే 159/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
బౌలర్ల కట్టడి
టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రజత్ పటీదార్ నిర్ణయానికి ఆర్సీబీ పూర్తి న్యాయం చేశారు. భారీ హిట్టర్లు ఉన్న పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. కింగ్స్ ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (22), ప్రభ్‌సిమ్రన్ పవర్‌ప్లేలో దూకుడుగా ఆడారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో రెండు రన్సే వచ్చినా ఆ తర్వాతి మూడు ఓవర్లలో ఓపెనర్ ఏడు ఫోర్లు, ఓ సిక్స్ బాదారు. దాంతో పటీదార్ ఐదో ఓవర్లోనే స్పిన్నర్ క్రునాల్ పాండ్యాను బరిలోకి దింపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన క్రునాల్.. తన రెండో బాల్‌కే ఆర్యను ఔట్ చేసి తొలి వికెట్‌కు 42 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ప్రభ్‌సిమ్రన్ 6, 4 కొట్టడంతో పవర్ ప్లేను పంజాబ్ 62/1తో ముగించి మంచి స్కోరు చేసేలా కనిపించింది.
కానీ, క్రునాల్ బౌలింగ్‌లో టిమ్ డేవిడ్‌కు క్యాచ్ ఇచ్చి ప్రభ్‌సిమ్రన్ ఔటైన తర్వాత పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ కుదేలైంది. శ్రేయస్ అయ్యర్ (6) ఫెయిలయ్యాడు. రొమారియో షెపర్డ్ బౌలింగ్‌లో క్రునాల్ అద్భుత క్యాచ్‌తో అతన్ని పెవిలియన్ పంపించాడు. జోష్ ఇంగ్లిస్ (29)తో సమన్వయ లోపంతో నేహల్ వాధెరా (5) రనౌటయ్యాడు. ఆర్సీబీ స్పిన్నర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో పంజాబ్ రన్‌రేట్ పడిపోయింది. కాసేపు ప్రతిఘటించే ప్రయత్నం చేసిన ఇంగ్లిస్ తో పాటు హార్డ్ హిట్టర్ స్టోయినిస్ (1)ను సుయాష్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ 14వ ఓవర్లలో 114/6తో డీలా పడింది.
మిడిల్ ఓవర్లలో పంజాబ్ కేవలం 67 రన్స్ మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. స్లాగ్ ఓవర్లలో శశాంక్ సింగ్, మార్కో యాన్సెన్ (25 నాటౌట్) పోరాడినా ఆర్సీబీ బౌలర్లు అత్యంత పొదుపుగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా భువనేశ్వర్, హేజిల్‌వుడ్ తమ చివరి ఓవర్లలో ఎనిమిది యార్కర్లు వేసి సత్తాచాటారు. యాన్సెన్ లాస్ట్ బాల్‌కు సిక్స్ కొట్టినా చివరి నాలుగు ఓవర్లలో పంజాబ్ 28 రన్స్ మాత్రమే రాబట్టి అతి కష్టంగా 150 మార్కు దాటింది.
పడిక్కల్, కోహ్లీ జోరు
పంజాబ్ తడబడిన వికెట్‌పై కోహ్లీ, పడిక్కల్ పంజా విసరడంతో చిన్న టార్గెట్‌ను ఆర్సీబీ అలవోకగా అందుకుంది. ఛేజింగ్‌లో బెంగళూరుకు సరైన ఆరంభం దక్కలేదు. ఇన్నింగ్స్ ఆరో బాల్‌కే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (1)ను ఔట్ చేసిన అర్ష్‌దీప్ కింగ్స్ శిబిరంలో ఆశలు రేపాడు. కానీ, ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీతో పాటు పడిక్కల్ ప్రత్యర్థికి ఎలాంటి చాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా పడిక్కల్ చాన్నాళ్ల తర్వాత తన టాలెంట్ చూపెట్టాడు. తొలుత విరాట్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ ససోర్ట్ ఇవ్వగా దేవదత్ భారీ షాట్లతో ఎటాక్ చేశాడు. బార్ట్‌లెట్ బౌలింగ్‌లో తను సిక్స్ కొడితే.. అర్ష్‌దీప్ ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు బాదడంతో పవర్ ప్లేలో ఆర్సీబీ 54/1 స్కోరు చేసింది. ఆపై స్పిన్నర్ చహల్‌కు పడిక్కల్ తన సిగ్నేచర్ స్టైల్ ఇన్‌సైడ్-అవుట్ సిక్స్‌తో వెల్‌కం చెప్పాడు.
ఇంకోవైపు కోహ్లీ క్లాసిక్ షాట్లతో అలరించాడు. బార్ట్‌లెట్ ఓవర్లో సిక్స్, ఫోర్ రాబట్టిన పడిక్కల్ రెండేండ్ల విరామం తర్వాత లీగ్‌లో ఫిఫ్టీ (30 బాల్స్‌లో) పూర్తి చేసుకున్నాడు. ఆపై స్టోయినిస్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టడంతో 12 ఓవర్లకు ఆర్సీబీ స్కోరు వంద దాటింది. హర్‌ప్రీత్ బౌలింగ్‌లో మరో షాట్‌కు ట్రై చేసి వాధెరకు చిక్కడంతో రెండో వికెట్‌కు 103 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. అప్పటికే మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లగా కోహ్లీ తన జోరును కొనసాగిస్తూ 43 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అర్షదీప్ బౌలింగ్‌లో బ్యాక్ కట్ బౌండ్రీతో అలరించిన అతను చహల్ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టాడు. అదే ఓవర్లో కెప్టెన్ రజత్ (12) ఔటైనా... వాధెర బౌలింగ్‌లో జితేష్ శర్మ (11 నాటౌట్) సిక్స్‌తో మ్యాచ్ ముగించాడు.
67 ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది 67వ ఫిఫ్టీ ప్లస్ స్కోరు. లీగ్‌లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా అతను డేవిడ్ వార్నర్ (66) రికార్డును బ్రేక్ చేశాడు.
ఒకే బాల్‌కు.. 4 రన్స్ పరుగెత్తారు
ఈ మ్యాచ్‌లో కోహ్లీ, పడిక్కల్ అద్భుతమైన సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. వికెట్ల మధ్య మెరుపు వేగంతో పరుగెత్తారు. అర్ష్‌దీప్ వేసిన మూడో ఓవర్లో బాల్‌ను పడిక్కల్ డీప్ మిడ్ వికెట్ మీదగా కొట్టి కోహ్లీతో కలిసి నాలుగు రన్స్ తీయడం విశేషం.
సంక్షిప్త స్కోర్లు
- పంజాబ్ కింగ్స్: 20 ఓవర్లలో 157/6 (ప్రభ్‌సిమ్రన్ 33, శశాంక్ 31*, క్రునాల్ 2/25).
- బెంగళూరు: 18.5 ఓవర్లలో 159/3 (కోహ్లీ 73*, పడిక్కల్ 61, అర్ష్‌దీప్ 1/26).