- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు తగ్గిన ఆదాయం
- పెట్టుబడుల్లో స్తబ్దతే కారణం
- అమ్మేవారు తప్ప కొనేవారు లేరు
- రూ.230 కోట్ల నుంచి రూ.224 కోట్లకు తగ్గిన ఆదాయం
- గతేడాదితో పోల్చితే 11వేలు పడిపోయిన రిజిస్ట్రేషన్లు
మానవ జీవితంలో కోవిడ్‌కు ముందు తర్వాత అనేలా మార్పులు వచ్చాయని చెప్పకతప్పదు. అందుకు ప్రభుత్వ ఆదాయ మార్గాలు కూడా ప్రభావితం అయ్యాయి. వాటిలో స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ ప్రధానమైనది. ఈశాఖ ఆదాయం విషయంలో గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈసారి భారీగా పడిపోయింది. 2022–23 ఆర్థిక సంవత్సరం ముగియడంతో ఉమ్మడి జిల్లాలో ఉన్న సబ్రిజిస్ర్టార్ఆఫీస్ల పరిధిలో ఆదాయం పడిపోయింది.
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రియల్ ఎస్టేట్ లో నెలకొన్న స్తబ్దత రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఆదాయంపై పడింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈసారి రిజిస్ట్రేషన్అయిన డాక్యుమెంట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం కూడా పడిపోయింది. ఉమ్మడి జిల్లా పరిధిలో11 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా, భద్రాచలం, బూర్గంపహాడ్, మధిర, సత్తుపల్లి, ఖమ్మం, వైరా, కల్లూరు ఆఫీసుల్లో గతేడాది కంటే ఆదాయం కొంత మేర పెరిగింది. ఇల్లందు పరిధిలో ఆదాయం భారీగా పడిపోయింది. మిగిలిన ఆఫీసుల్లో కూడా ఆదాయం స్వల్పంగా తగ్గింది. జిల్లా మొత్తంగా చూసుకుంటే అన్ని ఆఫీసుల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల సంఖ్య 57 వేల నుంచి 46 వేలకు తగ్గాయి. దీంతో అంతకు ముందు ఏడాది రూ.230 కోట్ల ఆదాయం రాగా, ఈసారి రూ.224 కోట్లకు పడిపోయింది.
కోవిడ్తర్వాత తగ్గిన పెట్టుబడులు..
గతంలో ప్రధానంగా విదేశాల్లో స్థిరపడినవారు, అక్కడి నుంచి డబ్బులు పంపిస్తుంటే, వాళ్ల పేరెంట్స్లేదా బంధువులు ఇక్కడ రియల్ ఎస్టేట్‌రంగంలో పెట్టుబడులు పెట్టేవారు. కోవిడ్తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అక్కడ నుంచి నిధులు రావడం గతంతో పోలిస్తే తగ్గాయి. ఇక నాలుగైదేళ్ల నుంచి క్రమంగా భూముల విలువ పెరుగుతూ రావడంతో ఇప్పటికే ఖమ్మం జిల్లాకేంద్రానికి చుట్టుపక్కల మండలాల్లో ఎకరా విలువ రూ.కోట్లకు చేరింది. వెంచర్లు వేసేవారు కూడా ఎకరా రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు కొని, డీటీసీపీ అప్రూవుడ్లే అవుట్ వేసి, ప్లాట్లుగా చేసి అమ్మడంతో గజం కనీసం రూ.15 వేల చొప్పున అమ్మాల్సి వస్తోంది. దీంతో 200 గజాల ప్లాటు కొనాలన్నా కనీసం రూ.30 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే నగర పరిధిలో ఉన్న ప్లాట్ల రేటు కూడా గజం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పెరిగాయి. బైపాస్ రోడ్వంటి చోట్ల రూ.లక్షన్నర దాకా పలుకుతోంది. గతంలో వేసిన గ్రామ పంచాయతీ లే అవుట్స్ లో ఉన్న ప్లాట్లను ప్రభుత్వం రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడంతో వాటి అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయాయి.