
బెంగళూరు: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఇంట గెలిచింది. ఈ సీజన్‌లో సొంతగడ్డపై వరుసగా మూడు పరాజయాల తర్వాత గెలుపు రుచి చూసింది. విరాట్ కోహ్లీ (42 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో70), దేవదత్ పడిక్కల్ (27 బాల్స్‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) సూపర్ బ్యాటింగ్‌కు తోడు బౌలర్లు సమష్టిగా రాణించడంతో.. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్సీబీ 11 రన్స్ తేడాతో రాజస్తాన్ రాయల్స్‌పై గెలిచింది.
టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 205/5 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 194/9 స్కోరుకే పరిమితమైంది. యశస్వి జైస్వాల్ (19 బాల్స్‌లో 7 ఫోర్లు, 3సిక్సర్లతో 49), ధ్రువ్ జురెల్ (34 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47) రాణించినా చివర్లో హాజిల్‌వుడ్ (4/33) దెబ్బకు లోయర్ ఆర్డర్ చేతులెత్తేసింది. హేజిల్‌వుడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. తాజా ఓటమితో రాజస్తాన్ ప్లే ఆఫ్ ఆశలు దాదాపుగా ముగిశాయి.
బ్యాటర్ల జోరు..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ బ్యాటర్లు రాయల్స్ బౌలింగ్‌పై పూర్తి ఆధిపత్యం చూపెట్టారు. తొలి రెండు ఓవర్లలో కోహ్లీ, సాల్ట్ (26) చెరో ఫోర్ మాత్రమే కొట్టినా తర్వాత బ్యాట్లు ఝుళిపించారు. మూడో ఓవర్‌లో కోహ్లీ వరుసగా రెండు, ఆ తర్వాత సాల్ట్ మూడు ఫోర్లు బాదారు. దీంతో బెంగళూరు 59/0తో పవర్‌ప్లేను ముగించింది. కానీ ఏడో ఓవర్‌లో హసరంగ (1/30) సాల్ట్‌ను ఔట్ చేసి తొలి వికెట్‌కు 61 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఈ దశలో పడిక్కల్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేయడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 24 రన్సే వచ్చాయి.
దీంతో సగం ఓవర్లకు ఆర్సీబీ 83/1 స్కోరు చేసింది. 11వ ఓవర్‌లో పడిక్కల్ ఫోర్‌తో 11 రన్స్ రాగా, తర్వాతి ఓవర్‌లో కోహ్లీ వరుస ఫోర్లతో 32 బాల్స్‌లో 60వ ఐపీఎల్ ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్‌లో లాస్ట్ బాల్‌ను పడిక్కల్ బౌండ్రీగా మల్చడంతో స్కోరు వంద దాటింది. 13వ ఓవర్ నుంచి ఈ ఇద్దరు మరింత జోరు పెంచారు. పడిక్కల్ 4, 6, 6, 6తో 26 బాల్స్‌లోనే ఫిఫ్టీ అందుకున్నాడు.
కోహ్లీ కూడా 6, 6 దంచడంతో 15 ఓవర్లలో స్కోరు 156/1కి పెరిగింది. కానీ 16వ ఓవర్‌లో ఆర్చర్ (1/33) వైడ్ బాల్‌ను షాట్‌గా మలిచే ప్రయత్నం కోహ్లీ కవర్స్‌లో రాణా చేతికి చిక్కడంతో రెండో వికెట్‌కు 95 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. పడిక్కల్‌తో పాటు రజత్ పటీదార్ (1)ను 17వ ఓవర్‌లో ఐదు బాల్స్ తేడాలో సందీప్ (2/45) పెవిలియన్‌కు పంపాడు. చివర్లో టిమ్ డేవిడ్ (23), జితేష్ శర్మ (20 నాటౌట్) ధనాధన్ షాట్లతో చెలరేగడంతో ఆర్సీబీ స్కోరు రెండొందలు దాటింది.
చేరువై.. దూరమై
భారీ ఛేజింగ్‌లో రాజస్తాన్‌కు అదిరిపోయే ఆరంభం లభించినా.. చివర్లో ఆర్సీబీ బౌలర్లు అద్భుతం చేశారు. ఓపెనర్లు జైస్వాల్ 6, 4, 4, 6తో మెరుపులు మెరిపిస్తే ... వైభవ్ సూర్యవంశీ (16) కూడా సిక్స్‌తో టచ్‌లోకి వచ్చాడు. దీంతో తొలి మూడు ఓవర్లలోనే 34 రన్స్ వచ్చాయి. నాలుగో ఓవర్‌లో జైస్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టినా.. ఐదో ఓవర్‌లో భువనేశ్వర్ (1/50) దెబ్బకు ఔటయ్యాడు.
నితీష్ రాణా (28) సిక్స్‌తో ఖాతా తెరిచినా, ఆరో ఓవర్‌లో జైస్వాల్ 4, 4, 6 కొట్టి హేజిల్‌వుడ్‌కు వికెట్ ఇచ్చాడు. రెండో వికెట్‌కు 20 రన్స్ జతకాగా పవర్‌ప్లేలో రాజస్తాన్ 72/2తో నిలిచింది. ఇక్కడి నుంచి పరాగ్ (22) దూకుడుగా ఆడాడు. 4, 6, 4, 6తో బ్యాట్ ఝుళిపించాడు. కానీ 9వ ఓవర్‌లో క్రునాల్ (2/31) వేసిన వైడ్ యార్కర్‌కు వెనుదిరిగాడు. మధ్యలో రాణా 4, 4, 4తో ఫస్ట్ టెన్‌లో రాయల్స్ 113/3 స్కోరు చేసింది.
ఈ దశలో వచ్చిన ధ్రువ్ జురెల్ స్ట్రయిక్ రొటేట్ చేయడంతో స్కోరు బోర్డు మందగించింది. చివరకు 14వ ఓవర్‌లో క్రునాల్ టర్నింగ్ బాల్‌తో రాణా వికెట్ తీయడంతో స్కోరు 134/4గా మారింది. భారీ హిట్టర్ హెట్‌మయర్ (11) ఫోర్ కొట్టినా ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. రెండో ఎండ్‌లో జురెల్ 6, 6 బాదడంతో విజయసమీకరణం 24 బాల్స్‌లో 46 రన్స్‌గా మారింది.
ఈ దశలో భువీ బౌలింగ్‌లో శుభమ్ దూబే (12) 4, 6, జురెల్ 6, 4, 4తో 28 రన్స్ రాబట్టి ఆశలు రేకెత్తించారు. ఇక విజయానికి12 బాల్స్‌లో 18 రన్స్ అవసరమైన దశలో హేజిల్‌వుడ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. వరుస బాల్స్‌లో జురెల్, ఆర్చర్ (0)ను ఔట్ చేసి మ్యాచ్‌లో ఉత్కంఠ తీసుకొచ్చాడు. చివర్లో 8 బాల్స్‌లో 17 రన్స్ చేసే క్రమంలో దూబే, హసరంగ (1) కూడా ఔటవడంతో రాజస్తాన్‌కు ఓటమి తప్పలేదు.