ఫోన్ ట్యాపింగ్‌ను గత బీఆర్‌ఎస్ సర్కార్ తిరుగులేని ఆయుధంగా వాడుకున్నట్లు తేలింది. ప్రతిపక్షాలతోపాటు స్వపక్షంపైనా ఈ అస్త్రాన్నే ప్రయోగించినట్లు బయటపడింది. సినిమా, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ రంగాల ప్రముఖుల కాల్స్‌ను కూడా రికార్డ్ చేసినట్లు వెల్లడైంది. బంధువులను కూడా వదలలేదని విచారణలో వెలుగుచూసింది. పారిశ్రామిక వేత్తల కాల్స్‌ను రికార్డ్ చేసి వాళ్లకే వాటిని తిరిగి పంపి బ్లాక్ మెయిల్ చేశారని, అట్ల బ్లాక్ మెయిల్ చేసి నాడు బీఆర్ఎస్కు కోట్లాది రూపాయల నిధులను ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాబట్టకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఎవరినీ వదలలే!
ప్రజారక్షణ కోసం పనిచేయాల్సిన పోలీసింగ్‌ను గత బీఆర్‌ఎస్ సర్కార్ తన సొంత ఎజెండాకు వినియోగించుకుందని మొదటి నుంచి విమర్శలు వస్తున్నాయి. ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారం బయటకు రావడంతో అది వాస్తవమని రుజువైంది. ప్రణీత్‌రావు టీమ్‌తో బడా వ్యాపారుల నుంచి ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించారని.. ప్రతిపక్ష నేతలు, పౌరహక్కుల సంఘాలను అణచివేసే విధంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో ఇల్లీగల్ ఆపరేషన్స్ చేసినట్లు ప్రస్తుతం పోలీసుల విచారణలో తేలింది.
ALSO READ :- బీఆర్ఎస్ లో వాళ్లు పోటీకి నిరాకరించడంతోనే వీళ్లకి టికెట్లు
కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, వాళ్ల కుటుంబ సభ్యులు, సొంత పార్టీలోని నాయకులు, రూ. వేల కోట్ల లావాదేవీలు జరిపే ఇండస్ట్రియలిస్ట్‌లు, రియల్ ఎస్టేట్, ఫార్మా, జువెల్లరీ వ్యాపారులు.. ఇట్లా ఎవరినీ వదలకుండా అందరినీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా గత ప్రభుత్వం టార్గెట్చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయిల్ నుంచి అత్యాధునిక సాఫ్ట్‌వేర్, ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఇందుకు అవసరమైన డబ్బును ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ద్వారా చెల్లించినట్లు తెలిసింది.