పుస్తక పఠనం కావాలి ఒక పాఠ్యాంశం

పుస్తక పఠనం కావాలి ఒక పాఠ్యాంశం

అభివృద్ధి చెందిన దేశాలైన, యూరప్, అమెరికా తదితర దేశాలలో గ్రంథాలయాలకు వెళ్తారు. అవకాశం ఉంటే తల్లిదండ్రులు, కుటుంబ సమేతంగా వెళ్లి పుస్తకాలు చదువుతారు. చదవడం ఒక అలవాటు. గ్రంథాలయాలను సందర్శించడం ఒక పరిపాటి. మన దగ్గర విద్యార్థులు  ఖాళీ సమయాలలో, సెలవు దినాలలో మనం ఎన్ని సినిమాలు చూసాం, ఎన్ని వీడియో గేమ్స్​ ఆడాం, ఎన్ని రీల్స్ చేసాం అంటూ సామాజిక మాధ్యమాలలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో సమయాన్ని వృధా చేస్తున్నారు. అలా కాకుండా అమెరికా, న్యూజిలాండ్, ఫిన్లాండ్ , ఇంగ్లాండ్, కెనడా, సింగపూర్ దేశాలలో ఎన్ని పుస్తకాలు చదివామో చెప్పుకోవడం గొప్పతనంగా భావిస్తారు.  ఆంగ్ల బోధనలో భాగంగా అక్కడ పుస్తక పఠనం ఒక పాఠ్యాంశం.

అభివృద్ధి చెందిన దేశాలలో 4, 5వ తరగతి వచ్చేనాటికి  పుస్తకాలు ఎక్కువగా చదవడం వల్ల రచయితలుగా ఎదుగుతున్నారు.   మన దేశంలో అలా అసలు జరగట్లేదని కాదు.. మనదేశంలో కూడా అక్కడక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు యువ రచయితలను, యువ కవులను ప్రోత్సహిస్తూ వారి రచనలను పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ముద్రిస్తున్నాయి. ఇది మంచి తరుణం. కానీ, దీని శాతాన్ని విస్తరించవలసిన అవసరం ఉన్నది. పాఠశాలలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకొని విద్యార్థులకు పుస్తక పఠనం అలవాటు చేయవలసిన అవసరం ఉన్నది.  అయితే అభివృద్ధి చెందిన దేశాలలో విద్యార్థులే కాకుండా పెద్దలు, ఉపాద్యాయులు కూడా ఎక్కువగా చదువుతుంటారు. అక్కడ  రైలు ప్రయాణాలలో, బస్సు  ప్రయాణంలో, మెట్రో రైల్వే స్టేషన్లలో  వీడియో గేమ్స్​, సెల్ ఫోన్లు, చూసే వారి సంఖ్య తక్కువ. 

సక్సెస్​కు దారి లైబ్రరీ

డిజిటల్ యుగంలో కూడా పుస్తకాలకు ప్రత్యామ్నాయం లేదు. అవి జ్ఞానానికి మూలం,  మన నిరంతర  జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం.  ఒక నిర్దిష్ట పాఠశాలలోని పాఠ్యాంశాలు ఎక్కువగా లైబ్రరీ నాణ్యతపై ఆధారపడి ఉంటాయి. చక్కటి సౌకర్యాలతో కూడిన లైబ్రరీ లేకుండా బోధన, అభ్యాస ప్రక్రియ అధ్వాన్నంగా ఉంటాయి. చదవడం అనేది మనసుకు వ్యాయామం. ఇది పిల్లలు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. వారి మనస్సులను ప్రకాశవంతం చేయడానికి కొత్త జ్ఞానపు తలుపులు తెరుస్తుంది.  చదవడం వల్ల పదజాలం మెరుగుపడుతుంది, మెరుగైన గ్రహణశక్తి, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  పాఠశాలలో ఫలితాలను మెరుగుపరుస్తుంది. విశ్లేషణ నైపుణ్యాలను మెరుగుపరిచి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

నూతన విద్యా విధానం 2020 ప్రకారం ప్రతి పాఠశాలలో గ్రంథాలయాలు లేదా పాఠశాలల్లో విద్యార్థులు పౌర గ్రంథాలయాలు ఉపయోగించుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని, అందుకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనిలోని భాగంగా పుస్తకాలతో పాటు విద్యార్థులకు పుస్తక పఠనం అనే అంశాన్ని పాఠ్యాంశాలలో చేర్చవలసిన అవసరం ఉన్నది.  ప్రాథమిక విద్యా స్థాయిలోనే ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేలా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, తల్లిదండ్రులు కృషి చేయవలసిన అవసరం ఉన్నది. 

-  డా. రవి కుమార్ చెగోని,
ప్రధాన కార్యదర్శి, 
తెలంగాణ లైబ్రరీ అసోసియేషన్