ఇలాంటివి RCB ఆటగాళ్లకే సాధ్యం.. మరీ ఇంత బద్ధకం పనికిరాదు!

ఇలాంటివి RCB ఆటగాళ్లకే సాధ్యం.. మరీ ఇంత బద్ధకం పనికిరాదు!

ఆటలో గెలుపోటములు సహజం కావచ్చు కానీ, ఒక ఆటగాడి అలసత్వం వల్ల మ్యాచ్ ఓడితే.. ఆ జట్టు సహచర ఆటగాళ్లు, ఆ జట్టును ఆదరించే అభిమానులు పడే బాధ వర్ణనాతీతం. అలాంటి ఘటన ఒకటి మేజర్ లీగ్ టోర్నీలో చోటుచేసుకుంది. అందుకు తగిన మూల్యం కూడా చెల్లించుకున్నాడు సదరు ఆటగాడు. 

ఏం జరిగిందంటే?

మేజర్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆదివారం శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, సియాటెల్ ఆర్కాస్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూనికార్న్స్‌ స్టార్ బ్యాటర్, ఆర్‌సీబీ క్రికెటర్ ఫిన్ అలెన్ చాలా బద్దకంగా ఔటయ్యాడు. ఆ ఫలితం ఆ జట్టును ఓటమి బాట పట్టించింది. 

తొలుత బ్యాటింగ్ చేసిన సియాటెల్ ఆర్కాస్ నిర్ణీత ఓవర్లలో 177 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్య చేధనకు దిగిన శాన్ ఫ్రాన్సిస్కో ధీటుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది. 3 ఓవర్లలోనే 42 పరుగులు చేసి.. విజయం దిశగా అడుగులు వేసింది. కానీ 4వ ఓవర్‌లోనే వారికి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 10 బంతుల్లోనే 28 పరుగులు చేసిన ఫిన్ అలెన్.. రనౌట్ అయ్యాడు. లేజీగా పరుగు పూర్తి చేసేందుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. అతని బద్దకాన్ని గమనించిన ఫీల్డర్ మెరుపు త్రోతో వికెట్లను గిరాటెయ్యగా.. దేవుడు అతనికి సహాయపడ్డాడు. ఫిన్.. తన బ్యాట్‌ను క్రీజులో పెట్టనివ్వకుండా అడ్డుపడ్డాడు. బ్యాట్‌ పిచ్‌లో ఇరుక్కుపోయేలా చేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ రనౌట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్‌సీబీ ఆటగాళ్లందరూ ఇలాంటి మేధావులే అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. గల్లీ క్రికెట్‌లో ఇలాంటి తప్పులను సహాయించవచ్చేమో కానీ, ఒక దేశానికి ఆడుతున్నప్పుడో.. ఒక ప్రాంచైజీకి ఆడుతున్నప్పుడో వీటిని ఏమాత్రం సహించకూడదని మరికొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.