- ప్రతిపాదనలు రూపొందిస్తున్న అధికారులు
- త్వరలో భూ సేకరణకు నిధులు విడుదల
కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ పనులకు సంబంధించి నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి మళ్లీ ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటిని 5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించనున్నారు. భూ సేకరణ కు త్వరలో ఫండ్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పనులకు సంబంధించి ఆఫీసర్లతో మాట్లాడి ఇరిగేషన్‌మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరాలు తెలుసుకున్నారు. కొద్ది రోజుల్లో కాల్వలు, రిజర్వాయర్ల నిర్మాణం పనులు ప్రారంభించనున్నారు. 22వ ప్యాకేజీ ద్వారా జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాల్లోని 1.90 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది. 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ పనులు ప్రారంభం కాగా, ఆ తర్వాత రాష్ర్ట విభజన జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్యాకేజీ పనులను పట్టించుకోలేదు.
22 ప్యాకేజీ పనుల్లో..
నిజామాబాద్ జిల్లాకు 20, 21 ప్యాకేజీ, కామారెడ్డి జిల్లాకు 22 ప్యాకేజీ కేటాయించారు. 21 ప్యాకేజీ లో మంచిప్ప -కొండెం చెరువు నుంచి కామారెడ్డి జిల్లాకు సాగు నీరు అందనుంది. సదాశివనగర్ మండలం భూంపల్లి దగ్గర నిర్మాణం చేపట్టిన రిజర్వాయర్‌నుంచి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు సాగు నీరు అందించాలని తొలుత ప్రతిపాదించారు. ఇందుకనుగుణంగా పనులు జరిగాయి. మళ్లీ కొత్తగా నాలుగు రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. ఇవి ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది.
రాష్ర్టంలో మళ్లీ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 22వ ప్యాకేజీ పనుల్లో వేగం పెంచేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారు. ప్రభుత్వ సలహదారు షబ్బీర్‌అలీ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు ఈ ప్యాకేజీ పనుల విషయం సీఎం, ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఇటీవల హైదరాబాద్‌లో ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రివ్యూ చేశారు. రిజర్వాయర్ల నిర్మాణంతో పాటు, భూ సేకరణ అంశం, కాల్వల తవ్వకాలపై చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో నాలుగు రిజర్వాయర్లకు సంబంధించి మళ్లీ ప్రతిపాదనలు పంపుతున్నారు. పనులకు సంబంధించి 2800 ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. గతంలో చేపట్టిన భూ సేకరణకు ఇంకా రూ.20 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది.
నాలుగు చోట్ల రిజర్వాయర్లు
లింగంపేట మండలం మోతె లో 2 టీఎంసీలు, కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లిలో 1.38 టీఎంసీలు, గాంధారి మండలం కాటేవాడిలో 0.50 టీఎంసీలు, సదాశివనగర్ మండలం ముద్దోజివాడి, ధర్మరావుపేటలో1.5 టీఎంసీల సామర్థంగల రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా అంచనా వ్యయం కూడా పెరగనుంది. ఉన్నతాధికారుల ఆదేశాలతో అంచనాలు రూపొందించామని, కొద్ది రోజుల్లోనే ప్రభుత్వానికి పూర్తి నివేదిక పంపిస్తామని సంబంధిత ఆఫీసర్లు తెలిపారు.