- దంచికొట్టిన క్వింటన్, పూరన్
- చెలరేగిన మయాంక్ యాదవ్
- ఆర్‌సీబీపై లక్నో గెలుపు
బెంగళూరు: బ్యాట్‌తో క్వింటన్ డికాక్ (56 బాల్స్‌లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 81), బాల్‌తో స్పీడ్‌స్టర్ మయాంక్ యాదవ్ (3/14) చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్ వరుసగా రెండో విక్టరీ సాధించింది. సొంతగడ్డపై బౌలింగ్, బ్యాటింగ్‌లో నిరాశ పరిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మూడోసారి ఓడింది. చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో 28 రన్స్ తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. తొలుత లక్నో 20 ఓవర్లలో 181/5 స్కోరు చేసింది. డికాక్‌తో పాటు పూరన్ (21 బాల్స్‌లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 40 నాటౌట్) రాణించాడు. మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌లో ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 153 రన్స్‌కే ఆలౌటైంది. మహిపాల్ లామ్రోర్ (13 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 33), రజత్ పటీదార్ (29) పోరాడారు. మయాంక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
డికాక్, పూరన్ జోరు
తొలుత డికాక్, చివర్లో పూరన్ దంచికొట్టడంతో లక్నో మంచి స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన జట్టుకు డికాక్, పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న కెప్టెన్ కేఎల్ రాహుల్ (20) మంచి ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే డికాక్ మూడు ఫోర్లతో టాప్లీకి స్వాగతం పలికాడు. సిరాజ్ వేసిన మూడో ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లతో జోరు చూపెట్టాడు. యశ్ దయాల్, మ్యాక్స్‌వెల్ ఓవర్లలో వెంటవెంటనే రెండు సిక్సర్లు కొట్టిన రాహుల్ మ్యాక్సీ బౌలింగ్‌లో మరో షాట్ ఆడే ప్రయత్నంలో దాగర్‌కు క్యాచ్ ఇవ్వడంతో తొలి వికెట్‌కు 53 రన్స్ పార్ట్‌నర్ షిప్ బ్రేక్ అయింది. క్రీజులో ఇబ్బంది పడిన పడిక్కల్ (6) సిరాజ్ వేసిన 9వ ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే ఓవర్లో సిక్స్ కొట్టిన డికాక్.. స్టోయినిస్ (24) తోడుగా మళ్లీ స్పీడుపెంచాడు. దాగర్ ఓవర్లో 4, 6తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. గ్రీన్ వేసిన 13వ ఓవర్లోనూ అతను 6,4 బాదగా.. స్టోయినిస్ సిక్స్ రాబట్టాడు. 14వ ఓవర్లో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన స్టోయినిస్ మరో భారీ షాట్‌కు ట్రై చేసి ఔటయ్యాడు. సెంచరీ దిశగా సాగుతున్న డికాక్‌ను టాప్లీ పెవిలియన్ చేర్చగా.. బదోనీ (0) డకౌట్ అయ్యాడు. కానీ, చివరి రెండు ఓవర్లలో పూరన్ ఒక్కసారిగా విజృంభించాడు. టాప్లీ వేసిన 19వ ఓవర్లో భారీ షాట్లతో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు. సిరాజ్ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లతో స్కోరు 180 దాటించాడు.
మయాంక్ దెబ్బ
ఛేజింగ్‌లో ఓపెనర్లు విరాట్ కోహ్లీ (22), ఫా డుప్లెసిస్ (19) తొలి వికెట్‌కు 40 రన్స్ జోడించి పునాది వేసినా వరుసగా వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ డీలా పడింది. పేసర్ మయాంక్ యాదవ్ బుల్లెట్ స్పీడ్ బాల్స్‌కు తల్లడిల్లింది. సిద్దార్థ్ వేసిన మూడో ఓవర్లో డుప్లెసిస్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. నవీన్ హక్ బౌలింగ్‌లో కోహ్లీ సిక్స్‌తో అలరించాడు. నాలుగో ఓవర్లో సిద్దార్థ్ వేసిన ఔట్ సైడ్ ఆఫ్ బాల్‌కు కోహ్లీ భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా ఎడ్జ్ తీసుకొని పడిక్కల్ చేతిలో పడింది. మయాంక్ యాదవ్ వేసిన తర్వాతి ఓవర్లో ఆర్‌సీబీకి డబుల్ షాక్ తగిలింది. 153.2 కి.మీ. స్పీడ్‌తో వచ్చిన ఫుల్ లెంగ్త్ బాల్‌ను డుప్లెసిస్ మిడ్ వికెట్ మీదుగా ఆడి సింగిల్‌కు ట్రై చేయగా.. పడిక్కల్ డైరెక్ట్ త్రోతో అతడని రనౌట్ చేశాడు. 151 కి.మీ వేగంతో వచ్చిన నాలుగో బాల్‌ను మ్యాక్స్‌వెల్ (0) లైన్‌కు అడ్డంగా ఆడబోయి పూరన్‌కు క్యాచ్ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే మరో హార్డ్ హిట్టర్ కామెరూన్ గ్రీన్ (9)ను ఖతర్నాక్ బాల్‌తో బౌల్డ్ చేసిన మయాంక్ ఆర్‌సీబీని 58/4తో కష్టాల్లోకి నెట్టాడు. రన్‌రేట్ పూర్తిగా పడిపోగా.. యంగ్‌స్టర్ రజత్ పటీదార్ వెంటవెంటనే రెండు సిక్సర్లు, ఫోర్‌తో ఇన్నింగ్స్‌కు చలనం తెచ్చాడు.
కానీ, బాల్స్ వేస్ట్ చేసిన అనూజ్ రావత్ (21 బాల్స్‌లో 11) స్టోయినిస్ వేసిన 13వ ఓవర్లో పడిక్కల్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన మయాంక్ యాదవ్.. క్రీజులో కుదురుకున్న పటీదార్‌ను ఔట్ చేసి ఆర్‌సీబీని దెబ్బకొట్టాడు. కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన మహిపాల్ లామ్రోర్.. యశ్ ఠాకూర్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 6, 4, 6తో ఆర్‌సీబీని రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. నవీన్ ఓవర్లోనూ భారీ సిక్స్, ఫోర్‌తో ఆశలు రేపాడు. కానీ, దినేశ్ కార్తీక్ (4) ఫెయిలయ్యాడు. ఇక, యశ్ ఓవర్లో పూరన్ కొట్టిన సూపర్ త్రోకు మయాంక్ దాగర్ (0) రనౌటవగా.. లామ్రోర్ బౌండ్రీ లైన్ వద్ద పూరన్‌కే క్యాచ్ ఇవ్వడంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయమైంది. బిష్ణోయ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టిన సిరాజ్ (12) లాస్ట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో: 20 ఓవర్లలో 181/5 (డికాక్ 81, పూరన్ 40*, మ్యాక్స్‌వెల్ 2/23).
బెంగళూరు: 19.4 ఓవర్లలో 153 ఆలౌట్ (లామ్రోర్ 33, పటీదార్ 29, మయాంక్ 3/14).