
- నిర్మల్ జిల్లా లో పైలట్ ప్రాజెక్ట్ గా ఆరు గ్రామాల ఎంపిక..
- కొత్త టెక్నాలజీ తో కొలతలు
- పక్కాగా భూ హద్దుల నిర్ధారణ
- భూ వివాదాలకు పరిష్కారం దిశగా అడుగులు
- శాటిలైట్ సహకారం తో పాత హద్దుల గుర్తింపు
నిర్మల్, వెలుగు: వందేళ్ల తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు భూముల రీ సర్వేకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రతి 30 ఏళ్లకోసారి భూముల రీ సర్వే జరగాల్సి ఉన్నప్పటికీ వందేళ్ల కూడా ప్రభుత్వాలు ఆ ప్రక్రియను చేపట్టలేదు. సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1923 ప్రకారం ఈ సర్వేను చేపట్టాల్సి ఉంది. భూముల రీ సర్వే జరగకపోవడంతో అన్నిచోట్ల భూతగాదాలు ఏర్పడడం, రోజురోజుకు సమస్యలు పెరిగిపోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది.
దీంతో పాటు కోర్టు కేసులు పెరిగిపోతున్నాయి. భూ వివాదాలు అనేక రకాల సమస్యలకు కారణమవుతున్నాయి. సరిహద్దుల వివాదాలు, సర్వే నంబర్లు, బై నంబర్ల వివాదాలు పెరిగిపోతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను అమల్లోకి తేవడంతో సర్వే నంబర్లు, బై నంబర్లు సరిహద్దుల వివాదాలు రెవెన్యూ శాఖకు సవాల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ధరణిని రద్దుచేసి భూమాత పోర్టల్ ను అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటే భూముల రీ సర్వే చేయాలని నిర్ణయించింది.
మొదట ప్రతి జిల్లాలోని కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా భూముల రీ సర్వే చేపట్టబోతోంది. మొత్తం 33 జిల్లాల్లో భూముల రీసర్వే ను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో చేపట్టబో తున్నారు. జిఐఎస్ విధానంతో సాటిలైట్ సహకారాన్ని తీసుకొని పక్కాగా భూముల సరిహద్దులను , బై నెంబర్, సర్వే నంబర్ల హద్దులను నిర్ధారించనున్నారు. చాలా ఏళ్ల నుంచి ఒకే సర్వే నంబర్ పై ఉన్న భూముల కొనుగోలు, అమ్మకాల ద్వారా అవి బై నంబర్లుగా మారిపోవడంతో వాటి సరిహద్దులు మారిపోయాయి. రికార్డుల్లో ఓ రకంగాను క్షేత్రస్థాయిలో మరో రకంగాను సరిహద్దులు ఉండడంతో కోర్టు వివాదాలతో పాటు అనేక రకాల వివాదాలు తలెత్తుతున్నాయి. ధరణి పోర్టల్ అమల్లోకి రావడంతో రికార్డులను తారుమారు చేస్తూ రిజిస్ట్రేషన్ సమయంలో హద్దులను మార్చినట్లు ఆరోపణలున్నాయి. ఒకే సర్వే నెంబర్ పై అసలు విస్తీర్ణం కన్నా ఎక్కువ విస్తీర్ణం రికార్డుల్లో నమోదయింది.
శాస్త్రీయ పద్ధతిలో రీ సర్వే...
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ భూముల రీసర్వేను పూర్తి శాస్త్రీయ పద్ధతిలో చేపట్టేందుకు సిద్ధమవుతోంది. శాటిలైట్ సహకారాన్ని తీసుకోబోతున్నారు. జిఐఎస్ పద్ధతిలో పాత రికార్డులను ఆధారంగా చేసుకుని అలాగే అప్పటి మ్యాపులను సైతం పరిశీలిస్తూ ఈ సర్వే చేపట్టబోతున్నారు. శాస్త్రీయ పద్ధతిలో చేపట్టబోయే భూముల రీసర్వేకు సంబంధించి 33 జిల్లాలకు చెందిన సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్లకు, సర్వేయర్లకు హైదరాబాద్ లోని సర్వే భవన్‌లో ఇటీవలే ప్రత్యేక శిక్షణను ఇచ్చారు. దీనికి సంబంధించి అన్ని జిల్లాలకు ఆధునిక సాంకేతికతతో కూడిన పరికరాలను సైతం ప్రభుత్వం అందించబోతోంది. ఇటీవలే ఈ పరికరాలకు సంబంధిం చిన టెండర్ ప్రక్రియను కూడా నిర్వహించారు. మొదట పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రా మాలకు సంబంధించి భూముల పాత, కొత్త రికార్డులను, మ్యాపులను అందుబాటులో ఉంచుకొని ఆ తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఈ సర్వేను
నిర్వహించనున్నారు.
ఆరు గ్రామాల్లో రీ సర్వే...
నిర్మల్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద ఆరు గ్రామాలను ఎంపిక చేశారు. మామడ మండలం పొ న్కల్ గ్రామంలో 433 .05 ఎకరాలను, లోకేశ్వరం మండలం హవార్గా గ్రామంలో 876.25 ఎక రాలు, సోన్ మండలం గంజాల్ గ్రామంలో 792.36 ఎకరాలు, దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో 1160. 02 ఎకరాలు, నిర్మల్ రూరల్ మండలంలోని అనంతపేట గ్రా మంలో 721.36 ఎకరాలు, అర్బన్ పరిధిలోని విశ్వనాథ్ పేటలో 673.29 ఎకరాల కింద రీ సర్వే చేయనున్నారు.