తొమ్మిదేండ్లలో ప్రజలకు చేరువైన ప్రధాని మోడీ పాలన

2014 లోక్‌‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నెలతో 9 ఏండ్లు పూర్తి చేసుకుంటుంది. మరి ఈ తొమ్మిదేండ్లలో దేశంలో వచ్చిన మార్పులేమిటనేది పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. కొన్ని నిర్ణయాలు అటు ఇటు ఉన్నా.. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులు, మహిళలు సహా సమాజంలోని అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ‘సబ్​కా సాత్, సబ్‌‌కా వికాస్, సబ్‌‌కా విశ్వాస్, సబ్‌‌కా ప్రయాస్’ అనే ఆలోచన నేడు భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మార్చిందనడంలో సందేహం లేదు. ప్రజల జీవితాల్లో, దేశంలో గుణాత్మక మార్పులను తీసుకురావడానికి నేటి కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక, సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో శుభ్రతను ప్రోత్సహించేందుకు 2014లో గాంధీ జయంతి రోజు ప్రధాని మోడీ ‘స్వచ్ఛ భారత్ అభియాన్‌‌’ను ప్రారంభించి, ఐదేండ్లలో 100 మిలియన్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణానికి కృషి చేశారు. 11.5 కోట్ల పైగా కుటుంబాలకు మరుగుదొడ్లు వచ్చాయి. రకరకాల పన్నులను ఏకతాటిపైకి తెచ్చి జీఎస్టీని అమలు చేస్తున్నది. స్వతంత్ర భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పన్ను సవరణ ఇది. ఈ నిర్ణయంతో కేంద్రం, రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి రావటం వల్ల, ప్రభుత్వ ఆదాయం భారీగా పెరిగింది. తొమ్మిదేండ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో జాతీయ రహదారుల విస్తరణ వేగవంతమైంది, రహదారి పొడవును లెక్కించే పద్ధతిలో మార్పు వచ్చింది. 2022 వరకు ఎనిమిదేండ్లలో 49,903 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రం నిర్మించింది.

ఎన్నో పథకాలతో..

కరోనా సమయంలో రాష్ట్రాలను ఆదుకోవడంతోపాటు ఉచిత వ్యాక్సిన్​ పంపిణీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజా సంక్షేమ పథకం, ప్రధాన మంత్రిగరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా 80 కోట్ల మందికి పైగా ఉచిత ఆహారధాన్యాలను అందించింది. తద్వారా దేశంలోని మిలియన్ల మందికి ఆహార భద్రత కల్పించింది. గత తొమ్మిదేళ్ల ప్రధాని మోడీ హయాంలో కేంద్ర ప్రభుత్వం మహిళలకు సాధికారత కల్పించడంతోపాటు వారిని సామాజికంగా, ఆర్థికంగా స్వావలంబన చేసేందుకు అనేక మహిళా పథకాలను ప్రారంభించింది. దేశంలో క్షీణిస్తున్న లింగ నిష్పత్తిని అరికట్టడం, సామాజిక అవగాహన కల్పించడం, బాలికలకు అవకాశాలను పెంపొందించడం అనే ఏకైక లక్ష్యంతో తెచ్చిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ అత్యంత చర్చనీయాంశమైన పథకాలలో ఒకటి. సుకన్య సమృద్ధి యోజన, పోషణ్ అభియాన్ లాంటి  మహిళా కేంద్రీకృత కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతుల నిరసనల తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు అగ్రి చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ కరోనా సమయంలో రైతులకు నగదు, ఎరువులు, యంత్రాలపై సబ్సిడీ రూపంలో ఆర్థిక సాయం అందించడం వల్ల రైతులు ఎంతో లబ్ధిపొందారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు కనీస ఆదాయ మద్దతుగా ఏడాదికి రూ.6 వేలు అందుతున్నాయి. సెప్టెంబరు 2019లో దేశంలోని చిన్న, సన్నకారు రైతులకు పెన్షన్ పథకం అయిన ప్రధాన మంత్రి కిసాన్ మంధన్ యోజనను కూడా ప్రారంభించి, రైతులకు 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు కనీసం రూ.3000 పెన్షన్ కూడా వచ్చేలా చేసింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతుల పంటలకు సమగ్ర నష్టపరిహారానికి హామీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను ప్రారంభించింది. స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయడం, వందే భారత్ రైళ్లు తీసుకు రావడం, 2014 తర్వాత అన్ని రాష్ట్రాల్లో జాతీయ స్థాయి విద్యా సంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు, ఇలా అనేక పథకాలు, విధానాల ద్వారా ఈ తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలందరికీ చేరువైంది. ప్రధాని నరేంద్ర మోడీ డైనమిక్ నాయకత్వం, ‘మదర్ ఇండియా’కు ఆయన చేసిన నిస్వార్థ సేవ సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో, పేద ప్రజల అభ్యున్నతిలో, మహిళలకు సాధికారత కల్పించడంలో, రైతులకు సాయం చేయడంలో, యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడంలో, అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది. దేశంలోని అణగారిన వర్గాల అభివృద్ధికి, సామాజిక ఆర్థిక పురోగతిని మార్చేలా మరిన్ని సంక్షేమ అభివృద్ధి పధకాలు, కార్యక్రమాలు పలు గుణాత్మక విధానాలను మరిన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని కోరుకుందాం.

