- నేలమట్టం కానున్న కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్లు
- కాలం చెల్లడంతో ఐదేండ్ల కింద మూసివేసిన అధికారులు
పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మూసివేసిన కొత్తగూడెం థర్మల్‌పవర్ స్టేషన్ (కేటీపీఎస్) పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. కాలం చెల్లిన యూనిట్లు కావడంతో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆదేశం మేరకు ఐదేండ్ల కిందటే అధికారులు ఈ ప్లాంట్‌ను మూసివేశారు. 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీతో పని చేసిన ఈ ఫ్యాక్టరీ తుక్కును కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన మినరల్ స్క్రాప్ ట్రేడ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) 447.46 కోట్లుగా లెక్క కట్టింది.
ఈ క్రమంలో ఆన్ లైన్ టెండర్లు నిర్వహించగా ముంబైకి చెందిన హెచ్ఆర్ లిమిటెడ్ 485.05 కోట్లకు చేజిక్కించుకుంది. ఆరు నెలలుగా ఈ ఫ్యాక్టరీ కూల్చివేత పనులు సాగుతున్నాయి. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా ఏ,బీ,సీ స్టేషన్లకు సంబంధించిన కూలింగ్ టవర్లు కూల్చివేయాల్సి ఉంది. ఈ టవర్లలో తుక్కును హెచ్ఆర్ సంస్థ సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో కూల్చివేతల కోసం సదరు సంస్థ కలెక్టర్, జిల్లా పర్యావరణ శాఖ అధికారి పర్మిషన్ కోసం లెటర్ రాశారు.
మరో15 రోజుల్లో అనుమతి వచ్చే అవకాశం ఉండడంతో టవర్ల కింద నిర్మించిన పిల్లర్లకు ఎక్స్ప్లోజివ్స్అమర్చి సులువుగా కూల్చివేయాలని సంస్థ భావిస్తోంది. అయితే, టెండర్లలో అవకతవకలు జరిగాయని, కూల్చివేత పనులు నిలిపివేయాలని ఇటీవల కేటీపీఎస్‌ను సందర్శించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేయడం కొసమెరుపు.