- భద్రాచలం ఆర్డీవో దామోదర్
భద్రాచలం, వెలుగు : సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాల కోసం చేపడుతున్న పనులన్నీ జనవరి 6 లోపు పూర్తి కావాలని ఆర్డీవో దామోదర్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసులో శనివారం నిర్వహించిన ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవ ఏర్పాట్ల రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఆఫీసర్లంతా అప్పగించిన విధులను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఉత్సవాల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు పోలీసులతో సమన్వయం చేసుకుని నిర్వహిస్తామన్నారు.
లాడ్జి, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించామని చెప్పారు. తెప్పోత్సవం కోసం ఏర్పాటు చేసిన హంస వాహనాన్ని తనిఖీ రిపోర్టు ఇవ్వాలని ఇరిగేషన్ ఈఈకి సూచించారు. భద్రాచలం, పర్ణశాలల్లో శానిటేషన్ ఎంపీడీవో, తహసీల్దార్లు చూసుకోవాలని చెప్పారు.
భక్తులకు రైలు, బస్సు సమయాలను, జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేసేలా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులెవరికైనా గుండెపోటు వస్తే సీపీఆర్ చేయడానికి పోలీసులు, గ్రామపంచాయతీ సిబ్బందికి ఈనెల 27న స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలని డీఎం హెచ్వో కు సూచించారు. ఇన్చార్జ్ డీఎస్పీ రవీందర్రెడ్డి, దేవస్థానం ఈవో రమాదేవి వివిధ శాఖల ఆఫీసర్లు మీటింగ్లో పాల్గొన్నారు.