RCB vs CSK: ప్లేఆఫ్స్‌‌కు బెంగళూరు.. చెన్నై ఇంటికి

RCB vs CSK:  ప్లేఆఫ్స్‌‌కు బెంగళూరు.. చెన్నై ఇంటికి
  •     27 రన్స్‌‌తో గెలిచిన ఆర్‌‌సీబీ
  •      రాణించిన డుప్లెసిస్, కోహ్లీ, యశ్‌

బెంగళూరు :  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాజిక్‌‌ చేసింది. సొంతగడ్డపై ఆఖరి లీగ్‌‌లో అద్భుత ఆటతో  డిఫెండింగ్ చాంపియన్‌‌ చెన్నై సూపర్‌‌‌‌ కింగ్స్‌‌కు చెక్ పెట్టింది. వరుసగా ఆరో విజయం సాధించి ప్లే ఆఫ్స్ చేరుకుంది.  శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు 27  రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది. లక్నో, ఢిల్లీతో పాటు ఇరు జట్లూ 14 పాయింట్లతో నిలిచినా మెరుగైన రన్‌‌రేట్‌‌ (0.459)తో ఆర్‌‌‌‌సీబీ నాలుగో ప్లేస్‌‌తో  ముందంజ వేసింది.  చెన్నై ఇంటిదారి పట్టింది.  తొలుత  ఆర్‌‌‌‌సీబీ 20 ఓవర్లలో 218/5 స్కోరు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (39 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54), విరాట్ కోహ్లీ (29 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47), రజత్ పటీదార్‌‌‌‌ (23 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41), కామెరూన్ గ్రీన్ (17 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 నాటౌట్‌‌) మెరుపులు మెరిపించారు.  ప్లేఆఫ్స్‌‌ చేరేందుకు 201 రన్స్‌‌ చేయాల్సిన చెన్నై ఛేజింగ్‌‌లో  ఓవర్లన్నీ ఆడి 191/7 స్కోరు చేసి ఓడింది. రచిన్ రవీంద్ర (37 బాల్స్‌‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), రవీంద్ర జడేజా (22 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 నాటౌట్‌‌), ధోనీ (13 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 25)  పోరాడినా ఫలితం లేకపోయింది. రెండు వికెట్లు పడగొట్టిన యశ్‌‌ దయాల్‌‌ ఆఖరి ఓవర్లో సూపర్‌‌‌‌గా బౌలింగ్‌‌ చేశాడు.  డుప్లెసిస్‌ ప్లేయర్‌‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

టాప్‌‌4 బ్యాటర్ల జోరు

టాస్ ఓడి బ్యాటింగ్‌‌కు వచ్చిన ఆర్‌‌‌‌సీబీ టాప్‌‌4 బ్యాటర్ల జోరుతో భారీ స్కోరు చేసింది.  ఓపెనర్లు  కోహ్లీ, డుప్లెసిస్‌‌ తొలి వికెట్‌‌కు 78 రన్స్‌‌ జోడించి మంచి పునాది వేశారు. శార్దూల్ వేసిన రెండో ఓవర్లో కోహ్లీ బౌండ్రీల ఖాతా తెరవగా.. డుప్లెసిస్‌‌ 4,6 కొట్టాడు. ఆపై దేశ్‌‌పాండే బౌలింగ్‌‌లో రెండు సిక్సర్లతో విరాట్‌‌ జోరందుకున్నాడు. వర్షం కారణంగా కాసేపు ఆట ఆగిపోగా తిరిగి మొదలైన తర్వాత పిచ్‌‌పై బంతి అనూహ్యంగా టర్న్‌‌ అయింది. దాంతో  సీఎస్కే కెప్టెన్‌‌ రుతురాజ్ వరుసగా పది ఓవర్లు స్పిన్నర్లతో బౌలింగ్‌‌ చేయించాడు. మొదట్లో డుప్లెసిస్‌‌ కాస్త  ఇబ్బంది పడ్డా.. విరాట్ మాత్రం ధాటిగానే ఆడాడు. కానీ, శాంట్నర్ వేసిన పదో ఓవర్లో సిక్స్‌‌ కొట్టిన అతను మరో షాట్‌‌కు ట్రై చేసి డారిల్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో చెన్నైకి బ్రేక్ లభించింది.  ఈ టైమ్‌‌లో  డుప్లెసిస్ ఒక్కసారిగా జోరందుకున్నాడు. జడేజా వేసిన 11వ ఓవర్లో 4, 6, 6 కొట్టిన అతను 35 బాల్స్‌‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వన్‌‌డౌన్ బ్యాటర్‌‌‌‌ పటీదార్‌‌‌‌.. తీక్షణ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో స్కోరు వంద దాటించాడు. శాంట్నర్‌‌‌‌ బౌలింగ్‌‌లో రజత్ కొట్టిన బాల్ తగిలి నాన్‌‌ స్ట్రయికింగ్ ఎండ్‌‌లో  డుప్లెసిస్ రనౌటయ్యాడు. ఇక్కడి నుంచి పటీదార్‌‌ ఇన్నింగ్స్‌‌ బాధ్యత తీసుకున్నాడు. 14వ ఓవర్లో సిమర్‌‌‌‌జీత్‌‌కు 4, 6తో వెల్‌‌కం చెప్పాడు. ఇంకో ఎండ్‌‌లో కామెరూన్ గ్రీన్ సైతం జోరు చూపెట్టాడు. శార్దూల్ వేసిన 16 ఓవర్లో 6,4తో  స్కోరు 150 దాటింది. ఆ ఓవర్ ఆఖరి బాల్‌‌కు అతనిచ్చిన క్యాచ్‌‌ను గైక్వాడ్‌‌ డ్రాప్‌‌ చేశాడు. ఆపై తుషార్ బౌలింగ్‌‌లో పటీదార్‌‌‌‌ రెండు సిక్సర్లతో మరింత జోరందుకున్నాడు. తర్వాతి ఓవర్లో గ్రీన్‌‌ రెండు సిక్సర్లు కొట్టగా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రజత్ ఔటవడంతో మూడో వికెట్‌‌కు 71 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగిసింది. చివర్లో దినేశ్ కార్తీక్ (16),  మ్యాక్స్‌‌వెల్‌‌ (16)  మెరుపులతో స్కోరు 200 దాటింది. 

