ఏం కొట్టారయ్యా. ఈ కొట్టుడును ఎలా నిర్వచించినా తక్కువే. ఉతుకుడు..దంచుడు..ఇరగ్గొట్టుడు లాంటి మాస్ పేర్లు పెట్టినా తక్కువే. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో బెంగుళూరు భళా అనిపించింది. సన్ రైజర్స్ సొంత మైదానంలో వారి బౌలర్లను చితక్కొడుతూ అదిరిపోయే విజయాన్ని సాధించింది. 187 పరుగుల టార్గెట్ ను ఆర్సీబీ బ్యాట్స్మన్ ఈజీగా ఛేజ్ చేసింది. కేవలం 19.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 187 పరుగులు చేసింది. ముఖ్యంగా కెప్టెన్ డూ ప్లెసిస్..మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్తో భారీ టార్గెట్ను నీళ్లు తాగినంత ఈజీగా కొట్టేశారు.
దంచికొట్టారు..ఫోర్లు..సిక్సర్లే..
187 పరుగుల టార్గెట్. గెలిస్తేనే ప్లేఆఫ్ ఛాన్స్. లేదంటే ఇంటికే. ఈసమయంలో బ్యాటింగ్కు దిగిన కెప్టెన్ డూ ప్లెసిస్, విరాట్ కోహ్లీలు అద్భుతంగా ఆడారు. సన్ రైజర్స్ బౌలర్లను ఉతికిపారేశారు. ఫోర్లు, సిక్సర్లతో ఉప్పల్ స్టేడియంలో పరుగుల సునామీని సృష్టించారు. తొలి వికెట్కు 17.5 ఓవర్లలో 172 పరుగులు జోడించారు. ఇదే క్రమంలో కెప్టెన్ డూ ప్లెసిస్ 35 బంతుల్లో 51 పరుగులు చేశాడు.
కోహ్లీ సూపర్ సెంచరీ..
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతని సూపర్ షాట్లు. ఎనర్జీ సిక్సులు, క్రేజీ ఫోర్లు..మొత్తంగా కోహ్లీ ఇన్నింగ్స్ను చూస్తే వావ్ అనాల్సిందే. అద్భుతమైన ఆటతీరుతో సెంచరీ చేసి జట్టును గెలిపించాడు. ఛేజింగ్ మాస్టర్ అన్న పేరును సార్థకం చేసుకుంటూ చిచ్చరపిడుగులా చెలరేగాడు. కేవలం 62 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇందులో 4 సిక్సర్లు, 12 ఫోర్లు ఉండటం విశేషం. సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 71 పరుగులు చేసిన డూ ప్లెసిస్ను టీ నటరాజన్ పెవీలియన్ చేర్చాడు. అయితే చివర్లో బ్రేస్ వెల్(4), మాక్స్ వెల్(5) ఇద్దరూ జట్టును విజయతీరాలకు చేర్చారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్.. బెంగుళూరు బౌలర్లను బెంబేలెత్తిస్తూ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓ దశలో సన్ రైజర్స్ ఆదిలోనే వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 27 పరుగుల వద్ద అభిషేక్ శర్మ, 28 పరుగుల వద్ద రాహుల్ త్రిపాఠి ఔటయ్యారు. ఈ సమయంలో కెప్టెన్ మార్కరమ్, హెన్రిచ్ క్లాసెన్ జట్టును ఆదుకున్నాురు. మూడో వికెట్ కు 76 పరుగులు జోడించారు. అయితే 18 పరుగులు చేసిన మార్కరమ్.. షాబాద్ అహ్మద్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.
క్లాసన్ సెంచరీ..
ఈ సమయంలో జట్టుకు భారీ స్కోరును అందించే బాధ్యతను క్లాసెన్ భుజాన వేసుకున్నాడు. హ్యారీ బ్రూక్ తో కలిస స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సిక్సులు ఫోర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. ఇదే క్రమంలో 51 బంతుల్లో 6 సిక్సులు, 8 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. చివర్లో హ్యారీ బ్రూక్ మెరుపులు మెరిపించడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్లలో బ్రేస్ వెల్ 2 వికెట్లు దక్కించుకోగా..షాబాద్ అహ్మద్, హర్షల్ పటేల్, సిరాజ్ ఒక్కో వికెట్ తీశారు.