RCB vs DC: రాణించిన పటిదార్‌.. హోరాహోరీగా ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్

RCB vs DC: రాణించిన పటిదార్‌.. హోరాహోరీగా ఢిల్లీ- బెంగళూరు మ్యాచ్

చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీతో జ‌రుగుతున్న కీల‌క పోరులో బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. తొలి 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసిన ఆర్సీబీ బ్యాటర్లు.. రెండో అర్ధ భాగంలో మాత్రం చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో చివరి 10 ఓవర్లలో 79 పరుగులు మాత్రమే చేశారు. దీంతో డు ప్లెసిస్ సేన అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.   

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ మూడో ఓవర్‌లోనే డుప్లెసిస్ (6) వికెట్ కోల్పోయింది. దూకుడు ఆడే ప్రయత్నంలో ఆ మరుసటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీ (27; 13 బంతులలో) ఔటయ్యాడు. ఇషాంత్ బౌలింగ్‌లో అభిషేక్ పొరెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 37 పరుగులకే బెంగళూరు 2 కీలక వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో ర‌జ‌త్ పటిదార్(52; 32 బంతుల్లో 3 ఫోర్లు,3 సిక్స్ లు), విల్ జాక్స్(41; 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లు) జట్టును ఆదుకున్నారు. మొదట ఆచి తూచి ఆడిన ఈ జోడి.. క్రీజులో కుదురుకున్నాక ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.

వీరిద్దరి దూకుడు చూశాక ఆర్సీబీ 220 పైచిలుకు చేయడం ఖాయంగా కనిపించింది. అయితే పటిదార్, విల్ జాక్స్ ఔటయ్యాక బెంగళూరు ఇన్నింగ్స్ తలకిందులైంది. చూస్తుండగానే బ్యాటర్లంతా పెవిలియన్ చేరిపోయారు. కామెరాన్ గ్రీన్(32) ఒక్కడు చివరివరకు పోరాడగా.. దినేష్ కార్తీక్(0), స్వప్నిల్ సింగ్(0) డకౌట్ అయ్యారు. మహిపాల్ లోమ్రోర్ 3 పరుగులు చేశాడు.

ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలామ్  రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్, ఇషాంత్, ముఖేష్ కుమార్ తలా వికెట్ తీసుకున్నారు.