RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్‌పై ధోనీ అసంతృప్తి

RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్‌పై ధోనీ అసంతృప్తి

ఐపీఎల్ లో భాగంగా శనివారం (మే 18) చెన్నై సూపర్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 27 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. మరోవైపు చెన్నై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో బెంగళూరు విజయం సాధించేసరికీ ఆ జట్టు ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. మ్యాచ్ గెలిచిన అనంతరం గ్రౌండ్ మొత్తం తిరుగుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ క్రమంలో చెన్నై ఆటగాళ్లకు ఆగ్రహం తెప్పించారు. 

సాధారణంగా మ్యాచ్ గెలిచిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారు. అలాగే ఈ మ్యాచ్ లో చెన్నై ప్లేయర్లు ప్రత్యర్థి  బెంగళూరు ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి క్యూలో నిలబడ్డారు. అయితే అప్పటికే ఆనందంలో మునిగిపోయిన ఆర్సీబీ ప్లేయర్స్ చెన్నై ఆటగాళ్లను పట్టించుకోలేదు. ధోనీ ఈ వరుసలో ముందు ఉండడం విశేషం. ఎంతసేపటికీ ఆర్సీబీ ప్లేయర్స్ రాకపోయేసరికి ధోనీ అటుగుండా అటు డ్రెసింగ్ రూమ్ వైపు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆర్సీబీ మితిమీరిన సెలెబ్రేషన్ పై విమర్శల వర్షం కురుస్తుంది. కామెంటేటర్లు హర్ష భోగ్లే, మైకేల్ వాన్ బెంగళూరు ప్లేయర్లపై మండిపడ్డారు.  గెలిచినా తమ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ను మరిచారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు 27  రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది. తొలుత  ఆర్‌‌‌‌సీబీ 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. ప్లేఆఫ్స్‌‌ చేరేందుకు 201 రన్స్‌‌ చేయాల్సిన చెన్నై ఛేజింగ్‌‌లో  ఓవర్లన్నీ ఆడి 191/7 స్కోరు చేసి ఓడింది.