ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లిన వేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అద్భుతాలు చేస్తోంది. వరుస విజయాలు సాధిస్తూ టోర్నీని ఆసక్తికరంగా మారుస్తోంది. తొలి 8 మ్యాచ్‌ల్లో ఏకైన విజయాన్ని అందుకున్న డుప్లెసిస్ సేన.. అనంతరం వరుసగా ఐదింట గెలుపు బావుటా ఎగురవేసింది. ఆదివారం(మే 12) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ 16 పరుగుల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. మొదట ఆర్సీబీ 187 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో ఢిల్లీ 140 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
భారీ ఛేదనలో ఢిల్లీ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. సొంతగడ్డపై ఆర్సీబీ బౌలర్ల విజృంభణతో 30 పరుగులకే ఢిల్లీ 4 కీలక వికెట్లు కోల్పోయింది. డేవిడ్ వార్నర్(1), అభిషేక్ పోరెల్(2), కుమార్ కుశాగ్రా(2)లు సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరగా.. మెక్‌గుర్క్(8 బంతుల్లో 21) దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.
ఆ సమయంలో షాహ్ హోప్(29), కెప్టెన్ అక్షర్ పటేల్(57; 39 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు)లు కాసేపు పోరాడారు. వీరిద్దరూ కుదుర్కున్నారు అనుకున్న సమయాన హోప్ను ఫెర్గూసన్ పెవిలియన్ చేర్చాడు. గ్రీన్ వేసిన ఆ మరుసటి ఓవర్ లో ట్రిస్టన్ స్టబ్స్ (3) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. దాంతో 90 పరుగుల వద్ద ఢిల్లీ ఆరో వికెట్ కోల్పోయింది. త్వరగా మ్యాచ్ ముగిసేలా కనిపించినా.. అక్షర్ పటేల్ తన పోరాటాన్ని ఆపలేదు. టెయిలెండర్ల సాయంతో వీలైనన్ని పరుగులు చేశాడు.
ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాళ్ 3 వికెట్లు తీసుకోగా.. లాకీ ఫెర్గూసన్ 2, మహ్మద్ సిరాజ్, స్వప్నిల్ సింగ్, కామెరాన్ గ్రీన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
రాణించిన పటిదార్
అంతకుముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సొంతగడ్డపై చితక్కొట్టారు. రజత్ పటిదార్(52) అర్ధ శతకం బాదగా.. విల్ జాక్స్(41), కామెరూన్ గ్రీన్(32 నాటౌట్), విరాట్ కోహ్లీ(27) పరుగులు చేశారు. దాంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, రసిఖ్ దార్ సలామ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్, ఇషాంత్, ముఖేష్ కుమార్ తలా వికెట్ తీసుకున్నారు.