
రంగారెడ్డి జిల్లా వెంకటాద్రి నివాస్ కాలనీలోని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసిస్తున్న వెంకటప్ప రియల్ఎస్టేట్ వ్యాపారి. పని నిమిత్తం గుండ్లపల్లి, కొడంగల్‌కి వెళ్లాడు. జూన్ 23 ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తాళం పగలగొట్టి ఉండటం చూసి హుటాహుటిన లోపలికి వెళ్లాడు. బీరువాలోని బట్టలన్ని చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.
అందులోని 10 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ.లక్ష నగదు మాయమైనట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.