మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్(Mahavir Harina Vanasthali National Park) అడవి భూములకు ముప్పొచ్చింది. కొందరు అక్రమార్కులు నేషనల్ పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్‌గా చూపిస్తూ అమ్మకాలుసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అటువంటి వారి మాటలు నమ్మి అమాయకులు మోసపోవద్దని శంషాబాద్ డిఎఫ్ఓ విజయానంద్, సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు.ఫారెస్ట్ ల్యాండ్ చూపెట్టి 50వేల మందికి మోసం
అసలేం జరిగిందంటే..?
ఎల్బీ నగర్ మన్సూరాబాద్‌లోని సర్వే నంబర్ 7లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా.. ఆ భూమి తమ తల్లిదని యూసఫ్ ఖాన్‌తో పాటు ఆయన భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా గిప్ట్ డీడ్, సేల్ డెడ్, నోటరీ ప్లాట్ల ఫేక్ డాక్యుమెంట్ రాయించి అమాయకులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ సందర్భంగా సర్వే నెంబర్ 7లో జెండా ఎగరేయపోతున్నట్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారు పెద్ద ఎత్తున అక్కడికి రావాలని మహ్మద్ జిలాని అనే వ్యక్తి పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు వ్యాప్తి చేశారు.
ఈ విషయం పోలీసుల చెవిన పడడంతో ప్రజలను అప్రమత్తం చేశారు. ఫారెస్ట్ ల్యాండ్‌లో ఎటువంటి ప్లాట్లు లేవని.. ఎవరూ కూడా ఆ డాక్యుమెంట్స్ చూసి మోసపోవద్దని సూచించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన వారు ఎవరైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తగిన న్యాయం జరిగే అవకాశం ఉంటుందని సూచించారు. మోసగాళ్ల మాటలు నమ్మి ఎవరైనా ఫారెస్ట్ భూముల్లోకి వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుటుంటామని హెచ్చరించారు.
సర్వే నంబర్ 7లోని 582 ఎకరాల భూమి ఎన్నో ఏళ్లుగా ఫారెస్ట్ భూమిగా రికార్డుల్లో ఉన్నట్లు తెలిపారు. ఆ భూమి ప్రైవేట్ భూమి అని క్లెయిమ్ చేసేందుకు ఫిటీషనర్ తరపు న్యాయవాది ఇప్పటివరకు 280 ఫిటీషన్స్ దాఖలు చేయగా.. వాటిని కోర్టు కొట్టేసిందని ప్రజలకు గుర్తుచేశారు. కావున తక్కువ ధరకు వస్తున్నాయని అడవీ భూములు కొని మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.