- మరో 50 మందికి గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం
- ప్రమాద సమయంలో కంపెనీలో 380 మంది ఉద్యోగులు
- పేలుడు ధాటికి కూలిన ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్..శిథిలాల కింద కార్మికులు
- అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మాలో ఘటన
హైదరాబాద్, వెలుగు: ఏపీలో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా అడ్వాన్స్ డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో 18 మంది సజీవ దహనమయ్యారు. మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎసెన్సియా కంపెనీలో ఉద్యోగులు, కార్మికులంతా బుధవారం లంచ్ చేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది.
ప్రమాద సమయంలో 380 మంది షిఫ్ట్ లో పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కూలిపోయిందని..శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారని వెల్లడించారు. 18 మంది కార్మికులు అక్కడికక్కడే చనిపోయారని..వారి డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడిపోయాయని చెప్పారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. పై ఫ్లోర్లలో ఉన్న కార్మికులను క్రేన్ ద్వారా కాపాడిట్లు తెలిపారు. 11 ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చినట్లు వివరించారు. సహాయక చర్యల్లో ఎన్డీఆప్ఎఫ్ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి: జగన్
ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు కారణంగా పలువురు మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైసీపీ చీఫ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తున్నట్లు ట్వీట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎల్జీపాలిమర్స్‌బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలోనూ మరణించిన వారి కుటుంబాలకు రూ.1కోటి చొప్పున పరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందించాలని, వారు కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం చేయాలన్నారు. వైసీపీ నాయకులతో కూడిన బృందం బాధితులకు తోడుగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరపాలని, మళ్లీ ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని జగన్ కోరారు.
నేడు అచ్యుతాపురానికి ఏపీ సీఎం చంద్రబాబు
ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు గురువారం ఉదయం అచ్యుతాపురానికి వెళ్లనున్నారు. ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విషయం తెలిసిన వెంటనే బాధితులను కలిసేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందన్న అధికారుల సూచనతో ఆ యోచనను పవన్ తాత్కాలికంగా విరమించుకున్నారు.