హనుమకొండ వెయ్యిస్తంభాల గుడిలోని కల్యాణ మండపం పనులు 99 శాతం పూర్తయ్యాయని కిషన్‍రెడ్డి వెల్లడించారు. వారంలోపు మిగిలిన పనులు పూర్తిచేసి ఫిబ్రవరి నెలాఖరులో మండపాన్ని భక్తులు, పర్యాటకులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అదేరోజు వరంగల్ కోటాలో కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి పేరుతో నాటి పాలకులు 15 ఏండ్లుగా శిల్పకళాసంపదను మూలకుపెట్టారని విమర్శించారు.
మండపం పునఃనిర్మాణానికి కేంద్రం తరఫున తాను ప్రత్యేక చొరవ చూపినట్లు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో ఆధ్యాత్మిక విప్లవం తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రైబల్ సర్క్యూట్‍లో భాగంగా ఉమ్మడి ఓరుగల్లులో పర్యాటకరంగాన్ని డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. ములుగులో గిరిజన యూనివర్సిటీని ప్రారంభించి.. విద్యా సంవత్సరం ఇదే ఏడాదినుంచి మొదలయ్యేలా ప్రధాని ఆలోచన చేస్తున్నారన్నారు.
రామప్పకు యునెస్కొ సాధనకు కృషి చేసినట్లే.. మేడారం జాతర నిర్వహణకు సైతం కేంద్రం తరఫున సహకారం అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాల్సిన కొత్త నిర్మాణాలు చేపట్టి రాష్ట్రానికి అప్పజెప్పనున్నట్లు వివరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‍రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.