RR vs RCB: ఆర్సీబీకు చెక్ పెట్టేందుకు వ్యూహం.. ముగ్గురు అంతర్జాతీయ స్పిన్నర్లతో రాజస్థాన్

RR vs RCB: ఆర్సీబీకు చెక్ పెట్టేందుకు వ్యూహం.. ముగ్గురు అంతర్జాతీయ స్పిన్నర్లతో రాజస్థాన్

ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో భాగంగా బుధవారం (మే 22) ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మరోవైపు గెలిచిన జట్టు శుక్రవారం (మే 24) సన్ రైజర్స్ తో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. ఇరు జట్లు బలంగా ఉండడంతో ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగే ఆవకాశం కనిపిస్తుంది. ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ ఒక కీలక మార్పుతో బరిలోకి దిగబోతున్నట్టు సమాచారం. 

ముగ్గురు స్పిన్నర్లతో

రాజస్థాన్ రాయల్స్ బలమంతా వారి బౌలింగ్. టోర్నీ ప్రారంభం నుంచి ఆ జట్టు ఎక్కువగా బౌలర్ల ద్వారానే ఎక్కువ విజయాలను అందుకుంది. ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, అవేశ్ ఖాన్ లతో కూడిన పేస్ త్రయం తో పాటు టీమిండియా స్టార్ స్పిన్నర్లు చాహల్, అశ్విన్ వారి సొంతం. ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు కావడంతో నేడు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లో మరోసారి బౌలింగ్ నే నమ్ముకుంది. వీరికి తోడు సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ను వీరికి జత కానున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

మహరాజ్ వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్. అశ్విన్, చాహల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయగలరు. దీంతో వీరు ముగ్గురు కలిస్తే రాజస్థాన్ బౌలింగ్ లైనప్ మరింత దుర్బేధ్యంగా మారడం ఖాయం. చెన్నైతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో బెంగళూరు గెలిచినా స్పిన్నర్ల బౌలింగ్ లో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. సాంట్నర్, తీక్షణ, జడేజా మధ్య ఓవర్లలో పరుగులు రాకుండా బెంగళూరును నిలువరించారు. రాజస్థాన్ కూడా ఇదే ప్లాన్ అమలు చేయాలని చూస్తున్నట్టు టాక్. 

మార్పుల్లేకుండానే బెంగళూరు: 

మరోవైపు బెంగళూరు ఫుల్ జోష్ లో ఉంది. ప్లేయింగ్ 11 లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. వరుసగా 6 మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ లో అడుగుపెట్టి ఆత్మవిశ్వాసంతో ఉంది. రాజస్థాన్ మాత్రం వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. వీరి జోరును చూస్తుంటే ఒత్తిడిలో రాజస్థాన్ ను ఈజీగానే చిత్తు చేసేలా ఉంది. ఇరు జర్ల మధ్య ఈ సీజన్ లో జరిగిన ఏకైక మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి టైటిల్ రేస్ లో ఉంటారో చూడాలి.