- పెరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు
- గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకురిజిస్ట్రేషన్ల శాఖకు రూ.11 వేల కోట్లు ఆదాయం
- వచ్చే మార్చి నాటికి ఇంకో 4 వేల కోట్లు వస్తాయని అంచనా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటున్నది. డిసెంబర్ నుంచి క్రమంగా రిజిస్ర్టేషన్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నాన్ అగ్రికల్చర్‌తో పాటు అగ్రికల్చర్ భూముల లావాదేవీలు మరింత పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తున్నది. భూముల ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయని రియల్టర్లు పేర్కొంటున్నారు.
ఒక్కసారి ఆర్ఆర్ఆర్ పనులు మొదలైతే.. క్రమంగా అమ్మకాలు, కొనుగోళ్లు పెరుగుతాయి. ఉమ్మడి జిల్లాలుగా చూస్తే రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్‌లోని భూములపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే కొత్త జిల్లాలుగా చూస్తే 12–15 జిల్లాల్లో భూములకు రియల్ బూమ్ రానుంది. అలాగే, ప్రభుత్వం రీజినల్ రింగ్ రైల్ ప్రతిపాదనను తెచ్చింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం పెట్టుకున్నంత స్థాయిలో స్టాంప్ అండ్ రిజిస్ర్టేషన్ల శాఖకు ఆదాయం రాలేదు. 2023 డిసెంబరులోనే కొత్త ప్రభుత్వం రావడం, తరువాత మూడు నెలలకే లోక్ సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మందగించింది. హైదరాబాద్‌లో ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో గ్రోత్ ఉన్నప్పటికీ.. జిల్లాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల లావాదేవిల్లో స్తబ్ధత నెలకొన్నది. అయితే, గత నెల నుంచి రిజిస్ర్టేషన్ల నమోదు పెరుగుతున్నది.
వికేంద్రీకరణతో రియల్ బూమ్
మెట్రో, ఫ్యూచర్ సిటీతో పాటు జిల్లాలకు కొత్త రోడ్లు, కొత్త ఎయిర్‌పోర్టులు, ఇండస్ట్రియల్ కారిడార్లను ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తున్నది. ఒక్కోదానికి టెండర్లు ఆహ్వానిస్తున్నది. వీటిలో పనుల వేగం పెరుగుతున్న కొద్దీ.. భూములకు డిమాండ్ ఎక్కువవుతోంది. వరంగల్‌లో మామునూరు ఎయిర్ పోర్ట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెంలో ఇంకో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని తెలుస్తోంది.
పెద్దపల్లి, నిజామాబాద్ లేదా ఆదిలాబాద్జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. వీటితో పాటు నేషనల్ హైవేలు, జిల్లాలకు రోడ్ల విస్తరణను మొదలుపెడుతోంది. ఈ ప్రాంతాల్లో రియల్టర్లు భారీగా వెంచర్లు, లే అవుట్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అభివృద్ధి కార్యకలాపాలను వికేంద్రీకరిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే నాటికి రియల్ రంగం పూర్తి స్థాయిలో పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు.
రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఎకరా కనీస ధర రూ.20 లక్షలకు తక్కవ లేదు. కొంతకాలంగా గ్రామాల్లో నిలిచిపోయిన వ్యవసాయ భూముల అమ్మకాలపై ప్రస్తుతం రియల్టర్లు మొగ్గుచూపుతూ బేరసారాలకు తిరుగుతున్నారు. హైదరాబాద్‌లో చూస్తే ఆర్థిక వృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలతో ఇండ్లు, ప్లాట్ల విక్రయాలు పెరిగాయి. 2023లో నగరంలో 12 శాతం వృద్ధిరేటుతో 36,974 ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. నిరుడు 44,013 యూనిట్లు లాంచ్ అయ్యాయి. హైటెక్ సిటీ, కోకాపేట, రాయదుర్గం, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లలో ఎక్కువగా లావాదేవిలు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్, కొంపల్లిలో ధరల పెరుగుదల అధికంగా ఉందని నైట్ ఫ్రాంక్ సంస్థ వెల్లడించింది.
ఎల్ఆర్ఎస్ పరిష్కారమైతే పెరగనున్న ఆదాయం
2023– 24 ఆర్థిక సంవత్సరంలో రూ.14,588.06 కోట్ల ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ర్టేషన్ల శాఖ ద్వారా వచ్చింది. అయితే, 2024–25లో ప్రభుత్వం రూ.18,229 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకు న్నది. అయితే, ఇప్పటి వరకు వచ్చిన రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే మార్చి నాటికి ఇంకో రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లు వస్తాయని చెబుతున్నారు. దీంతో రూ.15 వేల నుంచి 16 వేల కోట్ల లోపే ఆదాయం పరిమితం అవుతుంది.
తరువాత రియల్ బూమ్‌తో కొత్త ఆర్థిక సంవత్సరంలో రిజిస్ర్టేషన్లు పెరుగుతాయని.. ఫలితంగా ఎక్కువ ఆదాయం వస్తుందని పేర్కొంటున్నారు. అనధికారిక లేఅవుట్ల విషయంలో వేలల్లో డాక్యుమెంట్లు రిజిస్ర్టేషన్లు కావడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల పైన ప్లాట్లు పెండింగ్‌లో ఉనట్లు తెలుస్తోంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ తీసుకోనుంది. దీంతో త్వరలో మరిన్ని క్రయ, విక్రయాలు పెరుగుతాయని చెబుతున్నారు.