సన్న బియ్యం పంపిణీకి రెడీ..వచ్చే నెల నుంచి రేషన్‌ షాపుల ద్వారా జనానికి

సన్న బియ్యం పంపిణీకి రెడీ..వచ్చే నెల నుంచి రేషన్‌ షాపుల ద్వారా జనానికి

స్టాక్‌ పాయింట్లకు చేరుతున్న రైస్
కొత్త కార్డులతో కలిపి ఏడాదికి 22 లక్షల టన్నులు అవసరమని అంచనా 

యాదాద్రి, వెలుగు : రేషన్‌‌‌‌‌‌‌‌ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లాల్లో సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి సన్నబియ్యం అందించేందుకు వీలుగా స్టాక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లకు సన్నబియ్యం నిల్వలు చేరుతున్నాయి. ప్రభుత్వం నుంచి అందిన అంతర్గత ఆదేశాల మేరకే సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్లు సన్నబియ్యం మరాడించి తెప్పించి, రెడీగా ఉంచుతున్నట్లు తెలిసింది. 

ఏడాదికి 22 లక్షల టన్నులకుపైనే..

తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 89.96 లక్షల రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉండగా, 2,81,71,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. కొత్తగా మరో 10 లక్షల రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు మంజూరు అయ్యే అవకాశం ఉందని ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ లెక్కన అదనంగా 30 లక్షల మంది లబ్ధిదారులు పెరుగుతారు. వీరికి ఏడాదికి దాదాపు 22 నుంచి 24 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయని అంచనా. వానకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం 24 లక్షల టన్నుల సన్న వడ్లను సేకరించింది. సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై శాఖ ఆధ్వర్యంలో వడ్ల మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ వేగంగా సాగుతోంది. వానాకాలంలో సేకరించిన వడ్ల​ద్వారా గరిష్టంగా 15 నుంచి 16 లక్షల టన్నుల సన్న బియ్యం అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఈ ఏడాది చివరికల్లా సన్నబియ్యం తక్కువ పడితే మరో 6 నుంచి 8 లక్షల టన్నుల బియ్యాన్ని యాసంగిలో సేకరించే వడ్ల ద్వారా సమకూర్చుకుంటామని సివిల్​సప్లై ఆఫీసర్లు చెప్తున్నారు.

60 శాతం దొడ్డుబియ్యం పక్కదారి 

రేషన్‌‌‌‌‌‌‌‌ షాపుల ద్వారా ఇప్పటిదాకా పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యాన్ని చాలా మంది తినడం లేదు. సుమారు 60 శాతం బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్‌‌‌‌‌‌‌‌ షాపుల దగ్గర వ్యాపారులు దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేసి కోళ్ల దాణా, లిక్కర్‌‌‌‌‌‌‌‌ తయారీ కోసం తరలిస్తున్నారు. దీంతో సన్న బియ్యానికి డిమాండ్​ఎక్కువ కావడంతో రేట్లు బాగా పెరిగిపోయాయి. రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యం పక్కదారి పట్టడంతో పాటు లబ్ధిదారులు కూడా తినడం లేదన్న విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యం ఇస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా 2024 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో సన్న వడ్ల పంటను పెంచేందుకు క్వింటాల్​కు రూ. 500 బోనస్‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల దొడ్డు బియ్యం రీసైక్లింగ్‌‌‌‌‌‌‌‌కు కూడా అడ్డుకట్ట పడుతుందని ఆఫీసర్లు భావిస్తున్నారు. దొడ్డు బియ్యాన్ని తక్కువ రేటుకు కొని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్‌‌‌‌‌‌‌‌ చేసి కస్టమ్‌‌‌‌‌‌‌‌ మిల్లింగ్‌‌‌‌‌‌‌‌ కింద ప్రభుత్వానికే అప్పగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

స్టాక్‌‌‌‌‌‌‌‌ పాయింట్లకు సన్నబియ్యం

వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో జిల్లాల్లో సేకరించిన సన్నవడ్లను నూక కాకుండా మూడు నెలల తర్వాత మరాడించడం ప్రారంభించిన అధికారులు, వాటిని స్టాక్‌‌‌‌‌‌‌‌పాయింట్లకు చేరుస్తున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపడా ధాన్యం దిగుబడులు రాకపోవడం, ఇంకొన్ని జిల్లాల్లో దొడ్డు వడ్లు ఎక్కువగా పండించడంతో ఆయా జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి సన్నబియ్యం తెప్పించి నిల్వచేస్తున్నారు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో 2,16,841 రేషన్‌‌‌‌‌‌‌‌ కార్డులు ఉండగా 6.60 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా 4 వేల టన్నులు బియ్యం అవసరం. కాగా, ఈ జిల్లాలో రెండు సీజన్లలోనూ దొడ్డు రకాలే ఎక్కువగా పండిస్తారు. రైతుల సొంత అవసరాలకు మాత్రమే కొద్దిగా సన్నాలు వేసుకుంటారు. 2024 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌లో బోనస్‌‌‌‌‌‌‌‌ ప్రకటనతో జిల్లాలో 35 వేల ఎకరాల్లో సాగు చేశారు. జిల్లా అవసరాలకు ఈ బియ్యం సరిపోవన్న ఉద్దేశంతో సూర్యాపేట జిల్లా నుంచి యాదాద్రికి సన్న వడ్లను కేటాయించారు. వీటికితోడు జనగామ తదితర జిల్లాల నుంచి సన్నబియ్యాన్ని జిల్లాకు పంపారు. ఇప్పటికే హాస్టల్స్, గురుకులాలు, మిడ్‌‌‌‌‌‌‌‌ డే మీల్స్‌‌‌‌‌‌‌‌కు సన్నబియ్యం అందిస్తున్నారు. ఈ నెల రేషన్‌‌‌‌‌‌‌‌ కింద స్టాక్‌‌‌‌‌‌‌‌ పాయింట్ల నుంచి సన్నబియ్యాన్ని అందిచేందుకు సిద్ధం చేశారు.