హైదరాబాద్: ‘ఫ్రీ లాంచ్’ పేరుతో హైదరాబాద్లో మరో మోసం వెలుగుచూసింది. బంజారాహిల్స్ లోటస్ పాండ్లోని కొంపల్లి వెంచర్ భారతి బిల్డర్స్ ఫైనాన్షియర్ సునీల్ కుమార్ అహుజ నివాసం వద్ద కొంపల్లి వెంచర్ బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేసి, సునీల్ కుమార్ అహుజాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.
భారతి బిల్డర్స్ కొంపల్లి వెంచర్ బాధితులు ఏమంటున్నారంటే.. కొంపల్లిలోని ప్రైమ్ ఏరియాలో ఆరున్నర ఎకరాలు విస్తీర్ణంలో భారతి బిల్డర్స్ వద్ద ల్యాండ్ కొనుగోలు కోసం తామంతా డబ్బులు కట్టామని చెప్పారు. 450 కస్టమర్స్ పొట్ట కొట్టి 200 కోట్ల ల్యాండ్ ఫ్రీగా కొట్టేద్దామని చూస్తున్నారని భారతి బిల్డర్స్పై బాధితులు ఆరోపించారు. ఇప్పటివరకు తమకు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేయలేదని, పైగా తమ డబ్బులు తిరిగి ఇవ్వలేదని బాధితులు వాపోయారు. నాలుగు సంవత్సరాల నుంచి భారతి బిల్డర్స్ వారు తమను తిప్పుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు 40 లక్షలు పైగా ల్యాండ్ కోసం డబ్బులు కట్టామని, కేవలం కొంపల్లి భారతి బిల్డర్స్ బాధితులు చెప్పారు.
రూ.80 కోట్ల వరకు అమౌంట్ కట్టామని తెలిపారు. భూబకాసురుడు సునీల్ కుమార్ అహుజపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారతి బిల్డర్స్ శివరామకృష్ణ.. సునీల్ కుమార్ అహుజా వద్ద కొంపల్లికి చెందిన వెంచర్ ల్యాండ్ పేపర్స్ తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నాడని, ఈ విషయం తమకు చెప్పకుండా బాధితుల వద్ద రిజిస్ట్రేషన్ల పేరుతో డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. గతంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, సీసీఎస్లో కూడా ఫిర్యాదు చేశాం కానీ ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదని బాధితులు చెప్పారు. తమకు ఇకనైనా ప్రభుత్వం న్యాయం చేయాలని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు.