రియల్ ఎస్టేట్​ ఏజెంట్​లా కేసీఆర్​సర్కార్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ​

దహెగాం, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ బడా ఏజెంట్ గా మారిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. పేదల అసైన్డ్ భూములను  గుంజుకొని రూ. వంద  కోట్లకు ఎకరం చొప్పున అమ్ముకుందని, కానీ వారి పార్టీ ఆఫీస్ కోసం చదరపు అడుగు కేవలం రూ.100కే కేటాయించుకోడం ఏంటని ప్రశ్నించారు.  కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గంలో  బుధవారం ఆయన దహెగాం, పెంచికల్ పేట్ మండలాల్లో పర్యటించారు.  
కేసీఆర్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 30 వేల మంది పేదల అసైన్డ్ భూములను బలవంతంగా గుంజుకుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో  స్వీపర్లకు నెలకు రూ.1,623 వేతనం చెల్లిస్తే ఎలా సరిపోతుందని, వారి జీతాలు పెంచాలనే డిమాండ్ తో 52 రోజులుగా దీక్షలు చేస్తున్నా కేసీఆర్ స్పందించడం లేదని విమర్శించారు.   
సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి ,జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం ప్రవీణ్, జిల్లా కోశాధికారి రాంటెంకి నవీన్, నియోజకవర్గ అధ్యక్షుడు కొండా రాంప్రసాద్, మాజీ జడ్పీటీసీ పిల్లల తిరుపతి, దహేగా మండల అధ్యక్షుడు దేవిడస్, మండల ప్రధాన కార్యదర్శి మహేందర్,దుర్గం గౌతమ్, గొర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.