మార్కెట్లో కొనసాగుతున్న ఆర్డీ దందా

  • చర్యలు తీసుకోలేకపోతున్న పాలకవర్గం
  •     వారంలోనే రూ.3,100 పతనం 
  •     క్వింటాలుకు రూ.25,500 నుంచి 22,400కు డౌన్​ 
  •     జెండాపాట ఒక్క రైతుకే!
  •     మార్కెట్లో కొనసాగుతున్న ఆర్డీ దందా
  •     క్వాలిటీ లేదంటున్న వ్యాపారులు

ఖమ్మం టౌన్, వెలుగు: మార్కెట్లో తేజా రకం మిర్చి ధర రోజురోజుకు పడిపోతోంది. ఈనెల 20న క్వింటాలుకు రికార్డు స్థాయిలో రూ.25,500 చొప్పున పలికింది. ఆ రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్​కుమార్ జెండా పాటకు రావడంతో ఆస్థాయి రేటు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ పరిస్థితి మారుతూ వస్తోంది. మంగళవారం ఆ రేటు రూ.22,400కు పడిపోయింది. కేవలం 8 రోజుల తేడాలోనే క్వింటాలుకు రూ.3100 తగ్గింది. ప్రతి రోజూ జెండా పాటలో ఎక్కువ ధర పలికిన మిర్చిని ‘డీలక్స్ బెస్ట్ క్వాలిటీ’ అంటారు.

ఈ క్వాలిటీ మిర్చి ఏ ఒక్క రైతు దగ్గర ఉండదని రైతులకు వ్యాపారులు మాయమాటలు చెప్పి పక్కదారి పట్టిస్తున్నారు. డీలక్స్ బెస్ట్ క్వాలిటీ ఉన్న మిర్చిని కూడా 'బెస్ట్' గా(డ్రై ఆయిల్ రకం పేరుతో) చూపి క్వింటా రూ.21 వేల చొప్పున ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మెతకగా ఉందంటూ మరో సాకు చూపించి, రూ.16 వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. జెండా పాటగా పెట్టిన ధర ఆ ఒక్క రైతుకు మాత్రమే వర్తిస్తుందంటూ మిగతావారికి మిర్చి క్వాలిటీ ఆధారంగా రూ.21 వేల నుంచి రూ.16 వేల వరకు కొనుగోలు చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక...

మార్కెట్ లో ప్రతిరోజు మిర్చి క్వాలిటీని చెక్ చేసే సమయంలో నిబంధనల ప్రకారం గ్రేడ్ వన్, గ్రేడ్ టూ సెక్రెటరీలతో పాటుగా సూపర్ వైజర్, యార్డ్ ఇన్​చార్జిలు తప్పనిసరిగా ఉండాలి. అయితే వీరెవ్వరు లేకుండానే సెక్యూరిటీ గార్డ్, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్​కలిసి గ్రేడ్ సెలెక్ట్ చేశాక జెండా పాట పెట్టే చోటుకు అధికారులు వచ్చి ఫొటోలకు ఫోజులిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం మార్కెట్ నుంచి ఇతర దేశాలకు మిర్చిని ఎగుమతి చేసే ఆరుగురు బడా వ్యాపారులు ఎవ్వరు కూడా జెండా పాటలో పాల్గొనడం లేదన్న ఆరోపణలున్నాయి. 

జెండా పాట ధరకు రైతు దగ్గర బస్తాలు కొనుగోలు చేసినందుకు సదరు వ్యాపారికి మార్కెట్ ఫీజు తగ్గిస్తామని ఆఫర్ ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. జెండా పాట రేటు ఎక్కువగా పెట్టడంతో, ఖమ్మంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన రైతులు తమ మిర్చికి మంచి ధర వస్తుందని భావించి ఇక్కడికి పంటను తెస్తున్నారు. వచ్చాక రైతులు తమ పంటకు వ్యాపారి పెట్టే ధరను చూసి ఎందుకొచ్చామా అని ఆవేదన చెందుతున్నారు. మిర్చి క్వాలిటీని ఏ ప్రామాణికంగా ధర నిర్ణయిస్తున్నారో అర్థం కావడం లేదని రైతులు వాపోతున్నారు.

క్వాలిటీని తాలుగా చూపిస్తూ..

ఇక చాలా ఏళ్ల నుంచి మార్కెట్ లో రేట్ డిఫరెన్స్(ఆర్డీ) దందా కంటిన్యూ అవుతోందన్న ఆరోపణలున్నాయి. కొత్త పాలకవర్గం ఏర్పాటు అయ్యాక ఈ మోసాలకు చెక్​ పడడం లేదన్న వాదనా ఉంది. మంచి క్వాలిటీ మిర్చిని కూడా తాలుగా రికార్డుల్లో చూపిస్తూ, మార్కెట్ ఆదాయానికి గండిపెడుతున్నారు. కొత్తగా గత నెలలో బాధ్యతలు తీసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్​దృష్టిసారించి ఇలాంటి మోసగాళ్లకు చెక్​ పెట్టాలని రైతులు కోరుతున్నారు. 

న్యాయం చేసేందుకే మా ప్రయత్నం..

వ్యవసాయ మార్కెట్ కు పంటను తీసుకువచ్చే రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసేందుకే పాలకవర్గం ప్రయత్నిస్తోంది. జెండా పాట సమయంలో స్వయంగా మిర్చి క్వాలిటీని పరిశీలిస్తున్నా. వ్యాపారులందరూ పాల్గొనేలా రెగ్యులర్ గా వారితో సమావేశాలు నిర్వహిస్తున్నాం. రైతు నష్టపోవద్దన్నదే ధ్యేయం. - దోరేపల్లి శ్వేత, మార్కెట్ చైర్ పర్సన్, ఖమ్మం

ఎందుకచ్చిన్నో అర్థమైత లేదు..

ఖమ్మం మార్కెట్ లో మిర్చికి మంచి ధర వస్తుందని 10 బస్తాలు తెచ్చిన.  జెండా పాట రూ.22,400 పలికింది. నా మిర్చి పంట చాలా బాగా(క్వాలిటీ) ఉన్నా వ్యాపారి రూ.19 వేలే పెట్టాడు. ఊర్లోకి వచ్చి కొనుగోలు చేసే వ్యాపారులు రూ.21వేలు ఇస్తమని చెప్పిన్రు. అయినా మంచి రేటు వస్తుందేమోనని పంటను ఇక్కడికి తెస్తే నష్టమే వచ్చింది.  ‌‌‌‌‌‌‌‌ - కృష్ణ, రైతు, తల్లాడ