
ముంబై: ఐపీఎల్18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరో అద్భుత విజయం అందుకుంది. మొన్న చెపాక్ స్టేడియంలో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచిన ఆర్సీబీ ఇప్పుడు పదేండ్ల తర్వాత వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఔరా అనిపించింది. విరాట్ కోహ్లీ (42 బాల్స్‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 67), కెప్టెన్ రజత్ పటీదార్ (32 బాల్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64) ఫిఫ్టీలతో దంచికొట్టడంతో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 12 రన్స్ తేడాతో ముంబైపై గెలిచింది. హై స్కోరింగ్ పో రులో తొలుత బెంగళూరు 20 ఓవర్లలో 221/5 స్కోరు చేసింది.
జితేష్ శర్మ (19 బాల్స్‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 నాటౌట్) కూడా సత్తా చాటాడు. ట్రెంట్ బౌల్ట్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం తిలక్ వర్మ (29 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 56), హార్దిక్ పాండ్యా (15 బాల్స్‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 42) ఆశలు రేపినా.. ముంబై 20 ఓవర్లలో 209/9 స్కోరు చేసి ఓడింది. క్రునాల్ పాండ్యా నాలుగు, యశ్ దయాల్, హేజిల్‌వుడ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రజత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆర్సీబీ చివరగా 2015లో వాంఖడేలో ముంబైని ఓడించింది.
కోహ్లీ, రజత్ జోర్‌దార్
కోహ్లీ, కెప్టెన్ రజత్ పటీదార్ సూపర్ బ్యాటింగ్‌తో ఆర్సీబీ భారీ స్కోరు చేసింది. టాస్ నెగ్గి ముంబై కెప్టెన్ పాండ్యా బౌలింగ్ ఎంచుకోగా.. రెండో బాల్‌కే ఓపెనర్ ఫిల్ సాల్ట్ (4)ను క్లీన్‌బౌల్డ్ చేసిన ట్రెంట్ బౌల్ట్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. కానీ, ఇదే జోరును బౌల్ట్‌తో పాటు ఇతర బౌలర్లు కొనసాగించలేకపోయారు. మరో ఓపెనర్ కోహ్లీ, వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్ పడిక్కల్ (37) ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లపై పైచేయి సాధించాడు. వాంఖడే వికెట్‌పై మంచి అవగాహన ఉన్న కోహ్లీ.. బౌల్ట్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్‌తో తన ఫామ్‌ను చూపించాడు. వెన్నుగాయం నుంచి కోలుకొని వచ్చిన బుమ్రాకు నాలుగో ఓవర్లో సిక్సర్‌తో వెల్‌కం చెప్పాడు.
ఇంకో ఎండ్‌లో పడిక్కల్ కూడా విజృంభించాడు. దీపక్ చహర్ వేసిన ఆరో ఓవర్లో 6, 6,4 బాదడంతో పవర్‌ప్లేలోనే ఆర్సీబీ 73/1 స్కోరు చేసింది. ముంబైపై ఆ టీమ్‌కు ఇదే అత్యధిక పవర్‌ప్లే స్కోరు కావడం విశేషం. ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా కోహ్లీ, పడిక్కల్ అదే జోరును కొనసాగించారు. విజ్ఞేష్ పుతూర్ వేసిన తొమ్మిదో ఓవర్లో లాంగాన్ మీదుగా సిక్స్ కొట్టిన కోహ్లీ 29 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. అదే ఓవర్లో పడిక్కల్ ఔట్ అవ్వడంతో రెండో వికెట్‌కు 91 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఈ టైమ్‌లో శాంట్నర్, బుమ్రా కాసేపు కట్టడి చేయగా.. కోహ్లీకి తోడైన కెప్టెన్ రజత్ పటీదార్.. హార్దిక్ వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లతో ఇన్నింగ్స్‌కు మళ్లీ ఊపు తెచ్చాడు.
