- గుంట భూమికి రూ.5 లక్షలు వసూలు చేసిన ‘వి ఓన్ఇన్ఫ్రా’
- నెల నెలా వడ్డీ అంటూ చీటింగ్
- కేపీహెచ్‌బీ పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు
కూకట్పల్లి, వెలుగు: గుంటల్లో భూమి అమ్ముతామని, 25 నెలల తర్వాత వడ్డీతో సహా కట్టి భూమి వెనక్కి తీసుకుంటామని ఆశచూపి, కేపీహెచ్బీలో ఓ రియల్ఎస్టేట్సంస్థ భారీ మోసం చేసింది. డబ్బులివ్వాల్సిన టైం అయిపోయినా స్పందించకపోవడంతో శనివారం 80 మంది బాధితులు కేపీహెచ్‌బీ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేపీహెచ్‌బీ పీఎస్పరిధిలోని సర్దార్‌పటేల్‌నగర్‌లో కొన్నేండ్ల కింద సురేశ్కుమార్అనే వ్యాపారి ‘వి ఓన్ఇన్ఫ్రా గ్రూప్’ పేరుతో రియల్ఎస్టేట్సంస్థను ప్రారంభించాడు.
తమకు వికారాబాద్‌జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్‌లో 30 ఎకరాల భూమి ఉందని, గుంట భూమిని రూ.5 లక్షలకే ఇస్తామని నమ్మబలికాడు. కట్టిన మొత్తానికి నెల నెలా నాలుగు శాతం వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేశాడు. 25 నెలల తర్వాత తమ భూమిని తాము తీసుకుని వడ్డీతో సహా రూ.5 లక్షలు ఇస్తామని నమ్మబలికాడు. ఇలా నాలుగేండ్ల కింద బిజినెస్మొదలుపెట్టాడు. మొదట్లో చేరిన వారికి నెల నెలా వడ్డీ చెల్లించడంతో నమ్మిన వందల మంది పెట్టుబడులు పెట్టారు.
ఏడాదిన్నర నుంచి వడ్డీ చెల్లించడం ఆపేశాడు. చాలామంది A25 నెలల పాటు ఓపిక పట్టినా డబ్బులు ఇవ్వకపోవడం, యాజమాన్యాన్ని సంప్రదించినా స్పందన లేకపోవడంతో శుక్రవారం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఎవరైనా బాధితులుంటే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.