RCB vs CSK: ఫలించని చెన్నై వ్యూహాలు.. బెంగుళూరు భారీ స్కోర్

RCB vs CSK: ఫలించని చెన్నై వ్యూహాలు.. బెంగుళూరు భారీ స్కోర్

సొంతగడ్డపై బెంగళూరు బ్యాటర్లు వీరవిహారం చేశారు. ప్లే ఆఫ్ రేసును నిర్ణయించే మ్యాచ్ కావడంతో భాద్యతాయుతంగా ప్రతి ఒక్కరూ రాణించారు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(39 బంతుల్లో 54; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. రజత్ పటిదార్(23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 4సిక్స్‌లు), విరాట్ కోహ్లీ(29 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), కామెరాన్ గ్రీన్(17 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) పరుగులు చేశారు. దీంతో రాయల్ చాలెంజర్స్.. బెంగుళూరు ఎదుట 219 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగుళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ (47), డుప్లెసిస్ (54) ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి మూడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31 పరుగులు రాబట్టారు. ఆ సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. కొద్దిసేపటి అనంతరం ఆట తిరిగి ప్రారంభం కాగా.. పిచ్‌ సిన్నర్లకు సహకరించడంతో రుతురాజ్ స్పిన్‌ వ్యూహాన్ని అమలుచేశాడు. మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ, రవీంద్ర జడేజాలను ముగ్గురిని దింపి పరుగులు రాకుండా కట్టడిచేశాడు.

పరుగుల వేగం మందగించడంతో దూకుడు ఆడే ప్రయత్నంలో విరాట్ కోహ్లీ (47; 29 బంతులలో) ఔటయ్యాడు. అక్కడినుంచి డుప్లెసిస్(54), రజత్ పటిదార్(41), కామెరాన్ గ్రీన్(37 నాటౌట్) పరుగుల వేగాన్ని పెంచారు. స్పిన్నర్లను వదిలేసి పేసర్లను టార్గెట్ చేశారు. తుషార్ దేశ్‌పాండే, శార్దూల్ ఠాకూర్, సిమర్‌జీత్ సింగ్ త్రయాన్ని ఊచకోత కోశారు. చివరలో దినేష్ కార్తీక్(6 బంతుల్లో 14), గ్లెన్ మాక్స్‌వెల్(5 బంతుల్లో 16) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది.

చెన్నై బౌలర్లలో మిచెల్ సాంట్నర్, మహేశ్ తీక్షణ ద్వయం పరుగులు ఇవ్వకుండా కట్టడి చేశారు. 8 ఓవర్లు వేసిన ఈ జోడి కేవలం 48 పరుగులు ఇవ్వడం గమనార్హం.