శాంట్నర్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లతో మరింత స్పీడు పెంచాడు. 15వ ఓవర్లో కోహ్లీ, హిట్టర్ లివింగ్‌స్టోన్ (0)ను పెవిలియన్ చేర్చిన పాండ్యా ఆర్సీబీ స్పీడుకు బ్రేక్ వేసే ప్రయత్నం చేశాడు. కానీ, పటీదార్ వెనక్కు తగ్గలేదు. అతనికి తోడుగా జితేష్ శర్మ కూడా దూకుడు చూపెట్టడంతో స్లాగ్ ఓవర్లలోనూ ఆర్సీబీ హవానే నడిచింది. బౌల్ట్ వేసిన 14వ ఓవర్లో జితేష్ 4, 6 కొట్టగా.. హార్దిక్ బౌలింగ్‌లో పటీదార్ వరుసగా 6, 6, 4తో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో 25 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. బౌల్ట్ బౌలింగ్‌లో పటీదార్ ఔటైనా.. చివర్లో జితేష్ మూడు సిక్సర్లు కొట్టి స్కోరు 220 దాటించాడు. ఆర్సీబీ ధాటికి బౌల్ట్ తన ఐపీఎల్ కెరీర్‌లోనే అత్యధికంగా 57 రన్స్ ఇచ్చుకున్నాడు.
తిలక్, హార్దిక్ మెరుపులు సరిపోలే..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో ముంబైకి ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన ఓపెనర్ రోహిత్ శర్మ (17) మరోసారి నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే సిక్స్ కొట్టి.. యశ్ దయాల్ వేసిన రెండో ఓవర్లో 4, 4తో అలరించిన హిట్‌మ్యాన్ తర్వాతి బాల్‌కే క్లీన్ బౌల్డ్ అవ్వడంతో స్టేడియం సైలెంట్ అయింది. వెంటవెంటనే నాలుగు ఫోర్లతో దూకుడు చూపెట్టిన మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ (17)ను నాలుగో ఓవర్లో హేజిల్‌వుడ్ ఎల్బీ చేయడంతో 38/2తో ముంబై డీలా పడింది. ఈ టైమ్‌లో సూర్యకుమార్ (28), విల్ జాక్స్ (22) ఇన్నింగ్స్‌ను సరిచేసే బాధ్యత తీసుకున్నారు. యశ్ బౌలింగ్‌లో జాక్స్ సిక్స్ కొట్టగా.. స్పిన్నర్ క్రునాల్ వేసిన ఎనిమిదో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లతో సూర్య స్పీడు పెంచాడు.
కానీ, పదో ఓవర్లు క్రునాల్ సీమర్ మాదిరిగా వేసిన ఊరించే బౌన్సర్‌ను వెంటాడిన జాక్స్ కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌కు 41 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. యశ్ దయాల్ వేసిన 12వ ఓవర్లో క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న సూర్య మరో పేలవ షాట్ ఆడి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ముంబై 99/4తో నిలిచింది. ఆర్సీబీ విజయం ఖాయమే అనుకున్న ఈ సమయంలో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా రెచ్చిపోయారు. సుయాశ్ బౌలింగ్‌లో తిలక్ 6, 4, 4 కొడితే.. హేజిల్‌వుడ్ వేసిన 14వ ఓవర్లో పాండ్యా ఖతర్నాక్ షాట్లతో 6, 4, 6, 4తో రెచ్చిపోయాడు. తన అన్న క్రునాల్ బౌలింగ్‌లోనూ పాండ్యా రెండు భారీ సిక్సర్లు కొట్టడంతో స్టేడియం హోరెత్తింది.
ఈ ఇద్దరి దెబ్బకు ముంబై విజయ సమీకరణం 48 బాల్స్‌లో 123 రన్స్ నుంచి 24 బాల్స్‌లో 52 రన్స్‌గా మారింది. 26 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న తిలక్... యశ్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో ముంబైని రేసులో నిలిపాడు. కానీ, చివరి మూడు ఓవర్లలో ఆర్సీబీ అద్భుతంగా బౌలింగ్ చేసింది. భువీ వేసిన 18వ ఓవర్లో తిలక్ ఔటవడంతో ఐదో వికెట్‌కు 89 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగియగా.. హార్దిక్‌ను హేజిల్‌వుడ్ పెవిలియన్ చేర్చడంతో మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లింది. ఆఖరి ఓవర్లో ముంబైకి 19 రన్స్ అవసరం అవగా.. శాంట్నర్ (8), దీపక్ (0), నమన్ ధీర్ (11)ను ఔట్ చేసిన క్రునాల్ 6 రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్సీబీని గెలిపించాడు.