- రిజర్వాయర్‌గా మార్చేందుకు రీ వెరిఫికేషన్ సర్వే షురూ
- 2016లోనే రూ.204 కోట్ల అంచనాతో భూమిపూజ
- ఎల్లంపల్లి ప్రాజెక్ట్నుంచి నీటిని తరలించాలని నిర్ణయం
- నేటికీ తట్టెడు మట్టి తీయలే
- ఏళ్లుగా 43 గ్రామాల రైతులకు ఎదురుచూపులే
జగిత్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా కథలాపూర్మండలం కలిగోట శివారులోని సూరమ్మ చెరువును రిజర్వాయర్‌గా మార్చే పనుల్లో కదలిక వచ్చింది. రిజర్వాయర్ నిర్మాణానికి రీ వెరిఫికేషన్ సర్వే చేపట్టడంతో ఎన్నో ఏండ్ల కల సాకారం కానుంది. 15 ఏండ్ల కింద నాటి సర్కార్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్‌కు 2016లో బీఆర్ఎస్ సర్కార్ భూమి పూజ చేసి వదిలేసింది. అప్పటి నుంచి తట్టెడు మట్టి తీయకపోగా ప్రతీ ఎన్నికల్లో రిజర్వాయర్ నిర్మాణం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కార్ సూరమ్మ రిజర్వాయర్పనులు చేపట్టేందుకు ముందుకు రావడంతో రైతుల్లో ఆశలు చిగురుస్తున్నాయి.
43 గ్రామాల్లో 50వేల ఎకరాలకు సాగునీరు
సూరమ్మ చెరువు రిజర్వాయర్‌గా మారితే చుట్టుపక్కల ఉన్న కథలాపూర్, మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి మండలాల్లోని 43 గ్రామాల్లో 50 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కథలాపూర్ మండలంలో ఎలాంటి సాగునీటి వసతులు లేవు కేవలం సూరమ్మ చెరువు ఒక్కటే ఆధారం. ఈ క్రమంలో ఇక్కడి రైతులకు సాగునీరు అందించేందుకు 15 ఏండ్ల కింద అప్పటి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించి సూరమ్మ రిజర్వాయర్నింపితే కుడి, ఎడమ కాల్వల ద్వారా సాగునీరు ఇచ్చేందుకు నిర్ణయించింది.
కలిగోట, అంబారిపేట, రుద్రంగి గ్రామాల సరిహద్దుల్లో సుమారు 650 ఎకరాలు సేకరించారు. నష్ట పరిహారం విషయంలో కొంత వివాదం నెలకొనగా పదేళ్ల తర్వాత సమస్య పరిష్కారమైంది. అయితే కాల్వల కోసం భూసేకరణ మాత్రం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ.204 కోట్లతో కాలువల నిర్మాణ పనులకు 2016, జూన్ 22న అప్పటి మంత్రి హరీశ్ రావు భూమి పూజ చేశారు.
కుడి కాల్వ 19.4 కిలోమీటర్లు, ఎడమ కాల్వ 14.85 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. దీంతో 43 గ్రామాల రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. కాల్వల కోసం 521 ఎకరాలు అవసరమవుతాయని ప్రపోజల్స్ పంపినా భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎల్లంపల్లి నుంచి సూరమ్మ చెరువుకు నీళ్లు తరలించడానికి చేపట్టిన కాలువ నిర్మాణం సైతం పూర్తికాలేదు.
ఎన్నికల ప్రచారంలో హామీ
సూరమ్మ రిజర్వాయర్ అంశం సుమారు పదేళ్లుగా ఎన్నికల హామీగానే మిగిలిపోతోంది. ప్రతి ఎన్నికలో అభ్యర్థులు మొదలుకొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరూ రిజర్వాయర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన గాలికి వదిలేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పీసీసీ హోదాలో, మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూరమ్మ చెరువును పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశం నిర్వహించి పార్టీ అధికారంలోకి రాగానే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారే ఉండడంతో రిజర్వాయర్ పూర్తవుతుందని రైతులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు సూరమ్మ చెరువు ప్రాజెక్టు పనులు షురూ అయ్యాయి. ఇటీవల ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ యాస్మిన్ బాషాతో ప్రత్యేకంగా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. గత నెల 21న ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు రీ సర్వే పనులు ప్రారంభించారు.
రీ వెరిఫికేషన్ సర్వే చేస్తున్నాం
గతంలో సూరమ్మ చెరువు ప్రాజెక్టు నిర్మాణం కోసం చేసిన సర్వేను రీవెరిఫికేషన్చేస్తున్నాం. సూరమ్మ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వ పనులకు ఇప్పటికే సర్వే ప్రారంభించాం. కలికోట, పోతారం, ఇప్పపల్లి, చింతకుంట గ్రామాల మీదుగా సుమారు 14.8 కిలోమీటర్ల పొడవున ఎడమ కాల్వ ఉంటుంది. తర్వాత కుడి కాల్వ పనులు కోసం కూడా సర్వే చేపడుతాం. ఆర్డీవోకు నివేదిక అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటాం.
ఏఈ గంగాధర్, కథలాపూర్