మున్సిపాలిటీల్లో ఆఫీసర్లకు ఇన్​చార్జి తిప్పలు!

మున్సిపాలిటీల్లో ఆఫీసర్లకు ఇన్​చార్జి తిప్పలు!
  • తాజాగా మున్సిపాలిటీలను ఆర్డీవో, ఇతర  ఆఫీసర్లకు అప్పగించేందుకు కసరత్తు
  • ఇప్పటికే జీపీ, మండల పరిషత్, జిల్లాపరిషత్​లో ప్రత్యేకాధికారుల పాలన
  • దీనికి తోడు ఆయా శాఖల్లో మండల, జిల్లా స్థాయి అధికారులు బిజీ
  • ఈ తరుణంలో కొత్త బాధ్యతలపై ఆందోళన

ఖమ్మం, వెలుగు : మున్సిపాలిటీల్లో పాలకవర్గాల కాల పరిమితి ముగుస్తుండడం అధికారులకు టెన్షన్ తెప్పిస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు​, జిల్లా పరిషత్​ల్లో స్పెషలాఫీసర్ల పాలన కొనసాగుతోంది. ఈనెల 26తో మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగుస్తుండడంతో, వాటిని కూడా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలకు ఆర్డీవోలను స్పెషల్​ ఆఫీసర్లుగా నియమించనున్నట్టు తెలుస్తోంది. 

అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, నలుగురు మాత్రమే ఆర్డీవోలున్నారు. దీంతో మిగిలిన చోట్ల అడిషనల్​ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. దీనిపై రెండ్రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలు, ఇతర బాధ్యతల్లో ఆఫీసర్లు బిజీగా ఉండగా, కొత్తగా మరిన్ని పనులు, బాధ్యతలు పెరుగుతుండడంతో ఆఫీసర్లు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. అన్ని పనులను మేనేజ్​ చేయడం ఎలా అంటూ తలలు పట్టుకుంటున్నారు.

ఎక్కడెక్కడ ఎవరు ఉండే చాన్స్..?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి, మధిర, వైరా, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలున్నాయి. వీటిలో ఈనెల 26తో ఐదుచోట్ల పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. పాల్వంచ, మణుగూరులో కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల చాలా ఏళ్లుగా ఎన్నికలు జరగలేదు. వైరా మున్సిపాలిటీని ఖమ్మం ఆర్డీవోకు, సత్తుపల్లి మున్సిపాలిటీని కల్లూరు ఆర్డీవోకు, మధిర మున్సిపాలిటీని అడిషనల్​ కలెక్టర్​ కు స్పెషలాఫీసర్​ గా నియమించే చాన్సుంది. ఇక కొత్తగూడెం మున్సిపాలిటీని అడిషనల్​కలెక్టర్​కు, ఇల్లెందు మున్సిపాలిటీలని కొత్తగూడెం ఆర్డీవోకు, మణుగూరు బాధ్యతలను ఐటీడీఏ పీవోకు, పాల్వంచ మున్సిపాలిటీని భద్రాచలం ఆర్డీవోకు అదనపు బాధ్యతలను ఇవ్వొచ్చని సమాచారం. 

ప్రస్తుతం రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాల అమలుపై గ్రామ సభలతో అధికారులు బిజీగా ఉన్నారు. ఇక జిల్లా స్థాయి ఆఫీసర్లుగా ఉన్న వారు రెగ్యులర్​ డ్యూటీలతోనే సతమతమవుతున్నారు. ఆర్డీవోలకు రెవెన్యూ సంబంధిత సమస్యలు, రోడ్లు, రైల్వే, కాల్వలకు సంబంధించి భూసేకరణ, ధరణితో వచ్చిన సమస్యలతో బిజీగా ఉంటున్నారు. అడిషనల్ కలెక్టర్లది కూడా దాదాపు అదే పరిస్థితి. ఈ తరుణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్లుగా అదనపు బాధ్యతలు మాత్రం తప్పే అవకాశం కనిపించడం లేదు. 

పనులు అయ్యే పరిస్థితి తక్కువే!

గ్రామ పంచాయతీలకు గతేడాది ఫిబ్రవరిలో కాల పరిమితి ముగియగా, మండల, జిల్లా పరిషత్​ లు ఆర్నెళ్ల క్రితమే స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి వెళ్లాయి. అప్పట్లో మండల ప్రత్యేక అధికారులుగా జిల్లాలోని వేర్వేరు ఆఫీసర్లకు ప్రత్యేక బాధ్యతలు ఇవ్వగా, ఇంతవరకు ఆ అదనపు విధుల్లో చిన్న పని కూడా చేయని వారున్నారు. అసలు మండలానికి స్పెషల్ ఆఫీసర్​ ఎవరో కూడా కింది స్థాయి సిబ్బందికి, ప్రజలకు తెలియని పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి వరకు ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, సమగ్ర సర్వే లాంటి రెగ్యులర్​ పనుల్లో ఆఫీసర్లు బిజీగా ఉన్నారు. 

మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారుల పర్యటనలో మాత్రమే స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్న వారు అటెండ్​ అవుతుండగా, మిగిలిన పాలన వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్​ గా పాల్గొనే పరిస్థితి లేదు. అయితే మున్సిపాలిటీలకు మాత్రం అలాంటి అవకాశం ఉండదు. ఆయా వార్డుల్లో తరచూ వచ్చే సమస్యలు, పారిశుధ్యం, తాగునీరు సహా అన్నింటిలో రెగ్యులర్​ ఫాలో అప్​ చేయాల్సి ఉంటుంది. దీంతో పని ఒత్తిడి మరింత ఎక్కువయ్యే అవకాశం ఉన్నా, బాధ్యతలు తీసుకోక తప్పదని కొంతమంది ఆఫీసర్లు చెబుతున్నారు.