RCB vs CSK: సుడి తిరిగి ప్లే ఆఫ్స్ కు వచ్చారు.. ట్రోఫీ బెంగళూరుకేనా

RCB vs CSK: సుడి తిరిగి ప్లే ఆఫ్స్ కు వచ్చారు.. ట్రోఫీ బెంగళూరుకేనా

'ఆర్‌సీబీ - ఐపీఎల్ టైటిల్..' ఈ రెండింటి మధ్య భూమికి.. ఆకాశానికి ఉన్నంత దూరం ఉంది. ఐపీఎల్‌ మొదటి సీజన్ నుంచి ఆర్‌సీబీకి టైటిల్‌ అనేది అందని ద్రాక్షే. ప్రతిసారి ఎన్నో ఆశలతో టోర్నీలోకి అడుగుపెట్టడం, బొక్కాబోర్లా పడడం ఆ జట్టుకు పరిపాటి. ఆటగాళ్లను మార్చినా.. కెప్టెన్లను మార్చినా.. ఆఖరికి ఆ జట్టు కోచ్ ను మార్చినా.. ఫలితం మాత్రం మారడం లేదు. 2016 లో ఫైనల్లో విజయం అంచు వరకు వచ్చి ఓడిపోయింది. 2009, 2011 సీజన్ లోనూ ఫైనల్ కు వచ్చినా టైటిల్ గెలవలేకపోయారు. అయితే ఈ సారి పరిస్థితి భిన్నం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టైటిల్ గెలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

తొలి 8 మ్యాచ్ ల్లో ఆర్సీబీ ఒకటే మ్యాచ్ లో నెగ్గింది. ఒక దశలో ప్లే ఆఫ్స్ నుంచి దాదాపుగా నిష్క్రమించిన బెంగళూరు.. ఒకొక్క మ్యాచ్ గెలుస్తూ వరుసగా 6 విజయాలతో ప్లే ఆఫ్స్ కు చేరి అన్ని జట్లకు షాక్ ఇచ్చింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది బెస్ట్ కంబ్యాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అన్ని జట్లతో పోలిస్తే బెంగళూరు పటిష్టంగా కనిపిస్తుంది. ఓపెనర్లు కోహ్లీ, డుప్లెసిస్ టాప్ ఫామ్ లో ఉన్నారు. పటిదార్, గ్రీన్ తమ ఫామ్ ను అందుకున్నారు. ఫినిష్ చేయడానికి దినేష్ కార్తీక్ ఉన్నాడు. విల్ జాక్స్ లేని లోటును మ్యాక్స్ వెల్ పూడ్చాడు. 

బౌలింగ్ లో చూసుకుంటే సిరాజ్ ఫామ్ లోకి రావడం ఆర్‌సీబీ జట్టుకు కొండంత బలం. యష్ దయాల్ వేరియేషన్స్ తో అదరగొడుతుంటే.. లాకీ ఫెర్గుసన్ అంచనాలను అందుకుంటున్నాడు. స్పిన్నర్ కరణ్ శర్మకు తోడు మ్యాక్ వెల్ బంతితో చక్కగా రాణిస్తున్నాడు. ప్రతి ప్లేయర్ గెలవాలనే ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. పైగా ఈ సారి ప్లే ఆఫ్స్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు లేకుండానే జరుగుతున్నాయి. దీంతో అనుభవం లేని జట్లపై గెలిచి తొలిసారి బెంగళూరు టైటిల్ గెలవడం ఖాయంగా కనిపిస్తుంది.