ప్రభుత్వ భూముల్లో వెంచర్లు  చేసి  ప్లాట్ల విక్రయం

ప్రభుత్వ భూముల్లో వెంచర్లు  చేసి  ప్లాట్ల విక్రయం
  • పర్మిషన్ లేకుండానే ఉంచుతున్న రియల్టర్లు
  •     కాలనీలో సొంతంగా బోరు వేసిన ఓ వెంచర్ నిర్వాహకుడు
  •     చోద్యం చూస్తున్న సంబంధిత శాఖల ఆఫీసర్లు
  •     స్థానిక లీడర్​ అండతోనే ఆక్రమణ

సూర్యాపేట, వెలుగు: జిల్లాలో రియల్‌‌ ఎస్టేట్‌‌వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పేదల కోసం ప్రభుత్వం కట్టించిన డబుల్ ​బెడ్​రూం ఇండ్లను కూడా తమ సొంత ఇండ్ల లాగా వాడుకుంటున్నారు. దీనిపై స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే  స్థానిక అధికార పార్టీ నేత అండతో దాడికి దిగుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూముల్లో పర్మిషన్ ​లేకుండా,  వెంచర్ల  చేసి  ప్లాట్లను పేదలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన ఆఫీసర్లు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

‘డబుల్’ ఇండ్ల ఆక్రమణ

 గాంధీ నగర్ పరిధిలో సర్వే నెంబర్ 349లో ప్రభుత్వం 2.30 ఎకరాల్లో 70 డబుల్​బెడ్​రూం ఇండ్లను శాంక్షన్​ చేసింది.  సదరు ఇండ్ల నిర్మాణానికి 2017 లో శంకుస్థాపన చేయగా.. ఆరేండ్ల నుంచి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి సకాలంలో బిల్లులు  రాక కాంట్రాక్టర్ నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశాడు. ‘డబుల్’ ఇండ్ల నిర్మాణాల పక్కనే కొత్తగా వెంచర్ నిర్మాణం చేపట్టిన రియల్టర్​ స్థానిక నేత అండతో  వెంచర్​లో పని చేస్తున్న  వలస కూలీలను ఏకంగా ‘డబుల్’ ఇండ్లలో నివాసం ఉంచారు.   వెంచర్ ​నుంచి నేరుగా ఇండ్లలోకి కరెంట్​కనెక్షన్ ​ఇచ్చారు. నీళ్ల కోసం కాలనీలో బోరు కూడా వేసి నీటి సౌలత్ ​కల్పించారు.  

ఇండ్లల్లో వలస కూలీలు

వెంచర్ లో  బీహార్, కలకత్తా రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన  కూలీలు పనిచేస్తున్నారు. రూల్స్​ ప్రకారం ఇతర రాష్ట్రాల కూలీలతో పని చేయించుకునేందుకు లేబర్ డిపార్ట్​మెంట్​నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉండగా..  అది కూడా పాటించకుండా బయట రాష్ట్రాల కూలీలతో పని చేయిస్తున్నారు. వీటితో పాటు కొంతమంది బాల కార్మికులతో పని చేయిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.  వెంచర్ లోకి బయట వ్యక్తులను లోపలికి రానివ్వకుండా భారీ సంఖ్యలో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. 

ప్రభుత్వ భూమి  ఆక్రమణ 

వెంచర్ కోసం ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించరాన్న  ఆరోపణలు వస్తున్నాయి. సర్వే నెంబర్ 349లో 48 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. కొంత భాగం వెంచర్ నిర్వాహకులు అక్రమించుకున్నారని స్థానికులు చెప్తున్నారు. కబ్జాపై ఎవరైనా ప్రశ్నిస్తే స్థానిక నేత అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. తమ వెనుక స్థానిక అధికార పార్టీ నేత ఉన్నారని, ఏ ఆఫీసర్​ఏమీ చేయలేరని వెంచర్​నిర్వాహకులు బహిరంగంగా చెప్తుండడం గమనార్హం. 

మా దృష్టికి రాలేదు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కూలీలు నివాసం ఉంటున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా రూల్స్​కు విరుద్ధంగా వ్యవహరిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. 
‌‌  - రాజేంద్ర కుమార్, ఆర్డీవో 

చర్యలు తీసుకుంటాం 

డబుల్ బెడ్ రూం ఇండ్లలో పర్మిషన్​లేకుండా ఉండే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. త్వరలోనే ‘డబుల్’ ఇండ్లను  పరిశీలించి కూలీలను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుంటాం. 
-  మహిపాల్ రెడ్డి,  ఆర్అండ్​బీ, డీఈ