
- హైదరాబాద్ శివారు మండలాల్లో ఒకప్పుడు వేల ఎకరాల్లో తోటలు
- నాడు 5వేల ఎకరాలకు పైగా ద్రాక్ష తోటలు.. ఇప్పుడు 200 ఎకరాలకు
- పదేండ్లలో వెంచర్లు, ప్లాట్లతో మాయమైన ఫ్లోరీ, ఫ్రూట్ కల్చర్స్
- ఒకప్పుడు మన పూలు, ద్రాక్ష విదేశాలకు ఎగుమతి
- ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులపైనే ఆధారం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పూలు, పండ్ల తోటల సాగుపై రియల్ఎస్టేట్దెబ్బపడింది. హైదరాబాద్శివారు మండలాల్లో ఒకప్పుడు వేల ఎకరాల్లో తోటలు ఉండగా.. పదేండ్లలో అవి వెంచర్లు, ప్లాట్లుగా మారిపోయాయి. దీంతో నాడు విదేశాలకు పూలు, ద్రాక్ష లాంటి పండ్లను ఎగుమతి చేసిన రాష్ట్రం.. నేడు ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. ఐటీ, ఫార్మా హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్నగర శివారు ప్రాంతాలు పదేండ్ల కిందటివరకు పూలు, పండ్ల తోటలకు ఫేమస్.
నగరం చుట్టుపక్కల సుమారు 20 వేల ఎకరాల్లో బంతి, చామంతి, గులాబీ, నేల సంపంగి, గ్లాడియోలస్, జర్బెరా లాంటి పూలు సాగయ్యేవి. ఇక్కడి నేలల స్వభావం, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పండిన పూల సైజుకు, క్వాలిటీకి దేశంలోని మరే ప్రాంతంలోని పూలు సాటిరాకపోయేవి. ఇలా సుమారు 20 వేల ఎకరాల్లో పూలు, 20 వేల ఎకరాల్లో వివిధ పండ్ల తోటలు, ప్రధానంగా 5 వేల ఎకరాల్లో ద్రాక్ష సాగయ్యేది.
కానీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీన్ ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ పుంజుకోవడంతో చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, మహేశ్వరం, శంషాబాద్, కందుకూరు, కొత్తూరు, కేశంపేట తదితర మండలాల్లో నాడు పూలు, ద్రాక్ష తోటలు సాగైన భూములన్నీ రియల్ వెంచర్లుగా మారి, హద్దురాళ్లు, పెన్సింగ్లతో బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి.
పూలు, పండ్ల సాగుకు అనుకూలం
హైదరాబాద్, దాని చుట్టు పక్కల జిల్లాల్లో ఉన్న సారవంతమైన నేలలు, ఇక్కడి వాతావరణ పరిస్థితులు పూలు, పండ్ల సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రఖ్యాత ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన సంస్థ) హైదరాబాద్‌లో నెలకొల్పడం వెనుక ప్రధాన కారణమిదే. ముఖ్యంగా బంతి, చామంతి, గులాబీ, నేల సంపంగి, చైనా అస్టర్, గ్లాడియోలస్, లిల్లియం, జెర్బరా పూల మొక్కలు, అస్పారస్ సాగుకు హైదరాబాద్ ప్రాంతం అనుకూలమని శాస్త్రవేత్తలు గతంలోనే తేల్చారు.
ప్రస్తుతం బెంగళూరులో సాగవుతున్న పూల కంటే ఇక్కడ సాగయ్యే పూలు పరిమాణం, నాణ్యతలో బాగున్నాయని ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇందుకు తగ్గట్లే పదేండ్ల క్రితం వరకు హైదరాబాద్శివారు ప్రాంతాలకు చెందిన రైతులు బంతి, చామంతితో పాటు గ్రీన్నెట్ విధానంలో లిల్లీ, జర్బేరా, ఇతర విదేశీ పూల జాతులు, అస్పారస్గడ్డి సాగుచేసేవారు. హార్టికల్చర్ అధికారుల లెక్క ప్రకారం చేవెళ్ల, మొయినాబాద్, షాద్‌నగర్, శంకర్‌పల్లి, మహేశ్వరం, శంషాబాద్, కందుకూరు, కొత్తూరు, కేశంపేట తదితర మండలాల్లో మొత్తం 20వేల ఎకరాల్లో పూలు సాగయ్యేవి.
ఇక రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, పాలమాకులతోపాటు పలు మండలాల్లో పెద్దసంఖ్యలో ద్రాక్షతోటలతో పాటు అంజీర్, జామ, బొప్పాయి పంటలు సాగుచేసేవారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని గుట్టలపై సహజంగానే పెద్ద ఎత్తున సీతాఫలాలు పండేవి. హైదరాబాద్ శివారులోని మరో జిల్లా నల్గొండలో నిమ్మ, బత్తాయి తోటలు ఉండేవి. ఇలా హైదరాబాద్ చుట్టు పక్కల నుంచే పూలు, పండ్లు సిటీకి రావడం వల్ల తక్కువ రేటుకు దొరకడంతో పాటు క్వాలిటీ కూడా బాగుండేవి.
