- నిరుడు 76,613 ఇండ్ల రిజిస్ట్రేషన్లు
- రూ.47,173 కోట్ల వ్యాపారం
- కోటి రూపాయల ఇంటిపైనే నగరవాసుల ఆసక్తి
- బూమ్ మరింత పెరుగుతుందని నైట్ ఫ్రాంక్ రిపోర్టు
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో నివాస గృహాల అమ్మకాలు కూడా పుంజుకుంటుండంతో నగరంలో రియల్ వ్యాపారం ఊపందుకుంది. ఒక పక్క ప్రభుత్వం ప్రకటించిన ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో భారీ ప్రాజెక్టులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భూములు, ఇండ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇదే అదనుగా రియల్ ఎస్టేట్ సంస్ధలు కూడా భారీగా వెంచర్లను ప్రారంభిస్తున్నారు.
రాబోయే రోజుల్లో నగరానికి నలుదిక్కులా భారీ ప్రాజెక్టులను చేపట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో భూముల ధరలు, ఇండ్ల నిర్మాణం పెద్దయెత్తున జరుగుతోంది. రియల్ బూమ్ పుంజుకోవడంతో హైదరాబాద్ లో ఇండ్లకు గిరాకీ పెరుగుతోంది. 2023లో గ్రేటర్ పరిధిలో రిజిస్టర్ అయిన ఇళ్ల సంఖ్య 71,912 కాగా.. 2024లో వీటి సంఖ్య 7 శాతం పెరిగి 76,613 ఇళ్లకు చేరుకుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది.
2023లో రిజిస్టర్ అయిన ఇళ్ల మొత్తం విలువ రూ.38,395 కోట్లు ఉండగా 2024లో రిజిస్టర్ అయిన ఇళ్ల విలువ 23 శాతం పెరిగి రూ.47,173 కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో మొత్తం రిజిస్ట్రేషన్లలో దాదాపు 90 శాతం వాటా నివాస గృహాల విభాగానిదేనని నైట్ ఫ్రాంక్ తన నివేదికలో వెల్లడించింది. హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో కొనుగోలుదారుల ప్రాధాన్యతలో కొన్ని మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. 2023లో రిజిస్ట్రేషన్లలో రూ.50 లక్షల కన్నా తక్కువ ధర కలిగిన ఇళ్ల వాటా 68 శాతం ఉండగా 2024లో 60 శాతానికి తగ్గిందని తెలిపింది. అయితే.. రూ.50 లక్షల కన్నా ఎక్కువ విలువ కలిగిన ప్రాపర్టీల వాటా 32 శాతం నుంచి 40 శాతానికి పెరిగిందని వెల్లడించింది.
లగ్జరీ ఇండ్ల వైపే మొగ్గు
తాము నివసించే ఇల్లు లగ్జరీగా ఉండాలని హైదరాబాద్ వాసులు కోరుకుంటున్నారు. కొనుగోలు చేసే ఇంటికి ఎంత ఖర్చు చేసేందుకైనా వెనుకాడడం లేదు. మంచి సౌకర్యాలు ఉంటే రూ.కోటి, అంతకుమించైనా పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. గత సంవత్సరం దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఇళ్ల అమ్మకాల్లో లగ్జరీ ఇండ్లకు సంబంధించి 40 శాతం కావడం గమనార్హం. ఇదే సమయంలో రూ. 50 లక్షల్లోపు ఇళ్ల అమ్మకాలు క్షీణించాయని నైట్ ఫ్రాంక్ తన రిపోర్టులో వెల్లడించింది.
హైదరాబాద్ నగరంలో రూ.కోటికిపైగా రేట్లు కలిగిన ఇళ్ల విక్రయాలు కిందటి సంవత్సరం మొదటి త్రైమాసికంలో 29 శాతం కాగా.. రెండో త్రైమాసికంలో ఇది 31 శాతం, మూడో త్రైమాసికంలో 35 శాతంగా నమోదైంది. నాలుగో త్రైమాసికం అంటే డిసెంబర్ నాటికి 39 శాతానికి పెరిగిందని నివేదిక వివరించింది. హైదరాబాద్ పరిధిలో నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతోంది.
గత రెండేళ్లలో ఇళ్ల విక్రయాలకు సంబంధించి వృద్ధిని పరిశీలిస్తే 2023 ఏడాదితో పోలిస్తే 2024లో ఇండ్ల విక్రయాలు ఏడు శాతం వృద్ధి చెందాయని నైట్ ఫ్రాంక్ పేర్కొంది. మొత్తం గృహ విక్రయాల్లో 90 శాతం రెసిడెన్షియల్ ప్రాంతాలదే ఆధిపత్యమని తెలిపింది. హైదరాబాద్ మార్కెట్ పరిధిలోకి హైదరాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు వస్తాయి. గత ఏడాది కాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని, సొంత గృహాల డిమాండ్ స్థిరంగా కొనసాగుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ శశిర్ బైజాల్ పేర్కొన్నారు.
ప్రభుత్వ అనుకూల విధానాలతోనే పెరుగుదల
కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధికి తీసుకుంటున్న అనేక చర్యలు ఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు దోహదపడుతోంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో టెక్నాలజీ ఎకోసిస్టం విస్తరణ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం కొన్ని నెలలుగా ప్రభుత్వ యంత్రాంగం విధాన నిర్ణయాలు తీసుకోవడంతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ప్రజలు కూడా లగ్జరీ నివాసాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నల్గొండ, వరంగల్, మహబూబ్నగర్ వంటి ప్రాంతాల్లో కూడా రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది.
– సి.శేఖర్ రెడ్డి, క్రెడాయ్ మాజీ జాతీయ అధ్యక్షుడు-
కొనుగోలు శక్తి పెరిగింది
హైదరాబాద్ నగరంలో ఉపాధి అవకాశాలు బాగా పెరగడం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరుగుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగడం వల్ల సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారు. అందుకే లగ్జరీ ఇండ్లకు డిమాండ్ పెరుగుతోంది.
– తిరుపతి రెడ్డి, క్రెడాయ్ వరంగల్ శాఖ అధ్యక్షుడు-