- ధవన్, హర్‌ప్రీత్ శ్రమ వృథా
బెంగళూరు : ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో చేజేతులా ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు గెలుపు బాట పట్టింది. ఛేజింగ్‌లో విరాట్ కోహ్లీ (77), దినేశ్ కార్తీక్ (28*) దంచికొట్టడంతో.. సోమవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌పై నెగ్గింది. టాస్ ఓడిన పంజాబ్ 20 ఓవర్లలో 176/6 స్కోరు చేసింది. కెప్టెన్ శిఖర్ ధవన్ (45), జితేశ్ శర్మ (27) మెరుగ్గా ఆడారు. తర్వాత బెంగళూరు 19.2 ఓవర్లలో 178/6 స్కోరు చేసింది. విరాట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
మిడిల్ మెరుగ్గా..
స్టార్టింగ్‌లోనే రెండు ఫోర్లు కొట్టిన బెయిర్‌స్టో (8) మూడో ఓవర్‌లో సిరాజ్ (2/26)కు వికెట్ ఇచ్చుకున్నాడు. ఈ దశలో ధవన్, ప్రభుసిమ్రన్ సింగ్ (25) వేగంగా ఆడటంతో పవర్‌ప్లేలో పంజాబ్ 40/1 స్కోరు చేసింది. 7వ ఓవర్‌లో ప్రభుసిమ్రన్ 6, తర్వాత ధవన్ 6, 4తో జోరు పెంచారు. కానీ 9వ ఓవర్‌లో మ్యాక్స్‌వెల్ (2/29).. ప్రభుసిమ్రన్‌ను ఔట్ చేసి రెండో వికెట్‌కు 55 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఫస్ట్ టెన్ ఓవర్స్‌లో 78/2 స్కోరు చేసిన పంజాబ్‌కు 11, 12వ ఓవర్‌లో డబుల్ స్ట్రోక్ తగిలింది. 4, 6తో టచ్‌లోకి వచ్చిన లివింగ్‌స్టోన్ (17), ధవన్ వరుస బాల్స్‌లో ఔటయ్యారు.
దీంతో మూడో వికెట్‌కు 26 రన్స్ జతకావడంతో పంజాబ్ స్కోరు 99/4గా మారింది. ఇక్కడి నుంచి సామ్ కరన్ (23), జితేశ్ సింగిల్స్‌తో పాటు వీలైనప్పుడల్లా బౌండ్రీలు బాదారు. 15వ ఓవర్‌లో జితేశ్ రెండు సిక్సర్లతో వేగం పెంచాడు. 18వ ఓవర్‌లో సామ్ రెండు ఫోర్లు కొట్టి ఔట్‌కావడంతో ఐదో వికెట్‌కు 52 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. 19వ ఓవర్‌లో జితేశ్ ఔటైనా, శశాంక్ సింగ్ (21*) బ్యాట్ ఝుళిపించాడు. 20వ ఓవర్‌లో 6, 6, 4 కొట్టి హర్‌ప్రీత్ (2*)తో కలిసి ఏడో వికెట్‌కు 22 (8 బాల్స్) రన్స్ జోడించాడు.
కోహ్లీ, దినేశ్ కేక
ఛేజింగ్‌లో డుప్లెసిస్ (3) ఫెయిలైనా కోహ్లీ దుమ్మురేపాడు. తొలి ఓవర్‌లోనే 4 ఫోర్లు కొట్టిన అతను తర్వాతి రెండు ఓవర్లలో మరో 4 ఫోర్లు బాదాడు. 5వ ఓవర్‌లో కామెరూన్ గ్రీన్ (3) వికెట్ పడ్డా, రజత్ పటీదార్ (18) అండగా నిలిచాడు. దీంతో ఆర్‌సీబీ 50/2తో పవర్‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత రెండు ఓవర్లలో 11 రన్స్ రాగా, 9వ ఓవర్‌లో కోహ్లీ, రజత్ చెరో సిక్స్ కొట్టారు. 10వ ఓవర్‌లో సింగిల్‌తో కోహ్లీ 31 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ 11, 13 ఓవర్లలో బ్రార్ (2/13) ఆర్‌సీబీకి ఝలక్ ఇచ్చాడు. వరుసగా పటీదార్, మ్యాక్స్‌వెల్ (3)ను ఔట్ చేశాడు.
పటీదార్‌తో మూడో వికెట్‌కు 43 రన్స్ జత చేసిన కోహ్లీ 12వ ఓవర్‌లో 6, 4 కొట్టాడు. అనూజ్ రావత్ (11) కూడా ఫర్వాలేదనిపించడంతో బెంగళూరు15 ఓవర్లలో 118/4తో నిలిచింది. కానీ కోహ్లీ 16వ ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టి లాస్ట్ బాల్‌కు ఔట్‌కావడంతో ఐదో వికెట్‌కు 27 రన్స్ ముగిశాయి. ఆ వెంటనే రావత్ కూడా పెవిలియన్ చేరడంతో స్కోరు 130/6గా మారింది. ఇక 22 బాల్స్‌లో 47 రన్స్ కావాల్సిన దశలో దినేశ్ కార్తీక్ సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. మహిపాల్ (17*)తో కలిసి 4, 4, 6, 4, 4, 6, 6, 4తో 48 రన్స్ చేసి ఆర్‌సీబీని గెలిపించాడు.