ఓబీసీ కమిషన్​కు రాజ్యాంగ హోదా

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన వల్ల మిలియన్ల మంది భారతీయ మహిళలకు ప్రయోజనం చేకూర్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ప్రభుత్వం 3 కోట్లకు పైగా గృహాలను నిర్మించి, దేశంలోని అణగారిన వర్గాలకు అనుకూలమైన ధరల్లో అందించింది. నిరుపేదలు, రైతులు, పేదలకు సాయం చేసే విధానంలో భాగంగా, కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు10 శాతం రిజర్వేషన్‌‌ను ప్రకటించింది. అలాగే ఓబీసీ కమిషన్‌‌కు రాజ్యాంగ హోదా కల్పించింది. స్వచ్ఛ భారత్ మిషన్, జన్ ధన్ యోజన, ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి ఫ్లాగ్‌‌షిప్ పథకాలతో, దేశంలో అనేక మార్పులు తీసుకువచ్చింది. 2015లో సాధారణ భారతీయులకు అందుబాటులో ఉండేలా బీమా కవరేజీని అందించడానికి ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన స్కీంలను తీసుకువచ్చింది. ఆయుష్మాన్ భారత్ భారత ప్రభుత్వ జాతీయ ప్రజారోగ్య బీమా పథకం, దీని ప్రధాన లక్ష్యం అల్పాదాయ వర్గాలకు ఆరోగ్య బీమా కవరేజీ ఉచితంగా అందించడం. దీని వల్ల దేశ జనాభాలో దాదాపు 50% మంది ఈ పథకాల ద్వారా లబ్ధిపొందే వెసులుబాటు కలిగింది. 

ట్రిపుల్​ తలాఖ్

సెప్టెంబరు 2016లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌‌లో భారత ప్రత్యేక బలగాలు ‘సర్జికల్ స్ట్రైక్స్’ నిర్వహించగా, ఫిబ్రవరి 2019లో పాక్​ ఖైబర్- పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌‌లోని బాలాకోట్‌‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఎయిర్​ఫోర్స్​ ‘వైమానిక దాడులు’ నిర్వహించి దేశ రక్షణ బాధ్యతను చాటింది. 2020లో బ్యాంకుల విలీనాన్ని ప్రకటించి, జాతీయ స్థాయిలో ఏడు పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులను ఏర్పరిచారు. ఈ నిర్ణయం ప్రపంచ బ్యాంకులతో పోల్చదగిన స్థాయిని సాధించడంలో, ప్రపంచ పోటీతత్వాన్ని ఎదుర్కొని నిలవడంలో బ్యాంకులకు సాయపడింది. తక్షణ ట్రిపుల్ తలాక్‌‌ను నేరంగా పరిగణించే బిల్లు 2019 జులైలో పార్లమెంటులో ఆమోదం పొందింది. దాంతో ఎంతో మంది ముస్లిం మహిళలకు మేలు జరిగింది. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి, రాష్ట్రాన్ని విభజించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది. జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి, కాశ్మీర్ అభివృద్ధికి బాటలు వేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చి పాక్, బంగ్లాదేశ్, అఫ్గాన్​లలో హింసకు గురైన ముస్లిమేతర మైనారిటీలకు భారతీయ పౌరసత్వం ఇచ్చేలా కృషి చేసింది కేంద్ర ప్రభుత్వం.


- డా. కందగట్ల శ్రవణ్ కుమార్