హైదరాబాద్, వెలుగు : నిబంధనలు ఉల్లంఘించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) స్పష్టం చేసింది. కొనుగోలుదారుల హక్కులు పరిరక్షించడంతో పాటు బిల్డర్లు, ప్రమోటర్లు, ఏజెంట్లు పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేసేందుకు రెరా కృషి చేస్తుందని అథారిటీ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘రెరా’ అనుమతులున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో కొనుగోలు చేయడం ద్వారా కొనుగోలుదారులకు భద్రత, భరోసా చేకూరుతుందని అథారిటీ తెలిపింది. రేరా నిబంధనలు ఉల్లంఘించిన పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అథారిటీ వెల్లడించింది.
రూల్స్ ఉల్లంఘించిన మియాపూర్‌లోని ప్రజ్ఞ ఎకో స్పేస్, చింతల్‌కుంటలోని శ్రీసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్, కొండాపూర్‌లోని నార్త్ ఈస్ట్ హెబిటేషన్స్, సంగారెడ్డి జిల్లా వీఆర్. ప్రమోటర్స్ అండ్ డెవలపర్స్, కెపీహెచ్‌బీ కాలనీలోని ఇన్వెస్ట్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్, కొంపల్లి భారతీ లేక్‌వ్యూ టవర్ బిల్డర్స్, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై 15 రోజులలోగా సంజాయిషీ ఇవ్వాలని నోటీసులు జారీ చేసినట్లు రెరా అథారిటీ తెలిపింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీజీఐఐసీ ఇతర స్థానిక సంస్థల అనుమతులతో పాటు ‘రెరా’లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలని పేర్కొంది. అలా అయితేనే కొనుగోలుదారులకు భద్రత, భరోసా చేకూరుతుందని, ఇల్లు, ఫ్లాట్ కొనాలి అనుకునే వారు రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్‌ల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, ఫ్రీలాంచ్ ఆఫీసర్లను నమ్మి రిజిస్ట్రేషన్ లేని ప్రాజెక్టులలో కొని మోసపోవద్దని సూచించింది.
రిజిస్ట్రేషన్ లేకుండా యాడ్స్ ఇవ్వడం నేరం
‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా సంస్థలు వ్యాపార ప్రకటనలు జారీ చేయడం చట్ట రీత్యా నేరమని అథారిటీ స్పష్టం చేసింది. కొనుగోలు చేసే ముందు ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి జవాబుదారీతనం, పారదర్శకత కోసం లీగల్ టైటిల్, లే -అవుట్ ప్లాన్ ఆమోదం, సంబంధిత అథారిటీల అనుమతి ఉత్తర్వులు, ప్రాజెక్ట్‌ను ఇన్‌టైంలో పూర్తి చేస్తామని చెప్పాలన్నారు. బిల్డర్లు చెప్పిన వివరాలతో పాటు ప్రాజెక్ట్, ప్రమోటర్ పేరు, చిరునామా, ఇతర అన్ని వివరాలు ‘రేరా వెబ్‌సైట్‌లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఎవరైనా రెరా రూల్స్ ఉల్లంఘించినట్లయితే 90000 06301, 040 -29394972తో పాటు rera-maud@telangana.gov.in, secy-rera-maud@telangana.gov.in మెయిల్ ఐడీలకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. వాటిని పరిశీలించిన అనంతరం ఉల్లంఘనలు నిజమని తేలితే ఫైన్ విధించడంతో పాటు, చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 8,270 ప్రాజెక్ట్‌లకు రిజిస్ట్రేషన్లు జారీ చేశామని అథారిటీ తెలిపింది. అలాగే 918 ప్రాజెక్ట్‌లు రూల్స్ ఉల్లంఘించినట్లు గుర్తించి రూ.30,99,12,963 ఫైన్ వేశామన్నారు. ఇందులో రూ. 13,70,08,925 వసూలు చేశామన్నారు.