వీళ్లు మామూలోళ్లు కాదుగా: కొత్త ప్లాన్​... కట్టు కథ అల్లారు.. ఊచలు లెక్కపెడుతున్నారు.

వీళ్లు మామూలోళ్లు కాదుగా: కొత్త ప్లాన్​... కట్టు కథ అల్లారు..  ఊచలు లెక్కపెడుతున్నారు.
  •  పోలీసు వేషంలో వచ్చి డబ్బులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు 
  •  డబ్బులు కొట్టేయడానికే ప్లాన్​వేశారని పోలీసుల గుర్తింపు  
  •  ఇద్దరిని అరెస్ట్​ చేసిన పోలీసులు 

హైదరాబాద్ సిటీ/పద్మారావునగర్, వెలుగు: పోలీసుల వేషంలో వచ్చిన కొంతమంది తమ వద్ద ఉన్న డబ్బు దోచుకుపోయారని అబద్దపు కంప్లయింట్​ఇచ్చిన వారిని బోయిన్​పల్లి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఒడిశాకు చెందిన అరుణ్ కుమార్ బహెరా న్యూ బోయిన్ పల్లిలో ఉంటూ అడ్సోర్బెంట్ కంపెనీలో ఆఫీస్ బాయ్ గా పని చేస్తాడు. ఇదే కంపెనీలో ఒడిశాకు చెందిన సమరేంద్ర దాస్ అకౌంటెంట్. ఇతడు గుండ్లపోచంపల్లిలో ఉంటాడు. 22వ తేదీ రాత్రి ఇద్దరూ కలిసి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్​కు రూ.5 లక్షల నగదు ఉన్న బ్యాగ్​అప్పగించడానికి వెళ్తుండగా బోయిన్​పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్  వద్ద పోలీస్​ యూనిఫాంలో ఉన్న ఒకరు, సివిల్ డ్రెస్ లో మరొకరు ఉండి తమను అడ్డుకున్నారని, ఆర్సీని, బ్యాగులోని వస్తువులు పరిశీలించి నగదు తీసుకుని పరారయ్యారని బోయిన్​పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పోలీసులు అరుణ్ కుమార్ బహెరాను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో అతడిపై అనుమానం వచ్చింది. పూర్తి విచారణ తర్వాత సమరేంద్ర దాస్ తో కలిసి పథకం ప్రకారం కట్టు కథ అల్లి ఫేక్​ కంప్లయింట్​ఇచ్చారని తేల్చారు. సమరేంద్ర దాస్ వద్ద రూ.5 లక్షలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్​ చేశారు.