స్వచ్ఛంద సేవకు సిద్ధమా! : ఎస్. సందీప్​కుమార్

స్వచ్ఛంద సేవకు సిద్ధమా! : ఎస్. సందీప్​కుమార్

లక్ష పువ్వులను సందర్శించే ఒక తేనెటీగ ఒక పౌండ్ తేనెను నిలువ చేస్తుంది. పట్టు పురుగు తాను చనిపోతూ మనకు పట్టు దారాలను ఇస్తున్నది. చెట్లు బతికి ఉండి పూలు, పండ్లు, గాలి, నీడను ఇవ్వడమే గాక, చనిపోయిన తర్వాత కూడా కలప ఇస్తాయి. రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, డాక్టర్​ బీఆర్ అంబేద్కర్, గాంధీ లాంటి వారు వారి జీవితాలను కొవ్వొత్తిగా వెలిగించి సమాజానికి వెలుగులు పంచారు. విద్యావంతులుగా, సంస్కారవంతులుగా, మానవత్వం పరిమళించే మంచి మనసు ఉన్న మనుషులుగా మనం సమాజానికి ఏం చేయగలమో ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.  కష్టాల్లో ఉన్న ఏ మనిషికైనా సాయం చేయడానికి దేవుడు ప్రత్యక్షంగా దిగిరాడు. మరో మనిషే సాయం చేయాలి. బాధలో ఉన్న వ్యక్తి కూడా మరో మనిషి సాయాన్ని కోరుకుంటాడు. అందుకే మానవ సేవయే మాధవ సేవ అంటారు. సాటి మనిషికి సాయం చేయడంలో ఉన్న సంతోషం అది పొందిన వారికి మాత్రమే తెలుస్తుంది. 

స్వచ్ఛంద సేవల ద్వారా సంఘీభావం

శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా ఆకలితో పస్తులు ఉంటున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కళ్లు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఆపత్కాలంలో నిస్సహాయ స్థితిలో రక్తం కోసం హాస్పిటల్​లో తీవ్ర ఇబ్బందులు పడే వారు ఉంటారు. ఇలాంటి వారికి వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజ శ్రేయస్సు కోరుకునే వలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిత్యం సాయం చేస్తున్నారు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటే.. ఏ దిక్కులేని అభాగ్యులు, అనాథల ఆర్తనాదాలను వినే వారు ఉండరు. అందుకే  సమాజానికి స్వచ్ఛంద సేవకు వెనకాడని వలంటీర్ల అవసరం ఉన్నది. యూఎన్​ఏటా డిసెంబర్​5న ఇంటర్నేషనల్​వలంటీర్​ డే నిర్వహిస్తోంది. 2022 ఏడాదికి గాను ‘స్వచ్ఛంద సేవల ద్వారా సంఘీభావం’ అనే థీమ్​తో వలంటీర్​డే జరుపుతున్నది. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన సందర్భాల్లో నిరాశ్రయులైన, ఉపాధి కోల్పోయిన, తిండికి, తాగునీళ్లకు ఇబ్బంది పడిన వాళ్లకు ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛంద సేవకులు ముందుకు వచ్చి చేతనైన సాయం చేశారు. సమాజం కోసం మేము సైతం అంటూ.. ఎవరి పరిధిలో వారు సహకారం అందించారు. భారత దేశంలో వలస కార్మికులు, కూలీలు రోజుల తరబడి రోడ్ల వెంబడి నడుస్తుంటే.. స్వచ్ఛంద సేవకులు వారికి తిండి పెట్టి ఆదుకున్న సందర్భాలు మనం చూశాం. యువతను వలంటీర్లుగా, స్వచ్ఛంద సేవకులుగా తీర్చిదిద్దేందుకు ప్రపంచ స్థాయిలో ఐక్య రాజ్య సమితి, మన దేశ స్థాయిలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేసే నెహ్రూ యువ కేంద్ర సంఘటన్​కృషి చేస్తున్నాయి. వలంటీర్​లేదా స్వచ్ఛంద సేవ కార్యకర్తకు ఉండాల్సిన కొన్ని ముఖ్య లక్షణాలను ఇవి నిర్వచించాయి. రక్తదానం సహా సమాజానికి అందించే సేవలపై యూఎన్​ దిశా నిర్దేశం చేస్తున్నది.

దృఢ సంకల్పంతోనే..

నేటి యువతలో బలం, ఉత్సాహం, సౌందర్యం, తెలివి, విద్య, సాంకేతికత వంటి ఎన్నో నైపుణ్యాలు ఉన్నా  ‘ఆత్మ విశ్వాసం’ చాలా తక్కువ అని అనేక అధ్యయనాలు తెలిపాయి. ‘సమాజంలో మంచి చేయడానికి ఎవరూ ముందుకురారు, సహకరించరు - కానీ చెడు చేయడానికి సహకారాలు మెండుగా ఉంటాయి’ అనే అపోహ చాలా మంది యువకుల్లో ఉంటుంది. ఇలాంటి కారణాల వల్లే స్వచ్ఛంద సేవకు యువకులు వెనకాడుతుంటారు. ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు నలుగురు ఏమనుకుంటారోనని, ఇంట్లో వాళ్లు, స్నేహితులు, బంధువులు ఏమనుకుంటారోనని భయపడేవారు ఉంటారు. కొన్ని సార్లు ఏదైన మంచి పని తలపెట్టినప్పుడు విమర్శించేవారు, ఎద్దేవా చేసేవారు ఎదురవుతారు కూడా. దృఢ సంకల్పంతోనే ఇలాంటి వాటిని జయించవచ్చు. చేసే పని మీద స్పష్టత, ముందుకు వెళ్లే ధైర్యం ఉన్నప్పుడు దాన్ని ఎవ్వరూ ఆపలేరు. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా దృఢంగా ఉన్న యువత సాధించలేనిది ఏదీ లేదు.  స్వామి వివేకానంద అన్నట్లు ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం గల యువతే ఈ దేశానికి కావాలి నేడు. అలాంటి వారి నుంచి స్వచ్ఛంద సేవకులు, వలంటీర్లు, సమాజ రక్షకులు పుడతారు.

- ఎస్. సందీప్​కుమార్,
యూఎన్​ వలంటీర్