- 8 వికెట్ల తేడాతో గుజరాత్ చిత్తు
- మెరిసిన మంధాన, రేణుక
బెంగళూరు : సొంతగడ్డపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అమ్మాయిలు సూపర్ పెర్ఫామెన్స్‌చేస్తున్నారు. విమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో వరుసగా రెండో విజయం అందుకున్నారు. తొలి పోరులో చిన్న టార్గెట్‌ను కాపాడుకున్న ఆర్‌సీబీ ఈసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. గుజరాత్ వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 107/7 స్కోరు మాత్రమే చేసింది.
దయలన్ హేమలత (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 31 నాటౌట్), ఓపెనర్ హర్లీన్ డియోల్ (31 బాల్స్‌లో 3 ఫోర్లతో 22) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ మొలినుక్స్ (3/25) మూడు, రేణుకా సింగ్ (2/14) రెండు వికెట్లు తీశారు. అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన (27 బాల్స్‌లో 8 ఫోర్లు, 1 సిక్స్‌తో 43), సబ్బినేని మేఘన (28 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 12.3 ఓవర్లలోనే 110/2 స్కోరు చేసి గెలిచింది. ఎలైస్ పెర్రీ (14 బాల్స్‌లో 4 ఫోర్లతో 23 నాటౌట్) కూడా రాణించింది. రేణుకకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
కష్టంగా వంద
మొదట బ్యాటింగ్‌కు వచ్చిన గుజరాత్ ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. అతి కష్టంగా ఆ జట్టు స్కోరు వంద దాటింది. ఆర్‌సీబీ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రన్స్ తీసేందుకు ఇబ్బంది పడింది. ఓపెనర్ల్ హర్లీన్ డియోల్ ఆరంభంలో జాగ్రత్తగా ఆడగా.. వెంటవెంటనే రెండు ఫోర్లతో జోరు మీద కనిపించిన మరో ఓపెనర్ బెత్ మూనీ (8) ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయింది. మూడో ఓవర్లో మూనీని బౌల్డ్ చేసిన రేణుక ఆర్‌సీబీకి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది. రేణుకతో పాటు మరో పేసర్ సోఫీ డివైన్ కట్టడి చేయడంతో ఐదు ఓవర్లకు గుజరాత్ 16 రన్స్ మాత్రమే చేసింది.
ఆరో ఓవర్లో ఫస్ట్ చేంజ్‌గా స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ బౌలింగ్‌కు రాగా.. హర్లీన్ రెండు ఫోర్లు, లిచ్‌ఫీల్డ్ ఓ ఫోర్ కొట్టడంతో 13 రన్స్ రాబట్టిన గుజరాత్ పవర్ ప్లేను 29/1తో ముగించింది. రేణుక వేసిన తర్వాతి ఓవర్లోనే ఫార్వర్డ్ డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో లిచ్ ఫీల్డ్ స్టంపౌటైంది. ఆ తర్వాత వేదా కృష్ణమూర్తి (9) తన నాలుగో బాల్‌నే పెర్రీ బౌలింగ్‌లో సిక్స్ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేసింది. కానీ, ఆర్‌సీబీ బౌలర్లు మళ్లీ ఒత్తిడి పెంచారు. తర్వాతి రెండు ఓవర్లలో నాలుగే రన్స్ ఇవ్వడంతో 10 ఓవర్లకు గుజరాత్ 44/2తో నిలిచింది.
11వ ఓవర్లో మొలినుక్స్ నాలుగు బాల్స్ తేడాలో వేదతో పాటు క్రీజులో కుదురుకున్న హర్లీన్‌ను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థిని దెబ్బకొట్టింది. ఈ దశలో హేమలత రెండు ఫోర్లు కొట్టి ఇన్నింగ్స్‌కు చలనం తెచ్చినా గార్డ్‌నర్ (7), కేథరిన్ బ్రైస్ (3) కూడా నిరాశ పరిచారు. స్నేహ్ రాణా (12) తోడుగా హేమలత ముందుకెళ్లింది. మొలినూక్స్ వేసిన 19వ ఓవర్లో లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టగా.. లాస్ట్ బాల్‌కు మరో షాట్ ట్రై చేసిన రాణా స్టంపౌట్ అయింది. తనూజ కన్వర్ (4 నాటౌట్)తో కలిసి హేమలత స్కోరు వంద దాటించింది.
ఈజీగా ఛేజింగ్
చిన్న టార్గెట్‌ను ఆర్‌సీబీ ఈజీగా ఛేజ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన ఫస్ట్ బాల్ నుంచే దంచికొట్టింది. తహుహు తొలి ఓవర్లోనే మూడు ఫోర్లతో జోరు చూపెట్టిన ఆమె మేఘనా సింగ్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు బౌండ్రీలు కొట్టింది. మరో ఓపెనర్ సోఫీ డివైన్ (6)ను గార్డ్‌నర్ ఔట్ చేసినా మంధాన వెనక్కుతగ్గలేదు. బ్రైస్ వేసిన ఐదో ఓవర్లో ఇంకో రెండు ఫోర్లు రాబట్టిన మంధానకు తెలుగమ్మాయి మేఘన తోడైంది. పవర్ ప్లే తర్వాత తహుహు మళ్లీ బౌలింగ్‌కు రాగా స్మృతి స్ట్రయిట్ సిక్స్‌తో వెల్‌కం చెప్పింది. ఆ వెంటనే స్నేహ్ రాణా బౌలింగ్‌లో మేఘన వరుస రెండు ఫోర్లతో స్పీడు అందుకోగా.. మంధాన కూడా ఓ ఫోర్ కొట్టింది. ఫిఫ్టీకి దగ్గరైన మంధాన తొమ్మిదో ఓవర్లో ఫుల్ లెంగ్త్ బాల్‌కు తనూజకు రిటర్న్ క్యాచ్ ఇచ్చింది. దాంతో రెండో వికెట్‌కు 40 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. అప్పటికే మ్యాచ్ ఆర్‌సీబీ చేతుల్లోకి రాగా.. ఎలైస్ పెర్రీ తోడుగా మేఘన జోరు కొనసాగించింది. తనూజ ఓవర్లో లాంగాఫ్ మీదుగా సూపర్ సిక్స్, ఫోర్‌తో అలరించింది. రాణా బౌలింగ్‌లో పెర్రీ విన్నింగ్ ఫోర్ కొట్టడంతో ఆర్‌సీబీ మరో 45 బాల్స్ మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది.