పేరుకే ఆర్డీవో ఆఫీస్..ఉండేది ఇద్దరు అటెండర్లు మాత్రమే

పేరుకే ఆర్డీవో ఆఫీస్..ఉండేది ఇద్దరు అటెండర్లు మాత్రమే
  • ఏ అవసరం ఉన్నా మెదక్​ వెళ్లాల్సిందే..

రామాయంపేట, నిజాంపేట, వెలుగు: ఎన్నో ఉద్యమాల తర్వాత మెదక్ జిల్లా రామాయంపేటలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటైంది. కానీ అది పేరుకే ఆర్డీవో ఆఫీస్ అక్కడ ఆర్డీవో, ఏవో, ఇతర సిబ్బంది ఎవరూ ఉండరు, కేవలం ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటారు. ఆర్డీవో ఆఫీస్​ ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు, సిబ్బందిని నియమించకపోవడంతో ఆఫీస్​ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో జిల్లాల పునర్విభజన చేపట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే క్రమంలో కొత్త రెవెన్యూ డివిజన్లు సైతం ఏర్పాటు చేశారు. 

ఈ క్రమంలో రామాయంపేట కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని రామాయంపేట పరిసర మండలాల ప్రజలు డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నెలల పాటు రిలే నిరాహార దీక్షలు,  పాదయాత్రలు, బంద్​లు, ర్యాలీలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేకు వినతిపత్రాలు అందించారు. అయినప్పటికీ  ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు మెదక్ లో జరిగిన బహిరంగ సభలో అప్పటి సీఎం కేసీఆర్​ రామాయంపేట రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

ఈ మేరకు రామాయంపేట, నిజాంపేట్, నార్సింగి, చిన్న శంకరం పేట మండలాలను కలిపి కొత్త రెవెన్యూ డివిజన్ ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడగా గతేడాది అక్టోబర్ లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు​ చేతుల మీదుగా రామాయంపేట పట్టణంలో ఆర్డీవో ఆఫీస్ ప్రారంభించారు. కానీ ఆర్డీవో, అడ్మినిస్ట్రేటివ్​ఆఫీసర్, ఇతర సిబ్బందిని నియమించలేదు.  ప్రస్తుతం ఆఫీస్ లో ఇద్దరు అటెండర్లు మాత్రమే ఉంటున్నారు. ప్రస్తుతం మెదక్ ఆర్డీవో రమాదేవి రామాయంపేట ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు ఆర్డీవో ఆఫీస్ తో ఏ అవసరం ఉన్న మెదక్ వెళ్లాల్సి వస్తోంది.

ఆర్డీవోను నియమించాలి

ఎన్నికల సమయంలో ఆర్డీవో ఆఫీస్ ఓపెన్​ చేశారు కానీ ఆఫీసర్లను నియమించలేదు. ఎప్పుడూ పోయి చూసినా ఆఫీస్​లో ఖాళీ కుర్చీలే కనపడుతున్నాయి. రైతులు భూ సమస్యల పరిష్కారం కోసం రామాయంపేట ఆర్డీవో ఆఫీస్​కు వచ్చి అక్కడెవరూ లేకపోవడంతో మెదక్ కు వెళ్లాల్సి వస్తుంది. ప్రజల ఇబ్బందులు గుర్తించి వెంటనే ప్రభుత్వం రామాయంపేటకు ఆర్డీవోను, సిబ్బందిని నియమించాలి. సత్తయ్య,  రైతు, చల్మెడ

పోస్టులు అలాట్ మెంట్ కాలేదు

రామాయంపేట ఆర్డీవో ఆఫీసుకు కొత్త పోస్టులు మంజూరు కాలేదు. అవి మంజూరు కాగానే  పూర్తి స్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇప్పటికైతే మెదక్ ఆర్డీవో కార్యాలయం నుంచి పాలన సాగుతుంది.
రమాదేవి, ఇన్‌చార్జి  ఆర్డీవో