RCB vs LSG: పూర‌న్ సిక్సర్ల మోత.. మూగబోయిన చిన్నస్వామి స్టేడియం

చిన్నస్వామి వేదికగా లక్నో vs బెంగుళూరు జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్.. చిరకాల ప్రత్యర్థులు ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్‌ను తలపిస్తోంది. రోజులు గడిచేకొద్దీ ఆయా జట్ల మధ్య వైరం తగ్గినా.. అభిమానులు పాత ఘటనలు మరవలేదని స్పష్టంగా కనిపించింది. విరాట్ కోహ్లీ- గౌతం గంభీర్‌ల గొడవను బెంగుళూరు అభిమానులు మరిచినట్లు లేరు. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో జట్టు వికెట్ కోల్పోయిన ప్రతిసారి చిన్నస్వామి స్టేడియం అభిమానుల అరుపులతో దద్ధరిల్లింది. అందుకు తగ్గట్టుగానే ఆర్‌సీబీ అభిమానుల నోర్లు మూయించేలా నికోల‌స్ పూర‌న్(40*; 21 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్స్‌లు) సిక్సర్ల మోత మోగించాడు. టాప్లే వేసిన 19వ ఓవ‌ర్లో హ్యాట్రిక్ సిక్స‌ర్ల‌తో అలరించాడు. ఈ వెస్టిండీస్ వీరుడి దెబ్బకు చివరి 10 నిముషాలు(లక్నో ఇన్నింగ్స్) చిన్నస్వామి స్టేడియం మూగబోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ల‌క్నో ఓపెన‌ర్ క్వింట‌న్ డికాక్ (81) హాఫ్ సెంచ‌రీ చేయగా.. రాహుల్(20; 14 బంతుల్లో 2 సిక్స్‌లు), స్టోయినిస్‌(24; 15 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు), నికోల‌స్ పూర‌న్(40*; 21 బంతుల్లో ఒక ఫోర్, 5 సిక్స్‌లు)లు పర్వాలేదనిపించారు. అందుకు ఆర్‌సీబీ బౌలర్లు తోచినంత సహాయం చేశారు. క్యాచ్ లు జారవిడిచి పరుగులు చేయడంలో సహాయపడ్డారు. 

బెంగుళూరు బౌలర్లలో మ్యాక్స్ వెల్ ఒక్కడే పర్వాలేదనిపించాడు. తన 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.