కానీ పదేండ్లుగా రియల్ ఎస్టేట్‌రంగం విస్తరించడంతో పూలు, పండ్ల తోటలన్నీ కనుమరుగై, ఎటుచూసినా వెంచర్లు దర్శనమిస్తున్నాయి. పదేండ్ల క్రితం వరకు 2 వేల ఎకరాల్లో సాగైన పూలతోటలు 2018 నాటికి 11వేల ఎకరాలకు, ప్రస్తుతం 5 వేల నుంచి 6 వేల ఎకరాలకు పడిపోయినట్టు హార్టికల్చర్ లెక్కల ద్వారా తెలుస్తున్నది.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
ఒకప్పుడు పూలు, పండ్లు సాగైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కీసర, మేడ్చల్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్‌నగర్ తదితర మండలాల్లోని లక్షల ఎకరాలు రియల్టర్ల చేతిలోకి వెళ్లిపోయాయి. ఆయా భూములన్నీ వెంచర్లుగా మారి, ఖనీలు, పెన్సింగ్లు, గోడల నడుమ పిచ్చిమొక్కలు, సర్కారు తుమ్మలతో బీడు భూములుగా దర్శనమిస్తున్నాయి.
ఇలా ఓ వైపు రియల్ ఎస్టేట్, మరో వైపు సర్కారు ప్రోత్సాహం లేకపోవడం వల్లే రైతులు పండ్లు, పూల సాగు బంద్పెట్టినట్టు హార్టికల్చర్ఆఫీసర్లు చెప్తున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ శివారు జిల్లాల్లో ఫ్లోరీ కల్చర్, గ్రేప్ గార్డెన్స్ కనుమరుగయ్యాయని అంటున్నారు. ఈ విషయంలో మనకంటే మహారాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆదర్శంగా ఉందని చెప్తున్నారు.
ముంబై చుట్టూ పూలు, పండ్ల సాగును అక్కడి ప్రభుత్వం ఎంతగానో ప్రోత్సహిస్తున్నదని, కొత్తగా పూలు, పండ్ల సాగు చేపట్టే వారికి బ్యాంక్ లోన్లతో పాటు పాలీహౌస్‌లు, గ్రీన్నెట్స్, పందిర్లకు కావాల్సిన సామగ్రి, ఫంగీసైడ్స్, పెస్టిసైడ్స్, మోడ్రన్ఎక్విప్మెంట్, డ్రిప్, ఇతర పరికరాలను సబ్సిడీ పై అందజేస్తున్నదని వివరిస్తున్నారు. ఎకరాకు రూ.2 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఎకరాకు రూ.80 వేల పరిహారం కూడా ఇస్తున్నదని చెప్తున్నారు. కానీ మనదగ్గర మాత్రం భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయాన్నే చూస్తూ రైతులను ప్రోత్సహించకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని గుర్తుచేస్తున్నారు.
పోనీ వేలాది ఎకరాల్లో వేసిన వెంచర్లలో ఎవరైనా ఇండ్లు కడ్తున్నారా? అంటే అదీ లేదు. రైతుల నుంచి భూములు కొని వెంచర్లు చేసి, అమ్ముకున్న రియల్టర్లు వందల కోట్లు సంపాదించుకోగా, నమ్మి పెట్టుబడి పెట్టిన సామాన్యులు అక్కడ ఇండ్లు కట్టలేక, ఎవరికీ అమ్మలేక నష్టపోయారు. అటు బంగారు పంటలు పండే భూములన్నీ పడావుగా మిగిలిపోయాయి. అదే సమయంలో అధికరేట్లు పెట్టి బెంగళూరు, ఢిల్లీ నుంచి పూలను, ఇతర రాష్ట్రాల నుంచి పండ్లను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. దీని వల్ల వాటి రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి.
ద్రాక్ష తోటలు కనుమరుగు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఒకప్పుడు తియ్యని ద్రాక్ష తోటలకు పెట్టింది పేరు. కీసర, మేడ్చల్, ఘట్‌కేసర్, శామీర్‌పేట్, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, ఫరూక్‌నగర్ తోపాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్, ములుగు, వర్గల్, తూప్రాన్ మండలాల్లోని సుమారు 5 వేల ఎకరాలకు పైగా ద్రాక్షతోటలు ఉండేవి.
ప్రత్యేకించి ములుగు, గజ్వేల్, తూప్రాన్‌ల పరిధిలోనే సుమారు 2 వేల ఎకరాల వరకూ సాగయ్యేవి. ఈ తోటలు ఉండడాన్ని కొందరు బడా రైతులు హోదాగా భావించేవారు. వందల ఎకరాల్లో ద్రాక్ష తోటలు పెంచి, జాతీయస్థాయిలో పురస్కారాలు అందుకున్నవారు కూడా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యాపారులు, వంటిమామిడి, తునికి బొల్లారం, తునికి ఖల్స, తుర్కపల్లి తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసి, కౌలుకు తీసుకొని ద్రాక్ష తోటలను వేసేవారు.
తాజ్-ఏ- గణేష్, బ్లాక్, థామ్సన్ సీడ్‌లెస్ రకాలను ఎక్కువగా సాగుచేసేవారు.18 మిల్లీమీటర్ల సైజులో పండిన ద్రాక్షను మన అవసరాలకు పోగా కర్నాటక, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనుమరుగైంది. కేవలం మేడ్చల్, కీసర, ఘట్‌కేసర్ ప్రాంతాల్లో ఇప్పుడు సుమారు 200 ఎకరాలకే ఈ పంట పరిమితమైంది.