IPL Retention 2025: కోహ్లీ కెప్టెన్ అని ఎవరన్నారు.. మీరు అనుకుంటే సరిపోద్దా..?: RCB డైరెక్టర్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టడం దాదాపుగా ఖాయమైందని కొంతకాలంగా ప్రచారం జరిగింది. విరాట్ కోహ్లీని రూ. 21 కోట్ల రూపాయలకు ఆర్సీబీ రిటైన్ చేసుకోవడం.. అదే సమయంలో ఫాఫ్ డుప్లెసిస్ ను రిలీజ్ చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. కోహ్లీనే స్వయంగా బెంగళూరు కెప్టెన్సీ అడిగినట్టుగా వార్తలు కూడా వచ్చాయి. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు. అయితే వారి ఆశలపై ఆర్సీబీ  డైరెక్టర్ నీళ్లు చల్లాడు. తాజాగా ఆయన స్పందిస్తూ ఈ వార్తల్లో నిజం లేదని తేల్చేశాడు. 

ఐపీఎల్ 2025 సీజన్‌కు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లిని తిరిగి నియమించే అవకాశం ఉందన్న పుకార్లను ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ కొట్టిపారేశాడు. మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రిలీజ్ చేసిన తర్వాత బెంగళూరు కెప్టెన్సీ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. "కోహ్లీ మళ్లీ కెప్టెన్సీని చేపట్టడంపై ఊహాగానాలు వస్తున్నాయి. ఆర్సీబీ కెప్టెన్ కోసం ప్రయత్నాలు జరుపుతుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తిరిగి రావడంపై మేం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు". అని బోబాట్ జియో సినిమాతో అన్నారు. 

Also Read:-తోడు దొరికింది.. విదేశీ భామతో తిరుగుతోన్న గబ్బర్

కోహ్లీ ఆర్సీబీ చరిత్రలో అత్యంత అనుభవజ్ఞుడైన కెప్టెన్‌. 35 ఏళ్ల విరాట్.. 143 మ్యాచ్‌లలో  బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ చేశాడు. కోహ్లీ  నాయకత్వంలో ఆర్సీబీ 2016 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్‌కు చేరుకుంది. ఈ సీజన్ లో కోహ్లీ కెప్టెన్సీతో పాటు బ్యాటర్ గాను పలు రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు సెంచరీలతో పాటు మొత్తం 973 పరుగులు చేసి ఒకే సీజన్ ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఇప్పటికీ కొనసాగుతున్నాడు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసుకున్న ప్లేయర్ల విషయానికి వస్తే విరాట్ కోహ్లీతో పాటు యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్, బౌలర్ యశ్ దయాల్‎ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీకి రూ.21 కోట్లు, రజత్ పాటిదార్‎కు రూ.11 కోట్లు, యశ్ దయాల్‎కు రూ.5 కోట్లు చెల్లించింది. ఈ ముగ్గురి కోసం ఆర్సీబీ తమ పర్స్‎లోని రూ.37 కోట్లు కేటాయించింది. మిగిలిన రూ.83 కోట్లతో ఆర్సీబీ మెగా వేలానికి వెళ్లనుంది. అయితే, ఆర్సీబీ తమ టీమ్ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్,  టీ20ల్లో విధ్వంసర ఆటగాడిగా పేరుగాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్ మ్యాక్స్ వెల్, టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్‎ను ఆర్సీబీ వేలానికి వదిలేసింది.