- ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో కొత్త వెంచర్లకు డిమాండ్
- హైరైజ్ బిల్డింగ్స్, విల్లాల నిర్మాణానికి రియల్టర్ల ఆసక్తి
- అనుమతుల కోసం హెచ్ఎండీఏకు భారీగా అప్లికేషన్లు
- మిడిల్ క్లాస్ టార్గెట్గా పెద్ద సంఖ్యలో వెంచర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ సిటీకి తూర్పున ఉన్న పోచారం, ఘట్కేసర్ ప్రాంతాల్లో రియల్ఎస్టేట్ జోరు కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో భూములు, ఇండ్లు కొనే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఇక్కడ 100 అడుగుల రోడ్లు కూడా వేసే ప్రపోజల్స్ ఉండడంతో భారీగా వెంచర్లు వస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్ నేషనల్హైవేకు ఆనుకుని పలు ప్రాజెక్టులు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటివరకూ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ ప్రాంతాలే కేంద్రంగా ఐటీ కారిడార్లు ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ప్రకటించారు. దీంతో కొన్ని కీలక ప్రాజెక్టులను ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఐటీ కంపెనీలను పెద్ద ఎత్తున తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ ఉండగా, దీనికి తోడు మరిన్ని ఐటీ కంపెనీలు, ఇతర ప్రాజెక్టులు వస్తాయని తెలిసి రియల్ ఎస్టేట్వ్యాపారులు అధిక సంఖ్యలో కొత్త వెంచర్లకు సిద్ధమవుతున్నారు.
చదరపు గజానికి రూ.40 వేలు
ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్లు కొనడానికే ఎక్కువ శాతం మధ్యతరగతి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని కొందరు రియల్ఎస్టేట్ వ్యాపారులు అపార్ట్మెంట్లు, లే అవుట్లు వేస్తుండగా.. ఉన్నత వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరికొందరు హైరైజ్ బిల్డింగులు, విల్లాలు నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. వీటి అనుమతుల కోసం హెచ్ఎండీఏకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి.
Also Read:-ట్రిపుల్ ఆర్ ల్యాండ్‌కు.. రేటు పెంపు ప్రపోజల్స్..
మొన్నటిదాకా శంషాబాద్, శంకర్పల్లి జోన్లలో ఎక్కువగా నిర్మాణాలు, వెంచర్లకు దరఖాస్తులు వచ్చేవని, ఇప్పుడు మేడ్చల్, ఘట్కేసర్ జోన్లలో ఎక్కువ అప్లికేషన్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ఘట్కేసర్, పోచారం పరిధిలో భూముల ధర చదరపు గజానికి రూ.25 వేల నుంచి రూ.40 వేలకు పెరిగిందని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తెలిపారు.
పెరగడానికి కారణాలివే..
ఘట్కేసర్, పోచారం ప్రాంతాలు ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు సమీపంలోనే ఉండడం, ఘట్కేసర్ మున్సిపాలిటీగా మారడం, హెచ్ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌ను అనుసరించి వంద ఫీట్ల రోడ్లు, ఉప్పల్ నుంచి నారపల్లి వరకు 11.6 కి.మీ. మేరకు ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం జరుగుతుండడంతో ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయి. వరంగల్ నేషనల్హైవే విస్తరణతో పాటు సమీపంలోనే పోచారం టౌన్షిప్ ఉండడంతో పోచారం, నారపల్లి, చౌదరిగూడ, అన్నోజిగూడ, ఘట్కేసర్, శివారెడ్డిగూడ, యానంపేట ప్రాంతాల్లో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. అన్నోజిగూడ పరిసరాల్లో మాల్స్, మల్టీప్లెక్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
కొత్తగా మరికొన్నింటిని నిర్మిస్తున్నారు. రెస్టారెంట్లు, వినోద కేంద్రాలకు కొదవలేదు. నారపల్లి నందనవనం పార్క్, ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్సదుపాయం ఉంది. దీంతో ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో అపార్ట్మెంట్లు, విల్లాలు నిర్మించేందుకు నిర్మాణ దారులు పోటీపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో విల్లా రూ.3 కోట్ల నుంచి పలుకుతుండగా, ఫ్లాట్స్ అయితే రూ. 70 లక్షలకు తక్కువ లేదు.