ముంబై: ఆయిల్, గ్యాస్ ఎగుమతుల కోసం రూపాయి–రియాల్ ట్రేడ్ విధానాన్ని తిరిగి మొదలుపెట్టడం ద్వారా ఇండియా ఇంధన అవసరాలను తీర్చుతామని మనదేశంలో ఇరాన్ రాయబారి అలీ చెగిని చెప్పారు. ఇరు దేశాల వాణిజ్యం విలువ 30 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయని అన్నారు. సొంత కరెన్సీల్లో వ్యాపారం చేసుకోవడం వల్ల ఇరు దేశాలకు ఎంతో డబ్బు అదా అవుతుందని అన్నారు. భారతీయుల కోసం తమదేశం పేపర్–లెస్, ఎలక్ట్రానిక్ మల్టిపుల్ వీసా జారీ విధానాన్ని ప్రవేశపెట్టిందని అలీ చెప్పారు. అమెరికా రిస్ట్రిక్షన్లకు ముందు.. ఇండియాకు అత్యధికంగా క్రూడాయిల్ సప్లై చేసే దేశాల్లో ఇరాన్రెండోస్థానంలో ఉండేది.
ఇండియా–ఇరాన్ మధ్య ఇది వరకు బార్టర్ విధానం (వస్తుమార్పిడి పద్ధతి) కూడా ఉండేది. ఇండియా రిఫైనరీలు ఇరాన్ ఆయిల్‌కు రూపాయల్లో చెల్లించేవారు. ఇరాన్ మన దగ్గరి వస్తువులను కొనడానికి అవే రూపాయలను వాడేది. అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నందుకు ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు పెట్టడంతో మనకు ఇరాన్ చమురు రావడం తగ్గింది. మనదేశం యూరియా, పెట్రోకెమికల్స్, పండ్లు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా ఇరాన్ నుండి దిగుమతి చేసుకునేది. ఈ అరబ్ దేశం ఇండియా నుండి వ్యవసాయ పరికరాలు, మందులు, ఇనుము & ఉక్కు ఆటోమొబైల్స్, క్లింకర్లు, సిమెంట్ వంటి వాటిని కొనేది. ఇదిలా ఉంటే, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఇటీవల కొనుగోలు చేసింది. బీపీసీఎల్ కూడా భారీ తగ్గింపు ధరలకు 2 మిలియన్ బ్యారెళ్లకు ఆర్డర్ ఇచ్చింది. రష్యా 25 శాతం వరకు తగ్గింపును అందిస్తున్నట్లు తెలుస్తోంది.