రచిన్‌‌, జడేజా పోరాడినా

విజయానికి 219 రన్స్.. ప్లే ఆఫ్స్ చేరాలంటే 201 రన్స్‌‌ టార్గెట్ ఛేజింగ్‌‌కు వచ్చిన చెన్నై తడబడింది. పార్ట్‌‌ టైమ్ స్పిన్నర్‌‌‌‌ మ్యాక్స్‌‌వెల్‌‌ ఎక్స్‌‌ట్రా బౌన్స్‌‌తో వేసిన తొలి బాల్‌‌నే చెన్నై కెప్టెన్ రుతురాజ్‌‌ (0) షార్ట్‌‌ ఫైన్ లెగ్‌‌లో యశ్ దయాల్ చేతుల్లోకి కొట్టాడు. ఆపై దయాల్ వేసిన మూడో ఓవర్లో డారిల్ మిచెల్‌‌ (4).. కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో 19/2తో సీఎస్కే డీలా పడింది.  ఈ దశలో రహానె( 33)తో కలిసి మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్‌‌ను ముందుకు తీసుకెళ్లాడు. అదే ఓవర్లో రచిన్  సిక్స్ కొట్టగా.. యశ్‌‌ బౌలింగ్‌‌లో రహానె రెండు ఫోర్లు రాబట్టాడు. స్పిన్నర్ కర్ణ్ శర్మ బౌలింగ్‌‌లో రవీంద్ర సిక్స్‌‌, రహానె ఫోర్ కొట్టడంతో చెన్నై కోలుకున్నట్టు కనిపించింది. కానీ, ఫెర్గూసన్‌‌ స్లో లెగ్‌‌ కట్టర్‌‌‌‌కు రహానె డుప్లెసిస్‌‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌‌కు 66 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ ముగియగా సగం ఓవర్లకు సీఎస్కే 87/3 స్కోరుతో నిలిచింది. 

ఇంపాక్ట్‌‌ ప్లేయర్‌‌‌‌గా క్రీజులోకి వచ్చిన శివం దూబే (15 బాల్స్‌‌లో 7) చెత్తాట చెన్నైని దెబ్బతీసింది. ఫెర్గూసన్ వేసిన 12వ ఓవర్లో వరుసగా  రచిన్ 4, 6, 6తో స్కోరు వంద దాటించినా దూబే కారణంగా సీఎస్కే డీలా పడింది.  మ్యాక్సీ వేసిన తర్వాతి ఓవర్లో దూబే ఇచ్చిన క్యాచ్‌‌ను సిరాజ్ డ్రాప్ చేయగా.. అతని తప్పిదంతో లాస్ట్‌‌ బాల్‌‌కు రచిన్ రనౌట్‌‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే గ్రీన్ బౌలింగ్‌‌లో దూబే కూడా ఔటవ్వడంతో 119/5తో సీఎస్కే ఎదురీత మొదలు పెట్టింది. ఇక, సిరాజ్ బౌలింగ్‌‌లో ఆర్‌‌‌‌సీబీ కెప్టెన్ డుప్లెసిస్‌‌ పట్టిన సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్‌‌ క్యాచ్‌‌కు శాంట్నర్ (3) ఆరో వికెట్‌‌గా పెవిలియన్‌‌ చేరాడు. చెన్నై ప్లేఆఫ్స్‌‌ చేరాలంటే చివరి ఆరు ఓవర్లలో 72 రన్స్ అవసరమైన దశలో ధోనీతో కలిసి  జడేజా బాధ్యత తీసుకున్నాడు. యశ్‌‌ ఓవర్లో సిక్స్‌‌, సిరాజ్ బౌలింగ్‌‌లో 6, 4తో జట్టును రేసులో నిలిపాడు. ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో ధోనీ 4.. జడేజా 6తో 18 రన్స్ వచ్చాయి. దాంతో సీఎస్కే ప్లేఆఫ్స్‌ లెక్క 6 బాల్స్‌‌లో 17 రన్స్‌‌గా మారింది. యశ్‌‌ దయాల్‌‌ వేసిన ఆఖరి ఓవర్ తొలి బాల్‌‌నే ధోనీ సిక్స్‌‌గా మలచడంతో స్టేడియం హోరెత్తింది. కానీ, రెండో బాల్‌‌కు అతను ఔటవగా.. తర్వాతి నాలుగు బాల్స్‌‌కు ఒకే పరుగిచ్చిన యశ్‌‌ ఆర్‌‌‌‌సీబీకి విజయంతో పాటు ప్లే ఆఫ్స్‌‌ బెర్తు అందించాడు. 

సంక్షిప్త స్కోర్లు

బెంగళూరు: 20 ఓవర్లలో 218/5 (డుప్లెసిస్ 54, కోహ్లీ 47, శార్దూల్ 2/61).
చెన్నై: 20  ఓవర్లలో 191/7  (రచిన్ 61, జడేజా 42*, యశ్‌‌ దయాల్‌‌ 2/42)