
- రాజస్తాన్‌పై 9 వికెట్ల తేడాతో విజయం
- చెలరేగిన సాల్ట్, కోహ్లీ, పడిక్కల్
- జైస్వాల్, జురెల్ శ్రమ వృధా
జైపూర్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్రత్యర్థి గడ్డపై మరోసారి గర్జించింది. టార్గెట్ ఛేజింగ్‌లో ఫిల్ సాల్ట్ (33 బాల్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 65), విరాట్ కోహ్లీ (45 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 నాటౌట్), దేవదత్ పడిక్కల్ (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 40 నాటౌట్) దంచికొట్టడంతో... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై అలవోకగా గెలిచింది.
టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 173/4 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (47 బాల్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75), ధ్రువ్ జురెల్ (23 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్), రియాన్ పరాగ్ (22 బాల్స్‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 30) మెరుగ్గా ఆడారు. తర్వాత బెంగళూరు 17.3 ఓవర్లలో 175/1 స్కోరు చేసింది. సాల్ట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
జైస్వాల్ ధనాధన్..
స్లో పిచ్‌పై బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ను కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు సక్సెస్ అయినా పేలవ ఫీల్డింగ్‌తో ఇబ్బందిపడ్డారు. ఆరంభంలో పేసర్లు హేజిల్‌వుడ్ (1/26), భువనేశ్వర్ (1/32), యష్ దయాల్ (1/36) లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు తొలి నాలుగు ఓవర్లలో కేవలం 24 రన్స్ మాత్రమే ఇచ్చారు. అయితే దయాల్ వేసిన ఐదో ఓవర్‌లో జైస్వాల్ 6, 4తో 12 రన్స్ రాబట్టాడు. మూడు రన్స్ వద్ద రనౌట్ నుంచి తప్పించుకున్న శాంసన్ (15) ఆరో ఓవర్‌లో తొలి ఫోర్ కొట్టాడు. దీంతో పవర్‌ప్లేలో రాజస్తాన్ 45/0 స్కోరు చేసింది. కానీ ఏడో ఓవర్‌లో క్రునాల్ పాండ్యా (1/29) వేసిన బాల్‌ను తప్పుగా అంచనా వేసి శాంసన్ స్టంపౌట్ కావడంతో తొలి వికెట్‌కు 49 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ దశలో వచ్చిన రియాన్ పరాగ్ నెమ్మదిగా ఆడాడు.
13 రన్స్ వద్ద దయాల్ క్యాచ్ డ్రాప్ చేయడంతో బయటపడిన అతను 10వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టడంతో స్కోరు బోర్డు 77/1గా మారింది. 11వ ఓవర్‌లో సిక్స్‌తో కాస్త జోరు పెంచగా, జైస్వాల్ 35 బాల్స్‌లో హాఫ్ సెంచరీ సాధించాడు. కానీ 14వ ఓవర్‌లో దయాల్.. పరాగ్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 56 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. కొత్తగా వచ్చిన ధ్రువ్ జురెల్ 11 రన్స్ వద్ద ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లీ అనూహ్యంగా వదిలేశాడు. 16వ ఓవర్‌లో 6, 4 కొట్టి జైస్వాల్ వెనుదిరగడంతో మూడో వికెట్‌కు 21 రన్స్ జతయ్యాయి. హెట్‌మయర్ (9) నిరాశపర్చినా.. జురెల్ 6, 4, 4, నితీశ్ రాణా (4 నాటౌట్) ఫోర్ బాదాడు. చివరి నాలుగు ఓవర్లలో 47 రన్స్ వచ్చాయి.
‘టాప్’ లేపారు..
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఆర్సీబీ టాప్–3 బ్యాటర్లు దుమ్మురేపారు. తొలి ఓవర్‌లో 4, 6తో ఆట మొదలుపెట్టిన సాల్ట్ రాయల్స్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. రెండో ఓవర్‌లో ఫోర్‌తో టచ్‌లోకి వచ్చిన కోహ్లీ కూడా ఎక్కడా తగ్గలేదు. మూడు, ఐదో ఓవర్‌లో సాల్ట్ 4, 6.. 4, 6 దంచితే మధ్యలో కోహ్లీ రెండు బౌండ్రీలు రాబట్టాడు. ఆరో ఓవర్‌లో సాల్ట్ మళ్లీ 6, 4 రాబట్టడంతో పవర్‌ప్లేలో 65/0 స్కోరు వచ్చింది. 8వ ఓవర్‌లో 4, 6 కొట్టిన సాల్ట్ 28 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు.
కానీ 9వ ఓవర్‌లో మరో సిక్స్ కొట్టి కార్తికేయ (1/25)కు వికెట్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 92 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. కోహ్లీతో కలిసిన పడిక్కల్ కూడా ఇన్నింగ్స్‌లో వేగం తగ్గకుండా చూశాడు. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదాడు. దీంతో ఫస్ట్ టెన్‌లో ఆర్సీబీ 101/తో నిలిచింది. బౌలర్లు మారినా ఈ ఇద్దరి జోరు ఏమాత్రం తగ్గకపోవడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. 13, 14వ ఓవర్లలో 6, 4తో రెచ్చిపోయిన కోహ్లీ 15వ ఓవర్‌లో 6, 4తో 39 బాల్స్‌లో ఫిఫ్టీని ఖాతాలో వేసుకున్నాడు. 16వ ఓవర్‌లో పడిక్కల్ సిక్స్, ఫోర్‌తో 13 రన్స్ రాబట్టాడు. చివర్లో మరో రెండు ఫోర్లతో రెండో వికెట్‌కు 83 రన్స్ జత చేసి ఈజీగా విజయాన్ని అందించాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 173/4 (జైస్వాల్ 75, ధ్రువ్ జురెల్ 35*, హాజిల్‌వుడ్ 1/26). బెంగళూరు: 17.3 ఓవర్లలో 175/1 (సాల్ట్ 65, కోహ్లీ 62*, పడిక్కల్ 40*, కుమార్ కార్తికేయ 1/25).
కోహ్లీ@ 100 ఫిఫ్టీలు
టీ20 ఫార్మాట్‌లో వంద ఫిఫ్టీలు కొట్టిన తొలి ఇండియన్‌గా, ఓవరాల్‌గా రెండో ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కాడు. తన 405వ మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. డేవిడ్ వార్నర్ 108 (400 మ్యాచ్‌లు) ఫిఫ్టీలతో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.