మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగినట్లు, అనర్హులకు కేటాయించినట్లు ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి విచారణకు ఆదేశించారు. గతంలో ప్రాథమిక విచారణ చేసి అధికారులు నివేదిక అందించారు. కాగా తుది ఎంక్వైరీ చేసి అక్రమాలను తేల్చేందుకు 15 మంది అధికారులను నియమించారు. బుధవారం నుంచి ఇంటింటికీ తిరిగి సమగ్ర తుది విచారణ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
దివిటి పల్లి లో 1024, వీరన్నపేటలో 660, క్రిస్టియన్ పల్లిలో 310 మొత్తం 1994 ఇండ్లు నిర్మాణం చేసి లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు, నిబంధనలు పాటించకుండా అనర్హులకు, స్థానికేతరులకు ఇవ్వడం, ఒకరికి కేటాయించిన ఇంట్లో వేరే వారు అక్రమంగా నివాసం ఉండడం, ప్రభుత్వ, ప్రైవేట్, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఇండ్లు కేటాయించారు. గతంలో నిర్వహించిన ప్రాథమిక విచారణలో అనర్హులకు కేటాయింపు జరిగినట్లు ఆధారాలు లభించాయన్నారు. ఎనుగొండకు సంబంధించిన 588 ఇండ్ల లబ్ధిదారుల అర్హత పై విచారణ పూర్తయిందని పేర్కొన్నారు.