హైదరాబాద్, వెలుగు: వచ్చే నెల నుంచి అమల్లోకి రాబోయే కొత్త క్రిమినల్ యాక్ట్‌లపై లాయర్లు అధ్యయనం చేయాలని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీ. సామ్ కోశి, జస్టిస్ సుజోయ్ పాల్ సూచించారు. న్యాయవాదులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించే నిమిత్తం రెండు రోజులపాటు జరిగే శిక్షణా కార్యక్రమాలను పోలీస్ అకాడమీలో రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ, స్టేట్ బార్ కౌన్సిల్ ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ..లాయర్లు చట్ట నిబంధనలపై లోతుగా అధ్యయనం చేయాలన్నారు. పాత, కొత్త క్రిమినల్ చట్టాల నిబంధనలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పర్చుకోవాలని చెప్పారు. తద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందన్నారు. అంతేకాకుండా.. కోర్టులకు కూడా ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ ఎం. రాజేందర్ మాట్లాడుతూ.. న్యాయవాదులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. ఈ శిక్షణ సమాజాన్ని లాయర్లు సరైన దిశలో నడిపించేందుకు దోహదపడుతుందన్నారు.